Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

తెలంగాణ పదాన్నే చెరిపేసే కుట్ర..

-కేసీఆర్‌పై ప్రజల్లో చెక్కుచెదరని అభిమానం
-ఇక భవిష్యత్తు అంతా బీఆర్‌ఎస్‌ పార్టీదే
-చిన్న పొరపాట్లతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి
-పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పొరపాట్లు జరగనివ్వం
-అప్పులను చూపి సర్కారు తప్పించుకొనే ఎత్తు
-కాంగ్రెస్‌ హామీలను మర్చిపోకుండా చూద్దాం
-జహీరాబాద్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో
-బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు

ఒకనాడు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన శక్తులు, ఇవ్వాళ తెలంగాణ పదాన్నే చెరిపేసేందుకు కుట్ర చేస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరంతా తిరిగొచ్చినట్టు కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్‌ చేసిన అబద్ధపు, అసత్య ప్రచారాలతో ఓడిపోయిందని అన్నారు. ప్రజల్లో కేసీఆర్‌ పట్ల చెక్కుచెదరని అభిమానం పదిలంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. జహీరాబాద్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, నియోజకవర్గ, మండలస్థాయి ముఖ్యనాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని తిరిగి ప్రజల అభిమానాన్ని పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు 2001 నుంచి ఇప్పటిదాకా పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారని కొనియాడారు. చిన్నచిన్న పొరపాట్ల వల్ల అధికారం కోల్పోయామని, అధికారం రానంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు.

అధైర్యపడాల్సిన పనిలేదు
ప్రజలు బాగుపడాలని కేసీఆర్‌ తెచ్చిన విప్లవాత్మక పథకాల దూరదృష్టిని, దార్శనికతను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కొంత జాప్యం జరిగింద కేటీఆర్‌ అన్నారు. అందుకే కొన్ని పథకాల లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రజలు కేంద్రంగా పాలన సాగించాలనే ఆలోచనతో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టలేకపోయామని చెప్పారు. 1985 -89 మధ్య ఎన్టీఆర్‌ అనేక మంచి పథకాలు తెచ్చినా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తుచేశారు. 1989లో ఓడిపోయిన టీడీపీ, ఆ తర్వాత మొదటి విడతలో జరిగిన 21 ఎంపీ సీట్ల ఎన్నికల్లో 19 గెలిచిందని తెలిపారు. అలాగే 2009 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అనుకున్నస్థాయిలో ఫలితాలు రాకపోవటంతో తెలంగాణ పని అయిపోయిందని అందరూ భావించారని, కానీ ఆరు నెలల్లోనే పరిస్థితి అంతా తారుమారైందని గుర్తుచేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్య తక్కువేం కాదని, మూడింట ఒక వంతు గెలిచామని తెలిపారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్‌ఎస్‌ కన్నా 18 వేల ఓట్ల ఆధిక్యమే ఉన్నదని చెప్పారు.

కేసీఆర్‌పై చెక్కుచెదరని అభిమానం
‘మా ఎమ్మెల్యే ఓడిపోయినా కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితడనుకున్నం. గిట్లెట్లాయే’ అని ప్రజలు బాధ పడుతున్నారని కేటీఆర్‌ తెలిపారు. ప్రజల్లో కేసీఆర్‌పై చెక్కుచెదరని అభిమానానికి అదే నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా లేకపోతే కొన్ని శక్తులు తెలంగాణ పదాన్నే మాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. తెలంగాణ సమాజం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నెల రోజుల్లోనే అప్రతిష్ఠ మూటగట్టుకున్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు వస్తున్నాయని అన్నారు. అప్పుల బూచి చూపి హామీల నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని, దీంతో బీఆర్‌ఎస్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉన్నా అనివార్య కారణాల వల్ల ఆ పని చేయలేకపోయామని, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల సంఖ్య తగ్గిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన అనాలోచితమైనదని విమర్శించారు. అలా చేస్తే ప్రజల పక్షాన నిలబడాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

పార్టీ ప్రక్షాళన జరగాలి: పోచారం శ్రీనివాస్‌రెడ్డి
పార్టీలో ప్రక్షాళన జరగాలని మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలహీనతలే కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకోవటం దారుణమని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమికి నాయకులదే బాధ్యత అని తెలిపారు. నాయకులు నిత్యం ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ఉండక, వారి మనోభావాలను గౌరవించుకోవటంలో విఫలమైన కారణంగానే ఓటమి చెందామని విశ్లేషించారు. దేశంలో బీఆర్‌ఎస్‌కు ఉన్న బలమైన క్యాడర్‌ మరే రాజకీయ పార్టీకి లేదని తెలిపారు. తప్పులను ఎత్తిచూపినవాడే నిజమైన కార్యకర్త అని అన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటితే 16 సీట్లు రావడం ఖాయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎంపీ బీబీ పాటిల్‌, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతాప్రభాకర్‌, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్దన్‌, హన్మత్‌షిండే, జాజుల సురేందర్‌, చంటి క్రాంతికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ వల్లే పార్లమెంట్‌లో తెలంగాణ గళం: హరీశ్‌రావు
పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించే సత్తా బీఆర్‌ఎస్‌కే ఉన్నదని, అదే మన బలమని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలనే ఉత్సాహం గులాబీ సైన్యంలో తొణకిసలాడుతున్నదని తెలిపారు. పార్టీ సన్నాహక సమావేశాలే అందుకు నిదర్శమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోపాలను సవరించుకొని, పార్లమెంట్‌ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన అభివృద్ధితోపాటు ఢిల్లీలో కేంద్రంతో తెలంగాణ సమస్యలపై బీఆర్‌ఎస్‌ చేసిన పోరాటాన్ని ప్రజలకు గుర్తు చేసి ఓట్లు అడుగుదామని చెప్పారు.

పార్లమెంటులో తెలంగాణ గళం వినబడాలంటే బీఆర్‌ఎస్‌ ఎంపీల సంఖ్య బలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీల సంఖ్య తగ్గితే కాంగ్రెస్‌, బీజేపీ ఆడింది ఆట పాడింది పాట అవుతుందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ‘తెలంగాణ పాలిట బీజేపీది మొండి చెయ్యి..కాంగ్రెస్‌ది తొండి చెయ్యి’ అని ఆయన విమర్శించారు. రాష్ట్ర హక్కులు ఢిల్లీలో సాధించుకోవాలంటే బీఆర్‌ఎస్‌కే ఎన్నికల్లో పట్టం కట్టాలని కోరారు.

సీఎం అయినా పీసీసీ చీఫ్‌లాగే రేవంత్‌
కేంద్రంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు రాజకీయాలను పట్టించుకోరని సీఎం రేవంత్‌రెడ్డి నీతులు చెప్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణకోసం రేవంత్‌రెడ్డి ఏంచేశారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రంతో కొట్లాడుతున్నప్పుడు రేవంత్‌రెడ్డి ఎక్కడున్నారని నిప్పులు చెరిగారు. పీసీసీ చీఫ్‌గా ఉన్నపుడు బీఆర్‌ఎస్‌పై బట్టగాల్చి మీదవేసి, సీఎం హోదాలోనూ అదేపనిచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఎవరిని కలిసినా బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మకయ్యాయని అడ్డగోలు ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సీఎంగా నాడు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేసిన పనినే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం మంచిపనులు చేయదు.. బీఆర్‌ఎస్‌ చేసిన మంచి పనులను తుడిపేస్తాం అన్నట్టుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దేశంలో ఎవరూ అమలు చేయని కేసీఆర్‌ విప్లవాత్మక పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దుచేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. వంద రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పప్పులు ఉడకవని అన్నారు.

లోపాలను అధిగమించి ముందుకు సాగుదాం: నిరంజన్‌రెడ్డి
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, గతంలో జరిగిన లోపాలను అధిగమించి ముందుకు సాగుదామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కార్యకర్తలకు ఉద్భోదించారు. సంప్రదాయ రాజకీయాల మాదిరిగా కేసీఆర్‌ రాష్ర్టాన్ని పాలించలేదని, ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు కల్పించాలనే దార్శనికతతో పాలించారని తెలిపారు. రాష్ట్ర సత్వర అభివృద్ధికి పట్టుదలతో పనులు చేసినా ఓడిపోయామని, ఈ ఓటమికి గల కారణలాలను లోతుగా విశ్లేషించుకొని పొరపాట్లకు తిరిగి ఆస్కారం లేకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ తన సొంతబలంతో గెలవలేదనే విషయాన్ని బీఆర్‌ఎస్‌ శ్రేణులు గుర్తించాలని సూచించారు. ‘గుంపు మేస్త్రీ తెలివి తేటల వల్ల కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదు, మన తప్పిదాల వల్లే బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది’ అని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.