Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

తెలంగాణ సచివాలయానికి బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు.

ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమన్నారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన రాష్ట్రం ఏర్పాటైన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలువడం వెనక డాక్టర్‌ అంబేద్కర్ ఆశయాలు ఇమిడి ఉన్నాయన్నారు. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తున్నదన్నారు. అంబేద్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉన్నదని పేర్కొన్నారు. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తున్నదన్నారు. భారతదేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయత ఆనాడే నిజ భారతం ఆవిష్కృతమౌతుందని అభిప్రాయపడ్డారు.

అందుకోసం మావంతు కృషి కొనసాగుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్‌కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. భారత నూతన పార్లమెంట్‌ భవనానికి సైతం అంబేద్కర్ పేరును పెట్టాలని ఏదో ఆశామాషీకి కోరుకున్నది కాదని, భారత దేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నామన్నారు.

అందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిందని గుర్తు చేశారు. ఇదే విషయమై భారత ప్రధానికి త్వరలో స్వయంగా లేఖ రాయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంట్‌ భవనానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ పేరును పెట్టాలని తాను మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.