మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్రం కుదిస్తున్నదన్న వార్తలు రాష్ర్టాలకు ఆందోళన కలిగిస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. 95 శాతం గ్రామీణ కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన ఈ పథకాన్ని పరిమితం చేస్తే తీవ్రమైన దుష్పరిణామాలు చోటుచేసుకొంటాయని ఆయన తెలిపారు. కేరళలోని కోవలంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంగళవారం నిర్వహించిన దక్షిణాది రాష్ర్టాల గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు.

-95 శాతం గ్రామీణ కుటుంబాలు దానిపైనే ఆధారపడ్డాయి -వినూత్న పద్ధతుల్లో మరింత బలోపేతం చేయాలి -కేంద్రానికి మంత్రి కేటీఆర్ సూచన -కేరళలో దక్షిణాది రాష్ర్టాల ప్రాంతీయ సదస్సులో ప్రసంగం ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ పథకం దేశచరిత్రలో తొలిసారి పేదలకు, బలహీన వర్గాలకు నిజమైన వాయిస్ అండ్ చాయిస్ కల్పించిందని కొనియాడారు. అందుకే ఉపాధి హామీ పథకంపై కేంద్రం ఎలాంటి పరిమితులు విధించవద్దని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ పథకాన్ని మరింత వినూత్న పద్ధతుల్లో, సరికొత్త ప్రయోగాలతో అమలుచేయాలని రాష్ట్రప్రభుత్వం తరఫున ఆయన కోరారు. గత ఎనిమిదేండ్లలో ఈ పథకం గ్రామీణాభివృద్ధిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణలోని 443 మండలాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తున్నామని.. ఇప్పటివరకు రూ.9800 కోట్లతో సుమారు 25 లక్షల కుటుంబాలకు ప్రతి ఏటా వందరోజుల పని కల్పించినట్లు చెప్పారు. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రయోజనం కలుగుతున్నదని వివరించారు. పథకం వల్ల రూ. 30 ఉన్న దినసరి కూలీ.. రూ.150కి పెరిగిందన్నారు. ఫలితంగా వలసలు 44 శాతం తగ్గాయని కేటీఆర్ వెల్లడించారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ జరిగిందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లోని దళితవాడలకు మరుగుదొడ్ల సౌకర్యాలు, 1276 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు మూడు లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయగా, మరో 2.44 లక్షల మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నట్లు కేటీఆర్ వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలకి రోడ్డు కనెక్టివిటీ పెరిగిందని తెలిపారు.
రాష్ట్రంలో 1442 నూతన ఆవాసాలకు 1768 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో భాగంగా రాష్ట్రంలో పాటిస్తున్న పలు పద్ధతులను కేటీఆర్ సదస్సులో వివరించారు. కూలీలకు ట్రాన్సక్షన్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో కూలీ డబ్బును నేరుగా శ్రమశక్తి సంఘాల ఖాతాల్లోకి పంపుతున్నామని తెలిపారు. బయోమెట్రిక్ సిస్టం, సోషల్ ఆడిట్ వంటి విధానాలను కూడా సదస్సులో ప్రస్తావించారు.