-ఘనస్వాగతం పలికిన ఎన్నారైలు.. -జేటీసీ కార్యాలయ సందర్శన -నేడు సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో భేటీలు సింగపూర్ పర్యటనలో తొలి రోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బిజీబిజీగా గడిపారు. ఐదురోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రాత్రి బయలుదేరి వెళ్లిన సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం ఆరుగంటలకు సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్‌లోని రిట్జ్కార్టన్ హోటల్ వద్ద కేసీఆర్‌కు ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు.
22న ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సు జరిగే స్టేడియాన్ని ఉదయం 11 గంటలకు సీఎం పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం సింగపూర్‌లోని ప్రముఖ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ డెవలప్మెంట్ సంస్థ జురాంగ్ టౌన్ కార్పొరేషన్ (జేటీసీ) కార్యాలయాన్ని సందర్శించారు. గురువారం ఉదయం 11 గంటలకు సింగపూర్ హై కమిషనర్‌తో, సాయంత్రం 4గంటలకు విదేశాంగమంత్రితో సీఎం సమావేశం కానున్నారు.
సింగపూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమై ముఖ్యమంత్రి వారికి తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని వివరించనున్నారు. 22న ఇంపాక్ట్ సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో సీఎం భేటీ అవుతారు.
పట్టణ అభివృద్ధి ప్రణాళికలను అధ్యయనం చేసేందుకు 23న సింగపూర్ నుంచి కౌలాలంపూర్ వరకు సీఎం కారులో ప్రయాణించనున్నారు. 24న తిరుగుప్రయాణమై ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. సీఎంతోపాటు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, కమిషనర్ జయేశ్‌రంజన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు కే సుధీర్‌రెడ్డి, ఎం గోపాల్‌రావు, ఫిక్కీ తరఫున దేవేందర్సురానా సింగపూర్ పర్యటనకు వెళ్లారు.

