శాంత్రి భద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అన్ని పోలీస్‌స్టేషన్ల నిర్వహణకు నిధులు మంజూరు చేశామని, ఠాణాలకు పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.50 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.25 వేల చొప్పున ఇస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

-హరీశ్ ఎక్కడ కాలుపెడితే అక్కడ విజయమే -సిద్దిపేట మోడల్ ఠాణా ప్రారంభోత్సవంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి -ప్రజలతో పోలీసులు స్నేహంగా ఉండాలి:శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ -మోడల్ పోలీస్‌స్టేషనే కాదు.. మోడల్ సిద్దిపేట -దేవాదుల ద్వారా జిల్లాకు సాగునీరు: భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు
హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు వారి వేతనాల పెంపు విషయం లో త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నామన్నారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో రాష్ట్రంలోనే మొదటిసారిగా అన్ని హంగులతో నిర్మించిన మోడల్ పోలీస్‌స్టేషన్ భవనాన్ని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, డీజీపీ అనురాగ్‌శర్మ, డీఐజీ నవీన్‌చందులతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడడానికి ముఖ్యమంత్రి పోలీస్ శాఖకు రూ.313 కోట్లు విడుదల చేశారని తెలిపారు.
పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామన్నారు. మంత్రి హరీశ్‌రావు కోరిక మేరకు సిద్దిపేటలో పోలీసు బెటాలియన్‌ను మంజూరు చేస్తామని తెలిపారు. సిద్దిపేట మంచి నీటి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా వాటర్ గ్రిడ్ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. సిద్దిపేటలో ప్రతి పథకం సక్సెస్ కావడం వెనుక మంత్రి హరీశ్‌రావు కృషి ఎంతో ఉందన్నారు. హరీశ్‌రావు కాలు ఎక్కడ పెడితే అక్కడ విజయం చేకూరుతుందన్నారు.
మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉన్నప్పుడే మంచి వాతావరణం నెలకొంటుందని చెప్పారు. సిద్దిపేట పచ్చని వాతావరణం, పరిశుభ్రమైన రోడ్లతో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నదన్నారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గ్రీన్ సిద్దిపేట, ఎల్‌ఈడీ లైట్లు, డివైడర్ల పై మొక్కలు, ప్లాస్టిక్ కవర్ల నిషేధం, పరిశుభ్రమైన పట్టణం ఇలా అన్నింట్లో సిద్దిపేట మోడల్‌గా ఉంటుందని వివరించారు. త్వరలోనే సిద్దిపేటకు యూనివర్సిటీ మంజూరు కానుందన్నారు. సిద్దిపేట పీజీ కళాశాలకు రూ.19 కోట్లు మంజూరయ్యాయన్నారు. పట్టణంలో నేరాల అదుపునకు 103 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టామన్నారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లాకు సాగునీటిని తరలించనున్నట్లు తెలిపారు. నంగునూరు, కొండపాక మండలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రానున్నాయన్నారు.కార్యక్రమంలో ఎస్పీ షెమూషి బాజ్‌పాయ్, జాయింట్ కలెక్టర్ శరత్, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి పాల్గొన్నారు.
సిద్దిపేటలో పార్టీలు లేవు: ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ సిద్దిపేటలో పార్టీలు లేవు. తామంతా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ అందరం ఒకటిగానే ఉంటాం. రాజకీయాలు.. రాజకీయ కక్షలు అం తకంటే లేవు.. ఎన్నికలప్పుడు పగలంతా ప్రచారం చేస్తాం.. సాయం త్రం ప్రచారంలో నీవేం హామీ ఇచ్చావు.. నేనేం హామీ ఇచ్చా అనే విషయాలపై మాట్లాడుకుంటాం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ వ్యాఖ్యానించారు.
మోడల్ ఠాణా ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని, అతనికి సాటి ఎవరూలేరని ప్రశంసించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో మంత్రి ముందుంటారని అభినందించారు. ఆయనలాంటి నేత మా సిద్దిపేట ప్రజలకు ఉండడం అదృష్టమన్నారు.