-తెలంగాణ తల్లులకు ఇది కేసీఆర్ సర్కార్ వరం! -నవజాత శిశువులకు ఓ బహుమానం! అదే కేసీఆర్ కిట్!!
ఆరోగ్యకర భావి సమాజాన్ని ఆకాంక్షించిన ప్రభుత్వం.. తల్లీబిడ్డలకు అవసరమైన 15కుపైగా వస్తువులందించేందుకు సిద్ధమవుతున్నది. పేద గర్భిణుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని.. వారికి మూడు విడుతల్లో రూ.4వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించింది. ఆరోగ్యలక్ష్మి కింద ఇప్పటికే పోషకాహారం అందిస్తున్న ప్రభుత్వం.. గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు విశేష సేవలందిస్తున్న అంగన్‌వాడీలకూ అనేక వరాలిచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనాపగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. మొత్తం సామాజిక, ఆర్థిక వ్యవస్థను ప్రగతిబాటలో పయనింపజేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నది. వేతనాలు, పింఛన్ల పెంపుదల వంటి తక్షణ ఉపశమన చర్యలేకాకుండా.. పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నది.పాలనకు మానవీయ కోణం.. విధానాలకు సామాజిక దృక్పథం.. అట్టడుగు ప్రజల అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళికలు అన్నివర్గాల ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలే పరమావధి.. కొత్త ఒరవడితో సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన

-అట్టడుగు వర్గాలకు ఆర్థిక సత్తువతో విప్లవాత్మక మార్పులు -ఎంబీసీల అభివృద్ధికి వెయ్యి కోట్ల నిధితో కార్పొరేషన్ -తొలి ఏడాదిలోనే విద్యుత్ రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు -ప్రపంచ ప్రఖ్యాతి పొందుతున్న టీఎస్ ఐపాస్ -హైదరాబాద్‌లో కేంద్రాల ఏర్పాటుకు ప్రపంచ దిగ్గజ కంపెనీల సంసిద్ధత -యుద్ధప్రాతిపదికన పూర్తవుతున్న తాగు, సాగునీటి ప్రాజెక్టులు -ప్రతి బాలింతకు 2 వేల వ్యయంతో 15 వస్తువుల ప్యాక్ -ప్రసవం వరకు మూడు విడుతల్లో 12వేల ఆర్థిక సాయం -ఆరోగ్యలక్ష్మి పథకంతో తల్లీబిడ్డలకు పోషకాహారం -అంగన్‌వాడీలకు వరాలు, పిల్లలందరికీ సన్నబియ్యం అన్నం -భావి తెలంగాణ సమాజ అభ్యున్నతే లక్ష్యం
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేసేవాడు రాజకీయ నాయకుడు. వచ్చే తరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసేవాడు రాజనీతిజ్ఞుడు అని రచయిత జేమ్స్ ఫ్రీమాన్ అంటారు. దుఃఖం ఎక్కడ ఉందో గుర్తించడం, ఎందుకు ఉందో అర్థం చేసుకోవడం, దానిని పరిహరించడానికి కృషిచేయడం.. ఒక స్పష్టమైన దృక్పథం, దార్శనికత ఉన్నవాళ్లు మాత్రమే చేయగలపని. ఎన్నికలప్పుడు ఏవో తాయిలాలు ప్రకటించి, ఓటర్లను మాయచేసి, ఓట్లు వేయించుకుని, మళ్లీ ఐదేండ్లు మర్చిపోవడం మామూలు నాయకులు చేసేపని. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమాజంలోని అట్టడుగు పొరల్లో అభివృద్ధికి దూరంగా ఉంటున్న వర్గాల కష్టాలను శాశ్వతంగా తొలగించడానికి కృషిచేస్తున్నారు. పాలనకు మానవీయకోణాన్ని, విధానాలకు సామాజిక దృక్పథాన్ని అద్ది నిర్ణయాలు చేస్తున్నారు. సంక్షేమం ఒక చేత, ఆర్థిక సత్తువ కల్పించే సంస్కరణలు మరో చేత అమలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున నియామకాలు, హోంగార్డులు, మునిసిపల్ కార్మికులు మొదలు కాంట్రాక్టు లెక్చరర్లవరకు అందరి వేతనాల పెంపు, అన్నిరకాల పింఛన్ల పెంపుతోపాటు వృత్తులను పరిశ్రమలుగా తీర్చిదిద్దే మాంస, మత్స్య పరిశ్రమల అభివృద్ధి ప్రణాళికలూ అందులో భాగమే. బాలింతలకు అందించనున్న పారితోషికం, కేసీఆర్ కిట్, అంగన్‌వాడీలకు వరాలు, పిల్లలందరికీ సన్నబియ్యం అన్నం.. ఇవన్నీ ఆ దృక్పథం నుంచి వచ్చినవే.
ఆ దిశలోనే పేద కుటుంబాల్లో గర్భిణులు అనుభవించే కష్టనష్టాలను ఆయన పరిష్కరించాలనుకున్నారు. పేద కుటుంబాల్లో ప్రతిమనిషి రెక్కాడితేగానీ కుటుంబాలు గడువవు. గర్భవతిగా ఉన్నప్పుడు పనికిపోవడం సాధ్యంకాదు. పనికిపోతే అనేక అనారోగ్య సమస్యలకు గురికావలసి వస్తుంది. పోకపోతే కూలీ నష్టపోవాల్సి వస్తుంది. కూలీ లేకుండా ఇంట్లో కూర్చుంటే ఇంటిల్లిపాదీ చిన్నచూపు చూస్తారు. ముఖ్యంగా ప్రసవానికి నాలుగు మాసాల ముందు, నాలుగు మాసాల తర్వాత గర్భిణి ఆరోగ్య పరిస్థితి పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. పుట్టే పిల్లలు రేపటి తెలంగాణ సంపద. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్.. తిండి కలిగితె కండ కలదోయ్.. కండకలవాడేను మనిషోయ్.. అన్న కవి మాటలు అందరం గుర్తుపెట్టుకోవాలె. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలి. శిశుమరణాలు ఆగిపోవాలి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇటీవల అంగన్‌వాడీల సమావేశంలోనూ, అధికారుల సమావేశంలోనూ గట్టిగా చెప్పారు. ఇన్నేండ్ల రాజకీయాల్లో ఏ నాయకుడయినా ఎప్పుడయినా ఇట్ల ఆలోచించిండా అని ఓ అంగన్‌వాడీ కార్యకర్త సమావేశం నుంచి బయటికి వచ్చిన అనంతరం సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలంతా సమాజంలో అత్యంత తక్కువ వేతనంతో పనిచేస్తున్న వర్గాలు. అత్యంత అట్టడుగు వర్గాల (బాటమ్ లైన్) పిల్లలకు సేవ చేస్తున్నవారు. వారు బాగుంటేనే పిల్లలను బాగా చూసుకుంటారు. పుట్టేతరం బాగుంటేనే సమాజం బాగుంటుంది. అందుకే వారి వేతనాల విషయంలో సీఎం ఉదారంగా వ్యవహరించారు. ఈసారి వారు అడిగిన దానికంటే ఎక్కువ వేతనం ఇచ్చారు అని శిశుసంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గర్భిణులకు మూడు దఫాలుగా రూ.12,000 అందిస్తారు. గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత తల్లీ బిడ్డా పోషకాహారం తీసుకోవాలి. గర్భిణిగా నమోదు చేసుకున్న వెంటనే నాలుగు వేలు, ప్రభుత్వ దవాఖానలో ప్రసవం అయిన సందర్భంగా మరో 4వేలు, ఆ తర్వాత పిల్లలకు టీకాలు వేయించే సందర్భంలో తుది విడత నాలుగు వేలు ప్రభుత్వం అందజేస్తుంది. ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
కేసీఆర్ కిట్‌లో ఏముంటాయి? -రాష్ట్రంలో నవజాత శిశు, మాతా సంరక్షణ కోసం రూ.2,000 వ్యయంతో కూడిన కేసీఆర్ కిట్‌లో సుమారు 15కుపైగా వస్తువులు ఉంటాయి. -టవల్, డ్రెస్, బేబీ బెడ్, మెత్త, దోమతెర, నాప్కిన్స్, ఆయిల్ బాటిల్ (100 ఎంఎల్), బేబీ షాంపూ (60ఎంఎల్), సబ్బు, సబ్బు పెట్టె, నెయిల్ కట్టర్, ఒక బొమ్మ, గిలక్కాయ, హ్యాండ్ వాష్ ఆయిల్ (250 ఎంఎల్), తల్లి కోసం-100 గ్రాముల సబ్బు, 100 గ్రాముల సౌభాగ్య పిండి (సున్నిపిండి) తదితరాలు.
కీలక కర్తవ్యంలో ఉన్న అంగన్‌వాడీలకు భరోసా తెలంగాణ సమాజం ఆరోగ్యవంతంగా తయారవడంలో మొదటి పాత్ర.. కీలకమైన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు అంగన్‌వాడీలు. గర్భిణులతోపాటు బాలింతలకు, పుట్టిన పిల్లలకు పోషకాహారాన్ని అందించడంలో, వారికి బాగోగులు చూడటంలో వారిది ఎనలేని కృషి. అందుకే అంతటి కీలకమైన పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటీవల అంగన్‌వాడీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి.. వారి సమస్యల పరిష్కారంతోపాటు.. పలు వరాలు కురిపించారు. అవి..
-అంగన్‌వాడీ కార్యకర్తల హోదాను అంగన్‌వాడీ టీచర్లుగా మార్పు. గంటల వ్యవధిలో ఉత్తర్వులు జారీ. -అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు రూ.7,000 నుంచి రూ.10,500కు పెంపు, హెల్పర్లకు రూ.4,500 నుంచి రూ.6,000 పెంపు. -పదోన్నతుల్లో వయో పరిమితి తొలగింపు. -పదవీ విరమణ అనంతరం బెనిఫిట్స్ కల్పించాలని నిర్ణయం. -అంగన్‌వాడీ కార్యకర్తల్లో సొంత ఇండ్లు లేని వారికి డబుల్‌బెడ్‌రూం స్కీంలో ప్రాధాన్యం. -హెల్త్ కార్డుల జారీ అంశాన్ని పరిశీలించాలని నిర్ణయం. -అర్హత ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు సూపర్‌వైజర్లుగా పదోన్నతులు. -ప్రభుత్వ పాఠశాల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రారంభిస్తే అంగన్‌వాడీ కేంద్రాలకే 100 శాతం అవకాశం. -అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, పిల్లల భోజనానికి మార్చి నుంచి సన్నబియ్యం. -చనిపోయిన అంగన్‌వాడీకార్యకర్తల అంత్యక్రియలకు ఆర్థిక సాయం.
రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు పునాదులు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి అన్ని విధాల పునాదులు వేస్తున్నది. మన రాష్ట్రం ఆర్థిక బలాబలాలు తెలుసుకోవడానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఒక ప్రాతిపదిక ఏర్పడింది. మనది ఆర్థికంగా ఎదిగే రాష్ట్రమా, కుంగే రాష్ట్రమా అన్నది ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మనకు తెలిసి పోయింది. మనకు స్పష్టత వచ్చింది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు భరోసాతో భారీ ఆర్థికాభివృద్ధి పథకాలు రచించడానికి సిద్ధపడుతున్నది అని ఒక ఆర్థిక నిపుణుడు అన్నారు. వచ్చిన కొద్ది మాసాల వ్యవధిలోనే పారిశ్రామిక రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ విద్యుత్ కొరతను అధిగమిస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నది. ఒకప్పుడు ఎండాకాలం వస్తే జనరేటర్లు, ఇన్వర్టర్ల హడావిడి ఉండేది. దుకాణాలు డీజిల్ పొగతో నిండిపోయి ఉండేవి. లో ఓల్టేజితో కరెంటు మోటార్లు కాలిపోయి రైతులు నానాయాతన పడేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కష్టాలను జయించాం అని వరంగల్ జిల్లాకు చెందిన ఒక రైతు నాయకుడు గుర్తు చేశారు. తెలంగాణలో విద్యుత్ వినియోగం అసాధారణంగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పీక్ లోడ్ వినియోగం 180 మిలియన్ యూనిట్లు కాగా, ఇప్పుడు పది జిల్లాలలోనే పీక్‌లోడ్ వినియోగం 180 నుంచి 190 మిలియన్ యూనిట్లకు చేరింది. ఇది తెలంగాణ సాధించిన విజయానికి తార్కాణం అని విద్యుత్ కార్మిక సంఘం నాయకులు చెప్పారు. టీఎస్ ఐపాస్‌ను పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ కంపెనీలు ప్రశంసించడమేకాదు.. కేంద్రం ఏర్పాటుచేసిన సులభ వాణిజ్య ర్యాంకింగులో కూడా మొదటిస్థానాన్ని సంపాదించిపెట్టింది. వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వచ్చాయి. కొత్త పరిశ్రమల ద్వారా ఇప్పటికే 43 వేల మందికి కొత్తగా ఉపాధి కల్పించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐదు పెద్ద సంస్థలు (ఉబెర్, గూగుల్, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్) హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు అమెరికా తర్వాత ప్రపంచంలోనే తిరిగి అంతపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాయి.
ఎవరెవరికి ఏమేమి చేశారు? కేసీఆర్ ఒక్క అంగన్‌వాడీల విషయంలోనే కాదు సమాజంలో కిందిస్థాయిలో పనిచేస్తున్న అన్ని తరగతుల ఉద్యోగుల వేతనాలు పెంచడంలోని ఉద్దేశం కూడా వారి ఆర్థిక సత్తువను పెంచడమే. దాదాపు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. -2015 జనవరి 1 నుంచి మాతా, శిశు సంరక్షణ కోసం ఆరోగ్య లక్ష్మి పథకం అమలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా పౌష్టికాహారం అందిస్తున్నారు. సార్వత్రిక సంపూర్ణ భోజనం పేరుతో ఇస్తున్నారు. ఈ పథకం కింద 15,05,995 మంది లబ్ధిపొందుతున్నారు. వీరిలో 7నెలల నుంచి మూడేండ్లలోపు వయసున్న చిన్నారులు 9,67,845 మందికి ప్రతిరోజూ రూ.7.12 ఖర్చుతో బాలామృతం, నెలకు 15 గుడ్లు సరఫరా. మూడు నుంచి ఆరేండ్లలోపు వయసున్న చిన్నారులు 5,38,150 మందికి రోజుకు రూ.7.96తో భోజనం, నెలకు 30 గుడ్లు, 200 మి.లీ పాలు సరఫరా. -బాలింతలు, గర్భిణులు 3,95,466 మంది లబ్ధిదారులకు ప్రతి రోజు రూ.21 ఖర్చుతో నెలకు 25 రోజుల భోజనం, 30 గుడ్లు, పాలు సరఫరా. ఈ ఖర్చులో కేంద్ర ప్రభుత్వం రూ.7 అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 ఖర్చు చేస్తున్నది.
-తెలంగాణ రాష్టం ఏర్పాటైన నేపథ్యంలో.. 2.75 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు తీసుకున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేవలం 39% మాత్రమే ఫిట్‌మెంట్ ఉండేది. కాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయం ప్రకారం 10వ పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో 43% ఫిట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ నిర్ణయంవల్ల జూనియర్ ఉద్యోగులకు నెలకు కనీసం రూ.6,000వరకు, సీనియర్ ఉద్యోగులకు రూ.15,000 వరకు జీతాలు పెరిగాయి. అంటే మూల వేతనంపై 43% జీతాలు పెరిగాయి. ఇందులో 1.17 లక్షల మంది ఉపాధ్యాయులు లబ్ధి పొందుతున్నారు. దాదాపు 4,000 మంది లెక్చరర్లకు ప్రయోజనం కలుగుతున్నది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో పనిచేస్తున్న 800 మంది లెక్చరర్లకు 125% వరకు జీతాలు పెరిగాయి. -కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు 50% వేతనాలు పెరిగాయి. అలాగే దాదాపు 50వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 50% వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు 100% వేతనాలు పెంచారు. గత పాలనలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు రూ.19 వేలు మాత్రమే చెల్లించగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 100 శాతం జీతం పెంచారు. రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లతో సమానంగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు రూ.37,100కు వేతనాలు పెంచారు. -పాలిటెక్నిక్ కాలేజీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలను కూడా రూ.20,000 నుంచి 40,860 వరకు పెంచారు. దీనివల్ల 465 మంది పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్లు లబ్ధి పొందుతున్నారు. -జీహెచ్‌ఎంసీలో ఔట్‌సోర్సింగ్ కార్మికులకు జీతాలు భారీగా పెరిగాయి. -స్వీపర్లకు గత ప్రభుత్వ హయాంలో రూ.8,500 ఉంటే ఇప్పుడు రూ.15,500కు పెంచారు. -డాటా ఎంట్రీ ఆపరేటర్లకు జీతం రూ.9,500 ఉండేది. దీన్ని రూ.15వేలకు పెంచారు. -మునిసిపల్ కార్మికుల వేతనాల పెంపు. -హోంగార్డుల వేతనాలను పెంచడమే కాకుండా వారికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. -వీఆర్‌ఏల వేతనాల పెంపు. -ఐకేపీ ఉద్యోగుల వేతనాల పెంపు. -కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. -హాస్టళ్లలో విద్యార్థులకు, రేషన్ బియ్యం పొందే ప్రజలకు సన్నబియ్యం ఇవ్వడం. -24,000 మంది విద్యుత్ ఎన్‌ఎంఆర్‌లను క్రమబద్ధీకరించడం. -అన్నిరకాల పింఛన్లు కనీసం వెయ్యి రూపాయలకు పెంచడం. -బీడీకార్మికులకు కూడా భృతి అందజేయడం. -వికలాంగుల పింఛన్లను రూ.1500కు పెంచడం. -ఒంటరి మహిళలకు పింఛన్లు. -అనాథలను ప్రభుత్వమే దత్తత తీసుకుని వారి బాగోగులు చేపట్టడం. -మైనారిటీలకు 220 గురుకుల పాఠశాలలు ప్రారంభించడం. -జర్నలిస్టుల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిధులు కేటాయించడం. -రేషను బియ్యంపై గతంలో ఉన్న పరిమితిని ఎత్తివేసి.. ఇంట్లో ఎందరు ఉంటే అందరికీ నెలకు ఆరు కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం. -మృతదేహాలను ఇండ్ల వద్ద వదిలి రావడానికి ప్రతి దవాఖానవద్ద ఉచిత అంబులెన్సులు ఏర్పాటు చేయడం. -బ్రాహ్మణ సంక్షేమానికి పరిషత్తు ఏర్పాటు, వంద కోట్ల కేటాయింపు.
యుద్ధ ప్రాతిపదికన తాగు, సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణ జీవన రంగాలన్నింటినీ ప్రభావితం చేసే తాగు, సాగునీరు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. గోదావరి, కృష్ణా నదుల నుంచి గరిష్ఠ నీటి వినియోగం లక్ష్యంగా కోటి ఎకరాల సాగు టార్గెట్‌గా వడివడిగా పనులు చేసుకుపోతున్నది. ఇవ్వాళ మహబూబ్‌నగర్‌లో నాలుగున్నర లక్షల ఎకరాల్లో పచ్చని పంటపొలాలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు వలసల బాట పట్టిన పాలమూరుకు ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పనులకోసం వలసలు వచ్చే పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం రాత్రుళ్లు కాపలాకాసి మరీ ప్రాజెక్టుల హెడ్‌వర్క్స్ అన్నీ పూర్తి చేయించింది. వచ్చే ఏడాది 8 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. నా కొల్లాపూర్.. కోనసీమకంటే అందంగా తయారవుతుంది అని ప్రాజెక్టులపై విస్తృతంగా పనిచేస్తున్న ఓ ఇంజినీర్ చెప్పారు. మిషన్ కాకతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చింది. మోడువారిన పల్లెలు తిరిగి కళకళలాడుతున్నాయి. పూడిపోయిన చెరువులు ఇప్పుడు చేపల గెంతులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. శాశ్వతప్రాతిపదికన పల్లె దాహార్తిని తీర్చే మిషన్ భగీరథను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పూర్తి చేస్తున్నది. దేశంలో మునుపెన్నడూ ఏ ప్రభుత్వమూ సాహసించని విధంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నది.
వృత్తులను పరిశ్రమగా మలిచే కృషి.. గ్రామాల్లో మనకు పనిచేసే మనుషులు లక్షలమంది ఉన్నారు. వారందరికీ పనిచేసే నేర్పు ఉంది. అసాధారణమైన వృత్తి నైపుణ్యం ఉంది. ఇప్పుడు వారి శ్రమశక్తి అంతా నిరుపయోగంగా ఉంది. వారికి పనికల్పిస్తే తెలంగాణలో అద్భుతాలు జరుగుతాయి. వృత్తులను పరిశ్రమగా, మనుషుల నేర్పు, శక్తిసామర్థ్యాలను శ్రమ పెట్టుబడిగా మార్చాలి. నానాటికీ కునారిల్లిపోతున్న వృత్తులకు వసతులు, వనరులు కల్పించి స్వయంపోషకంగా మార్చాలి. సమాజంలో అట్టడుగున ఉన్న ఈ వర్గాలకు ఆర్థిక సత్తువ (ఎకనమిక్ ఎంపవర్‌మెంట్) చేకూర్చితే గ్రామీణ ఆర్థికరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. గత ఆరు దశాబ్దాల్లో ఏనాడూ ఏ నాయకుడూ మా గురించి ఇంతగా ఆలోచించలేదు. మొదటిసారి పేదల కష్టం తెలిసిన ముఖ్యమంత్రిని చూస్తున్నాం అని ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న బీసీ నాయకుడొకరు చెప్పారు. ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక దృక్పథంతో పనిచేయడం, పేదల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ఇన్ని ఆలోచనలు చేయడం మునుపెన్నడూ జరుగలేదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు.
మత్స్యకారులకు మహర్దశ రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. వారికి చేపల పెంపకంలో నేర్పు ఉంది. అనుభవం ఉంది. వారికి చేయూతనిస్తే వారు బాగుపడడమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆదాయం సంపాదించిపెట్టగలరు. అందుకే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. మిషన్ కాకతీయతో జలకళ సంతరించుకున్న వేల చెరువులు, రిజర్వాయర్లలో ఇప్పుడిప్పుడే చేపలదిగుబడి మొదలయింది. తెలంగాణలో ఉన్న చెరువులను జలాలతో నింపి మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తే సుమారు రూ.2000 కోట్ల ఆదాయం సమకూరుతుంది.
20వేల కోట్లకు అధిపతుల కానున్న యాదవులు రాష్ట్రంలోని సుమారు 25 లక్షల మంది యాదవుల్లో ఇప్పటికీ అత్యధికశాతం మంది గొర్రెల పెంపకం మీద ఆధారపడి ఉన్నారు. తెలంగాణలో మాంసం సరఫరా, వినియోగం ఒక పరిశ్రమగా ఎదిగింది. వారానికి 600 లారీల గొర్రెలు, మేకలు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 44 లక్షల గొర్రెలు మాత్రమే ఉన్నాయి. గొర్రెలు పెంచడంలో నేర్పరులైన యాదవులకు 84 లక్షల గొర్రెలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గొర్రెలు ఏటా మూడుసార్లు ఈనుతాయి. ఈ గొర్రెలు రెండేండ్లలో నాలుగున్నర కోట్లవుతాయి. అంటే 20 వేల కోట్ల సంపద తయారవుతుంది. గ్రామాలలో ఇంత సంపద వృద్ధి చెందితే అది ఎటువంటి మార్పులకు దారితీస్తుందో అర్థం చేసుకోవచ్చు.
గౌరవంగా బతికేందుకే చేనేత తెలంగాణలో అద్భుతమైన వస్ర్తాలు నేసే నైపుణ్యం ఉన్న కార్మికులు లక్షల మంది ఉన్నారు. వారికి తగినంత ఆర్థిక చేయూత, సబ్సిడీలు ఇచ్చి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బట్టలు నేసే లేక తయారు చేసే శక్తిని వారికి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది. బతుకలేక చేనేత అనే రోజులు పోయి, గౌరవంగా బతుకడం కోసం నేత పరిశ్రమ అన్న పరిస్థితిని తీసుకురావాలి. అందుకు అనుగుణంగా చేనేత రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం నిపుణులతో కమిటీని వేసింది. మరోవైపు ముఖ్యమంత్రి కూడా నేత సంఘాల ప్రతినిధులతో, నేతకార్మికులతో నేరుగా మాట్లాడుతున్నారు. నేత కార్మికుడికి కనీసం నెలకు రూ.15,000 ఆదాయం దక్కేలా ఈ సంస్కరణలు చేపట్టాలని సీఎం భావిస్తున్నారు. ఇవి కాకుండా అన్ని వృత్తులవారు ఆధునిక వసతులు, వనరులతో తగినంత ఆర్థిక సత్తువ సాధించేందుకు అన్ని రకాల సహాయం అందించాలని, అందుకు అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ)కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయింది. నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్‌లు సమకూర్చాలని, రజక వృత్తిలో ఉన్నవారికి ఆధునిక సాధన సంపత్తిని అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే ఏ వృత్తిలో ఉన్నవారికి ఏ అవసరం ఉందో, గుర్తించి, అందుకు అనుగుణంగా ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వ ప్రణాళికా రచన చేస్తున్నది.