-రైతుబంధు అందరు రైతులకూ వరిస్తుంది -చిన్న, సన్నకారు రైతులకే కిసాన్ సమ్మాన్ పరిమితం -రాష్ట్ర, కేంద్ర పథకాలకు సంబంధం లేదు -మార్చి చివరికి రైతుల ఖాతాల్లో రూ.రెండు వేలు చొప్పున జమ -కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధామిశ్రా
తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన రైతుబంధు చాలా పెద్ద పథకమని.. ఇది రైతులందరికీ వర్తిస్తున్నదని కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధా మిశ్రా అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకేఎస్‌ఎన్) పథకం చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే పరిమితమైందని.. కుటుంబానికి ఐదెకరాలలోపు ఉన్న రైతులకే వర్తిస్తుందని తెలిపారు. పీఎంకేఎస్‌ఎన్ కింద మార్చి నెలాఖరునాటికి రైతుల బ్యాంకుఖాతాల్లో రూ. 2,000 చొప్పున జమచేస్తామని ఆమె వెల్లడించారు. పీఎంకేఎస్‌ఎన్‌పై ఆమె మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి, రెవెన్యూ, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలుచేస్తున్న రైతుబంధు పథకం అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంకేఎస్‌ఎన్ పథకంపై చర్చించేందుకు రాష్ర్టానికి వచ్చినట్టు తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే అమలుచేసిన రైతుబంధు పథకానికి సంబంధించిన రైతుల డాటా ఇస్తామంటే తీసుకుంటామని, కేంద్రప్రభుత్వం వద్ద ఉన్న డాటాను రాష్ట్రానికి అందజేస్తామని తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి.. రైతుబంధుకు సంబంధం లేదని స్పష్టంచేశారు. కుటుంబం యూనిటీగా చేసుకొని పీఎంకేఎస్‌ఎన్ పథకం ఉంటుందని, రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమచేస్తామని చెప్పారు. ఆధార్ లేదా ఏదైనా గుర్తింపుకార్డుతోపాటు బ్యాంకు ఖాతా వివరాలు అందించాల్సి ఉంటుందన్నారు. రైతుబంధుతో కలిపి అమలు చేస్తామనే అంశంపై రాష్ట్రప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని చెప్పారు. పీఎంకేఎస్‌ఎన్‌ను మార్చి నుంచి అమలుచేయనున్నట్టు వెల్లడించారు. పీఎంకేఎస్‌వై పథకం గురించి కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వివరించారని.. ఇప్పటికే రైతులకు సంబంధించిన అన్నివివరాలు ఉండటంతో తెలంగాణ మొదటగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారని సీఎస్ జోషి తెలిపారు. సమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి , కమిషనర్ రాహుల్ బొజ్జా, అదనపు కమిషనర్ విజయ్‌కుమార్, సీసీఎల్‌ఏ డైరెక్టర్ కరుణ పాల్గొన్నారు.
మార్గదర్శకాల తిరకాసు.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుపై కేంద్రప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు పెద్ద తిరకాసుగా కనిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం ఐదెకరాల సాగుభూమికి ఏడాదికి రూ.6 వేలు మూడు విడతలుగా అమలుచేస్తామని ప్రకటించింది. దీంతోపాటు అనేక నిబంధనలూ విధించింది. రైతుకు కాకుండా.. కుటుంబం మొత్తానికి కలిపి 5 ఎకరాలలోపు ఉంటేనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించనున్నట్టు పేర్కొన్నది. ఒక వ్యక్తికి, లేదా కుటుంబసభ్యులకు ఎన్నిచోట్ల సాగుభూమి ఉన్నా ఐదెకరాలకు మించి ఉండరాదు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పెన్షనర్లు, ఐటీ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులను అనర్హులుగా పేర్కొన్నది. పీఎంకేఎస్‌ఎన్‌తో పోల్చితే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం మార్గదర్శకాలు చాలా పారదర్శకంగా ఉన్నాయి. రాష్ట్రంలో చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అనే తేడాలేకుండా.. సాగుభూమి ఉన్నవారందరికీ లబ్ధి చేకూరుతున్నది. కుటుంబంలో ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు ఉన్నా.. అందరికీ వర్తిస్తుంది.

