-సీఎం నిర్ణయాలు సరైనవని రుజువయ్యాయి -ప్రశ్నించేవారికి కాళేశ్వరం హైడ్రాలజీ క్లియరెన్సే సమాధానం -అడ్డుకునే ప్రతిపక్షాలకు చెంపపెట్టు -గంటల తరబడి శ్రమించి ప్రాజెక్టులకు రూపకల్పన -ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే మంథని నియోజకవర్గానికి -కాళేశ్వరంతో బహుళ ప్రయోజనాలు -అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
ప్రాజెక్టుల విషయంలో రీడిజైనింగ్ నిర్ణయం సరైందేనని నిరూపితమైందని సాగునీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఎందుకని ప్రశ్నించేవారికి కాళేశ్వరంపై తాజాగా కేంద్ర జలసంఘం ఇచ్చిన హైడ్రాలజీ క్లియరెన్సే సమాధానమన్నారు. ఇది ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటిదని చెప్పారు. మేడిగడ్డవద్ద నీటి లభ్యత 284 టీఎంసీలు ఉందని కేంద్ర జలసంఘం క్లియరెన్స్ ఇవ్వడంతో సీఎం కేసీఆర్ ఆలోచనలు సరైనవని స్పష్టమైందన్నారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సభ్యులు పుట్ట మధు, సోమారపు సత్యనారాయణ, ఎన్ దివాకర్‌రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో గోదావరి పునర్జీవం ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాళేశ్వరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నెలల తరబడి రోజుకు 14గంటలపాటు ఇంజినీర్లతో, రిటైర్డ్ ఇంజినీర్లతో చర్చించి ప్రాజెక్టుకు జీవం పోశారన్నారు. ఆయన నిర్ణయానికి తగినట్లే నేడు కేంద్ర జలసంఘం క్లియరెన్సులు ఇస్తున్నదని తెలిపారు. కాళేశ్వరంపై ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తున్నదని హరీశ్ చెప్పారు. దీనికి అనుగుణంగా నీటి లభ్యత ఎక్కువగా ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నదన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేడిగడ్డవద్ద మూడు టీఎంసీలను తరలించేలా సివిల్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం రెండు టీఎంసీలు మాత్రమే తీసుకునేలా మోటర్లు బిగిస్తున్నామన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలద్వారా 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టంచేశారు. ఇందులో 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందుతుందని, మిగతా ఆయకట్టును స్థిరీకరిస్తామని వివరించారు. వరుస బరాజ్‌లు నిర్మించడంద్వారా రాష్ట్రంలో గోదావరికి పునర్జీవం కల్పిస్తామని చెప్పారు.రాష్ట్రంలో నిజామాబాద్ నుంచి భద్రాచలం వరకు 500 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తుందని, గోదావరిపై నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, తుపాకులగూడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు కలుపుకొంటే నదిలో ఏడాది పొడవునా 274 కిలోమీటర్ల నీటి నిల్వ పెరుగుతుందన్నారు. వరుస బరాజ్‌తో మత్స్యపరిశ్రమ పెరుగుతుందని, పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి చెప్పారు. గోదావరి నదిపై రెండు వరుస వంతెనలతో భూపాలపల్లి-గడ్చిరోలి-మంచిర్యాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని మంత్రి వివరించారు.
మంథని నియోజకవర్గానికి బహుళ ప్రయోజనాలు కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి లభ్యత పెరుగుతుందని, దీంతో మంథని నియోజకవర్గానికి కాకతీయ కాల్వ కింద 38 వేల ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంటుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కింద మరో 45వేల ఎకరాలకు రెండు పంటలకు నీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు 109 కిలోమీటర్లలో 100 కిలోమీటర్లు ఏడాది పొడవునా నీటితో సమృద్ధిగా ఉండడంతో ఆ పరిసరాల్లో రైతులకు, ఆ ప్రాంత మత్స్యకారులకు మేలు జరుగుతుందని చెప్పారు. కాళేశ్వరం వద్ద టెంపుల్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్‌తో ఆ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పెద్ద ఎత్తున పారిశ్రామీకరణ జరుగుతుందని వివరించారు. ఫలితంగా మంథని, ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మేలు కలుగుతుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

