-అదే నిజమైన ప్రజాస్వామ్యం.. మళ్లీ వలస పాలకులు వద్దు: కేసీఆర్ -దాచిదాచి దయ్యాల పాలు చేయొద్దు -శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్యేగా గెలిపించండి -మహబూబాబాద్ సభలో సీఎం కేసీఆర్
యుద్ధంచేసి వలసాధిపత్యం నుంచి తెలంగాణ బయటపడిందని, మళ్లీ తెలంగాణ మీద వలస పెత్తనాన్ని రుద్దే ప్రయత్నంచేస్తున్నారని సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అది చాలా పెద్ద ప్రమాద మని చెప్పారు. శుక్రవారం మహబూబాబాద్ నియోజకవర్గకేంద్రంలో నిర్వహించిన ప్రజాఆశీర్వాదసభ లో సీఎం మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఇయ్యాల మన రాష్ట్రం మనం అయినం. మనపని మనం చేసుకుంటున్నం. ఆంధ్రరాష్ట్రం వాళ్లు.. వాళ్లపని చేస్కుంటున్నరు. ఈ టైంలో తెలంగాణ మీద చంద్రబాబు పెత్తనం అవసరమా? గట్టిగ చెప్పా లె.. (సీఎం మాటకు స్పందనగా ప్రజలంతా వద్దు.. వద్దు.. అని గట్టిగా అరిచారు) ఇదీ తెలంగాణ! నేను ఎక్కడ అడిగినా ఇదేమాట చెప్తున్నరు. దాచుకొని.. దాచుకొని తెచ్చుకున్న తెలంగాణను దయ్యాలపాలు చేసుకునేలా కాంగ్రెస్, టీడీపీ వ్యవహరిస్తున్నయి. తెలంగాణకు నీళ్లు రానివ్వ అని చెప్తున్న చంద్రబాబును కాంగ్రెస్‌వాళ్లు భుజాలపై మళ్లీ ఇక్కడికి మోసుకొస్తున్నరు. సూర్యాపేట యువకుడు వేణుగోపాల్‌రెడ్డి చనిపో తే తెలంగాణ వచ్చింది. చంద్రబాబు మీ ఇంటికొ చ్చి మిమ్ముల కొట్టిపోత అంటుండు. దెబ్బలు తిందామా? 2004లో మనతో పొత్తు పెట్టుకొని రా జ్యానికొచ్చిన కాంగ్రెస్ 14 ఏండ్లు ఏడిపించింది.
జిల్లా చేయించిన.. ఆ ప్రేమ చూపాలె తెలంగాణ రాకపోతే.. ఇక్కడ శంకర్‌నాయక్ ఎమ్మెల్యేగా, సీతారాంనాయక్ ఎంపీగా లేకపోతే.. నేను సీఎంగ లేకపోతే.. ఈ జన్మల మహబూబాబాద్ జిల్లా అవుతుండెనా? అది ఇయ్యాల మనకు పెద్ద రిలీఫ్. వీళ్లంతా పట్టుబట్టి కొట్లాడి మహబాబాబాద్‌ను జిల్లాకేంద్రం చేయించుకున్నరు. ఆ ప్రేమ, అభిమానాల్ని మీరు చూయించాలె. ఇంత ఎండలో.. ఏ 70-80వేల మంది ఉన్నరో.. నాకైతే లెక్క దొరకడం లేదు. ఇంతమంది ఇక్కడికి వచ్చిండ్రంటనే శంకర్‌నాయక్ గెలిచిపోయిండని అర్థమవుతున్నది. చిన్నచిన్న సమస్యలన్నీ పరిష్కరిస్తా. శంకర్‌నాయక్ మంచివాడు. అతన్ని గెలిపించండి. మహబూబాబాద్‌ను అభివృద్ధిచేసే బాధ్యత నాది.
బలరాంనాయక్.. నువ్వు తెలంగాణలనే పుట్టినవా? ఇక్కడ మాజీ ఎంపీ కాంగ్రెస్ తరపున నిలబడ్డడు. ఆయన పేరు బలరాంనాయక్. ఆయన ఒక దగ్గర ఏం మాట్లాడ్తడంటే.. కాంగ్రెస్‌కు గిన్క ఓటు వేయకపోతే తెలంగాణ కొంచబోయి ఆంధ్రల కలుపుతడంట! మనమే కొంచబోయి ఈయన్ని పాకాలల కలుపుతెగాదు మరి! ఇన్నేండ్లు కొట్లాడి.. జైళ్లల్ల పడి.. దెబ్బలల్ల పడి.. కష్టాలుపడి పిల్లలు.. తెలంగాణ సాధించుకొస్తే.. దాన్ని తీస్కపోయి ఆంధ్రల కలుపుతనంటవా? ఈ మాట ఎట్ల మాట్లాడ్తవు? నీ నోటికెట్ల వచ్చింది? నువ్వు తెలంగాణల పుట్టినవా? నువ్వు పోమరి.. చంద్రబాబు ఇంటికాడ జీతముండు.. ఎవరొద్దన్నరు! ఇట్లాంటి చాతకాని, చావలేని, చీమునెత్తురులేని కాంగ్రెసోళ్లే 58 ఏండ్లు మనల్ని ఏడిపించిన్రు.

