-ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మద్దతు పలికిన ప్రతిపక్ష పార్టీలు -ఏకైక నామినేషన్ దాఖలు.. నేడు అధికారికంగా ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్
శాసన సభాపతిగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి గురువారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానున్నది. స్పీకర్‌గా పోచారం ఎన్నికైనట్టు శుక్రవారం శాసనసభలో అధికారికంగా ప్రకటిస్తారు. స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ప్రతిపాదిస్తూ నామినేషన్ ఫారంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతకంచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వీఎం అబ్రహం ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. పోచారం మొత్తం ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు నామినేషన్ పత్రాలను స్వీకరించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే, ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ స్పీకర్ ఎన్నికపై ప్రకటన చేస్తారు. అనంతరం సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నాయకులు కలిసి పోచారంను తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెడుతారు. అనంతరం స్పీకర్‌ను అభినందిస్తూ సభా నాయకులు కేసీఆర్, అధికార, ప్రతిపక్ష సభ్యులు ప్రసంగిస్తారు. శనివారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. పోచారం గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చాంబర్‌కు వెళ్లి తనను స్పీకర్‌గా ఎంపికచేసినంందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఏకగ్రీవానికి సీఎం కేసీఆర్ పిలుపు సీఎం కేసీఆర్ బుధవారం విపక్ష పార్టీల నాయకులకు ఫోన్‌చేశారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుందామని కోరారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనకు అన్ని పార్టీల అధ్యక్షులు అంగీకారం తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రతిపాదించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో పోచారం ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.
సభ్యులకూ మాట్లాడే అవకాశమివ్వండి.. కేటీఆర్ చమత్కారం అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరు ఖరారై, నామినేషన్ దాఖలుచేసే సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆయనను అభినందించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పోచారంను ప్రత్యేకంగా అభినందించారు. అసెంబ్లీలో సభ్యులకు కూడా మాట్లాడే అవకాశమివ్వాలంటూ ఛలోక్తి విసిరారు. భట్టి విక్రమార్క తదితర ప్రతిపక్ష సభ్యులు పోచారంను స్పీకర్‌గా నిర్ణయించారు.. సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి అంటున్నారని పోచారంతో చెప్పారు. పోచారం సుదీర్ఘంగా మాట్లాడుతారనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని తెలిసింది. దీంతో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. పోచారంను అభినందించినవారిలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు టీ హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, షకీల్, గంప గోవర్ధన్, వనమా వెంకటేశ్వరరావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

