– అభ్యర్థులు దొరక్కే.. సమైక్యవాదికి బీజేపీ టిక్కెట్ – టీఆర్‌ఎస్ అభ్యర్థికి భారీ మెజారిటీతో బ్రహ్మరథం పట్టండి : డిప్యూటీ సీఎం రాజయ్య

మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఏ పార్టీ పోటీ కాదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సంగారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి రాజయ్య పేర్కొన్నారు. అభ్యర్థులు దొరక్కపోవడంతోనే సమైక్యవాది, క్రిమినల్ అయిన జగ్గారెడ్డికి బీజేపీ, మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై లాఠీచార్జి చేయించిన సునీతాలకా్ష్మరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు.
సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాటలకు కేంద్ర మోడీ సర్కార్ తలొగ్గి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందన్నారు. జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా శాంతి భద్రతలు, రెవెన్యూ అంశాలపై గవర్నర్‌కు బాధ్యతలు అప్పగించే ప్రకటనపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేసిందని, దీంతోనే మోడీ సర్కార్ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభలో ఆర్టికల్ 3 ప్రకారం చర్చించిన తర్వాతే పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపాలన్న సోయి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. నాలుగున్నర కోట్ల ప్రజల హృదయాల్లో తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడిందన్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో పొందుపర్చిన 43 అంశాలే పార్టీకి వజ్రాయుధం లాంటివన్నారు.
గడపగడపకు వెళ్లి కేసీఆర్ ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఎన్నికల్లో అధిక మెజార్టీ సాధించాలన్నారు. తెలంగాణవాదులు, పార్టీ కార్యకర్తలపై దాడి కేసుల్లో క్రిమినల్ అయిన జగ్గారెడ్డికి బీజేపీ టిక్కెట్ ఇవ్వడం దారుణమని రాజయ్య దుయ్యబట్టారు. మెదక్ ఉప ఎన్నికల్లో కార్యకర్తలు లేక ప్రచారం నిర్వహించలేని దుస్థితి బీజేపీకి దాపురించిందన్నారు. మంత్రిగా ఉండి కూడా అమరుల కుటుంబాలను పరామర్శించని సునీతాలకా్ష్మరెడ్డిని ప్రజలు తిరస్కరించడం ఖాయమన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు దక్కవని.. ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టి కేసీఆర్ కన్నా అధిక మెజారిటీతో గెలిపించడం ఖాయమన్నారు.
మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం: బీబీ పాటిల్ బంగారు తెలంగాణ కల సాకారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. అన్నివర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సమగ్ర సర్వేను నిర్వహించి విజయం సాధించారని పేర్కొన్నారు. రాజకీయాల్లో కిందిస్థాయి నాయకులను గుర్తించి రాములునాయక్, కర్నె ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ పదవులు అప్పగించి న్యాయం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీ వినోద్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ పాలనపై దేశవ్యాప్త చర్చ: బాల్క సుమన్ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. కేసీఆర్ పాలన అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలకు చెందిన ఎంపీలు ప్రశంసిస్తుండటం తమకు గర్వకారణంగా ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో తెలంగాణలోని ఆ పార్టీ కార్యకర్తలు సిగ్గుతో ప్రచారం చేయడానికి ముఖాలు చాటేసుకుంటున్నారని అన్నారు.
తెలంగాణవాదులపై దాడిచేసిన సమైక్యవాది జగ్గారెడ్డికి టిక్కెట్ ఇచ్చి.. బీజేపీపై తెలంగాణ ప్రజలకు ఉన్న అభిమానాన్ని తెంచుకున్నారని విమర్శించారు. ఆంధ్రా పాలకుల చెప్పుచేతుల్లో కేంద్రంలోని మోడీ సర్కార్ నడుస్తుందనడానికి పోలవరం, గవర్నర్‌గిరి అంశాలే నిదర్శనమన్నారు. రైల్వే, సాధారణ బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపి నిధులు కేటాయించలేదని ఆరోపించారు. కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి జాతీయ పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను మట్టికరిపించి కేసీఆర్‌కు బహుమతి ఇవ్వాలని ప్రజలను కోరారు.