తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఆకర్షణీయమై రాయితీలు ఇస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండి ఎవరికి ఏ అవసరం వచ్చినా తీరుస్తుందని, ప్రభుత్వపరంగా ఏ సహాయం కావాలన్నా చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో 12ఎడిషన్ బయో-ఏషియా సదస్సును సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా లైఫ్‌సైన్స్ పాలసీ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫార్మా రంగం హైదరాబాద్ క్యాపిటల్‌గా ఉందని, ఇక్కడే 33శాతం గ్లోబల్ వ్యాక్సిన్ తయారవుతున్నదని అన్నారు. తక్కువ రేటుకు, నాణ్యమైన మందులు తయారుచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, అనేక సంస్థలు, రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయని అన్నారు.

-పెట్టుబడులు పెట్టండి.. ఆకర్షణీయ రాయితీలు ఇస్తాం -బయోలైఫ్‌సైన్స్ పాలసీని విడుదల చేసిన మంత్రి జూపల్లి -హైదరాబాద్‌లో బయో-ఏషియా సదస్సు ప్రారంభం పరిశ్రమలకు అనుమతులపై ఆందోళన అవసరం లేదని, నిర్ణీత కాలవ్యవధిలో అన్నిరకాల అనుమతులు ఇప్పిస్తామని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో అందరి సహకారం కావాలని, ప్రభుత్వ పరంగా మీకు అండగా ఉంటామని తెలిపారు. అంతకుముందు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ అన్ని రకాల అనుమతులను 30రోజుల్లో ఇస్తామని, ప్రాధాన్యత కలిగిన వాటికైతే 15రోజుల్లోనే అనుమతులు ఇస్తామని అన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే ఐ-పాస్ పాలసీని ప్రకటించిందని, ఎన్నో రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ప్రభుత్వం ఎంచుకున్న 14రంగాల్లో లైఫ్‌సైన్స్ కూడా ఉందని, ఈ రంగాన్ని ప్రభుత్వం ప్రొత్సహిస్తుందని అన్నారు. ఈ రంగానికి 11వేల ఎకరాలను కేటాయించేందుకు సీఎంఅంగీకరించారని చెప్పారు. 2020కల్లా ఈ రంగంలో రాష్ర్టానికి 20వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో జీనోమ్‌వ్యాలీని డెవలప్‌చేసేందుకు కేంద్రప్రభుత్వం కూడా సహకరిస్తున్నదని తెలిపారు. తెలంగాణలోనే మెడికల్ పరికరాలను తయారుచేసేందుకు దక్షిణ కొరియాతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నామని, మంగళవారం చైనా సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గుండెలో వాడే స్టంట్ రూ.25-50వేల మధ్య ఉందని, స్థానికంగా మెడికల్ పరికరాలు తయారైతే రూ.5-10వేలకే లభిస్తాయని అన్నారు.
కార్యక్రమంలో బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ మాక్ అలిస్టర్, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం వెంకటనర్సింహారెడ్డి, బయో ఏషియా ఇంటర్నేషనల్ అడ్వయిజరీ బోర్డు కో చైర్మన్ డా బాబ్‌నైస్మిత్, లావ్స్ ల్యాబ్స్ ప్రతినిధి లక్ష్మణ్ చుండూరు, బయో ఏషియా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు.