Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

తెలంగాణపై ఎందుకీ వివక్ష?

-నిధులకోసం ఎన్నిసార్లు అడిగినా కేంద్రం నిర్లక్ష్యమే
-సబ్‌ కా వికాస్‌ అంటే ఇదేనా?
-బండి రాజకీయాలు మాని నిధులు తేవాలి: మంత్రి కేటీఆర్‌

‘సబ్‌కా సాత్‌. సబ్‌కా వికాస్‌’ అంటున్న మోదీ ప్రభుత్వం.. తెలంగాణపై వివక్ష చూపుతున్నదని ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా, చేనేత జౌళిశాఖమంత్రిగా ఇక్కడ మెగా పవర్‌లూం క్లస్టర్‌ మం జూరు చేయాలని ఏడేండ్లుగా కోరుతున్నా కేం ద్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. స్థానిక ఎంపీగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాజకీయాలు మాని రాష్ట్రానికి మెగా పవర్‌లూం క్లస్టర్‌, చేనేత సమూహాలకు క్లస్టర్లు, ఇండియన్‌ టెక్స్‌టైల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సిరిసిల్లలో ఆకస్మికంగా పర్యటించి కలెక్టరేట్‌లో కరోనా, దళితబంధు, చేనేత మరమగ్గాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, దుబ్బాక, కమలాపూర్‌, జమ్మికుంట, నల్లగొండలో చేనేత క్లస్టర్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌చేశారు. దేశానికి అత్యధిక ఆదాయం ఇస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నా, రాష్ర్టానికి వసతులు సమకూర్చడంలో కేంద్రం తీవ్రవివక్ష చూపుతున్నదన్నారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో చేనేతకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే నేతన్నలతో కలిసి కేంద్రంపై పోరాడుతామని హెచ్చరించారు. బండి సంజయ్‌ రాష్ర్టానికి నిధులు తేవడంలో బాధ్యత ఉండాలని, లేకపోతే ఏం చేయాలన్నది తాము నిర్ణయిస్తామని స్పష్టంచేశారు.

దళితుల ఆర్థిక స్వావలంబనే ‘దళితబంధు’ లక్ష్యం
రాష్ట్రంలోని దళితులందరూ అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన సాధించడమే దళిత బంధు లక్ష్యమని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాష్ట్రమంతటా ఒక్కో నియోజకవర్గానికి వంద మంది చొప్పున దళిత బంధు అందిస్తామని చెప్పారు. లబ్ధిదారుడికి రూ.10 లక్షల చొప్పున అందిస్తామని, అందులో నుంచి రూ.10వేలు దళిత రక్షణ నిధి కింద జమ చేయనున్నట్టు పేర్కొన్నారు.

కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం..
ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేటీఆర్‌ తెలిపారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే చేస్తున్నామని చెప్పారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటేనే భయపడేటోళ్లు నేడు సర్కారు దవాఖానాల్లోనే ప్రసవాలు చేయించుకొంటున్నారని, ఇది సీఎం కేసీఆర్‌ ఘనతేనని కొనియాడారు. కరోనా టీకా మొదటి డోసు వంద శాతం, రెండో డోసు 86 శాతం, మూడో డోసు 35 శాతం పూర్తి చేసినట్టు తెలిపారు. హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టులో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలు పైలట్‌ ప్రాజెక్టులుగా ఎంపికైనట్టు చెప్పారు. ప్రతి పౌరుడి హెల్త్‌ రికార్డును డిజిటలైజ్‌ చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధికి ‘మన ఊరు – మన బడి’
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘మన ఊరు -మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రూ.7,289 కోట్లతో రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. దీని ద్వారా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, డైనింగ్‌ హాల్స్‌, టాయిలెట్స్‌, పెయింటింగ్‌ వాల్స్‌, నీటి వసతి తదితర కార్పొరేట్‌ స్థాయి మౌలిక వసతులు సమకూరుతాయని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.