పార్టీ సభ్యత్వ నమోదులో టీఆర్‌ఎస్ దూసుకుపోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా ప్రజలు సభ్యత్వ నమోదుకు ముందుకు వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వాలు నమోదు అవుతున్నాయి. బీసీల అభివృద్ధికి ముఖ్యంగా కులవృత్తుల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విశేష కృషి చేస్తుండటంతో అన్ని వర్గాల నుంచి సభ్యత్వ నమోదుకు భారీ స్పందన లభిస్తున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవడంతోపాటు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమా ద బీమా వర్తిస్తుండటంతో గ్రామాలకు గ్రామాలే సభ్యత్వాలు తీసుకొని టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామని తీర్మానాలు చేస్తున్నాయి.
సోమవారం గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు చింతల కనకారెడ్డి, మాగంటి గోపీనాథ్, సాయన్న, మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఎమ్మె ల్యే శ్రీనివాస్‌గౌడ్, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, గ్రేటర్ వరంగల్‌లో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నగర మేయర్ నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొని సభ్యత్వాలు అందజేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారికి గులాబీ కండువాలు కప్పి పార్టీ సభ్యత్వాలు అందజేశారు.
డెన్మార్క్‌లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు డెన్మార్క్ టీఆర్‌ఎస్‌శాఖ ఆధ్వర్యంలో కోపెన్‌హెగన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ బిడ్డలు పెద్ద ఎత్తున పాల్గొని సభ్యత్వాలు స్వీకరించారు. డెన్మార్క్ టీఆర్‌ఎస్ ప్రతినిధి ఆకుల శ్యాం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ దేశంలోని పలు ప్రదేశాల నుంచి తెలంగాణ బిడ్డలు తరలివచ్చారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, సీఎం కేసీఆర్ నాయకత్వం అందరిలో స్ఫూర్తి నింపుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో డెన్మార్క్ టీఆర్‌ఎస్ కోఆర్డినేటర్ యాదగిరి ప్యారం తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల చూపు టీఆర్‌ఎస్ వైపు.. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం పంచాయతీ పరిధిలోని అబ్బారావుక్యాంపు, కొందాపూర్ గ్రామస్థులు సోమవారం టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామాలను టీఆర్‌ఎస్ నేత పోచారం సురేందర్‌రెడ్డి సందర్శించగా అబ్బారావు క్యాంపువాసులంతా ఆ పార్టీ సభ్యత్వాలను స్వీకరించారు. తర్వాత కొందాపూర్‌లో సైతం ఏకగ్రీవంగా సభ్యత్వాలు తీసుకుని ఇతర పార్టీలకు తమ గ్రామంలో అవకాశం లేదని తీర్మానించారు.

