Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సుదీర్ఘ అనుభవానికి సమున్నత గౌరవం

– సింగిల్ విండో చైర్మన్‌గా మొదలైన పోచారం రాజకీయ ప్రస్థానం
-తెలంగాణ తొలి ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా సేవలు

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇకపై శాసనసభ వ్యవహారాలను నడిపించబోతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వాక్పటిమను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం పేరును ప్రతిపాదించారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కావడంతో శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. సింగిల్ విండో చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పోచారం.. రాష్ట్ర మంత్రి స్థాయి వరకు ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ దఫా మరో కీలకమైన పదవి చేపట్టబోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఆయనకు మంచి పేరు ఉన్నది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయనకు ప్రజల మనిషిగా మంచి గుర్తింపు ఉంది. మంత్రిగా ఉన్నా తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి.. మొదటి నుంచీ సొంత నియోజకవర్గమైన బాన్సువాడ నుంచే పోటీచేస్తున్నారు. పోచారం అసలుపేరు పరిగె శ్రీనివాస్‌రెడ్డి. ఊరిపేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఆ పేరుతోనే రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితులయ్యారు.

పనితనానికి పట్టాభిషేకం
పోచారం శ్రీనివాస్‌రెడ్డి 1976లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆరుసార్లు గెలిచారు. మంత్రిగా గృహనిర్మాణం, గనులు, జలవనరులు, పంచాయతీరాజ్ శాఖలను నిర్వహించారు. 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షతో ఆంధ్రా పార్టీ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయం సాధించారు. 2014లో సీఎం కేసీఆర్ తొలి క్యాబినెట్‌లో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. తెలంగాణ తొలి వ్యవసాయశాఖ మంత్రిగా తనదైన శైలిలో రాణించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఉత్సాహం నింపారు. మోకాలికి శస్త్ర చికిత్స జరిగినా వెనుకడుగు వేయకుండా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు.

లక్ష్మీ పుత్రుడు బిరుదు ఇచ్చిన సీఎం కేసీఆర్
గత ఏడాది అక్టోబర్ 3న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని లక్ష్మీపుత్రుడిగా అభివర్ణించారు. నిఖార్సైన రైతుబిడ్డ అని, వ్యవసాయశాఖ మంత్రిగా అద్భుతంగా పనిచేశార ని, రైతుబంధు, రైతుబీమా వంటి అద్భు తమైన పథకాల అమలులో క్రియాశీలకంగా వ్యవహారించారని ప్రశంసిస్తూ లక్ష్మీపుత్రుడు అనే బిరుదు ఇచ్చారు. అంతేకాదు అనేక సందర్భాల్లోనూ పోచారం పనితీరును సీఎం కేసీఆర్ అభినందించారు. నీటి తీరువా రద్దు, ఎర్రజొన్న రైతులకు బకాయిల చెల్లింపు వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలన్నీ పోచారం హయాంలోనే అమల్లోకి వచ్చాయని గుర్తుచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.