-12 రోజుల్లో 44.05 లక్షల చెక్కుల పంపిణీ
-బ్యాంకుల నుంచి 4,780 కోట్లు విత్‌డ్రా
-కార్యక్రమం విజయవంతంపై కేసీఆర్ సంతృప్తి
-పరిపూర్ణం చేసేందుకు వ్యూహంపై నేడు సమీక్ష
-రైతులకు జీవితబీమా అమలుపైనా చర్చ
-ఏజెన్సీలో కొనసాగుతున్న చెక్కుల పంపిణీ
రైతుబంధు పథకంద్వారా చెక్కులు, కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం కావడంపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తంచేశారు. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాన్ని సోమవారం సీఎం కేసీఆర్ సమీక్షించారు. పట్టాదార్ పాస్‌పుస్తకాలు, పంట పెట్టుబడి సాయం అందజేసే కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం మధ్యా హ్నం 12 గంటలకు ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక, వ్యవసాయ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శులు, సీసీఎల్‌ఏ అధికారులు, వ్యవసాయ అధికారులు ఈ సమీక్షా కార్యక్రమంలో పాల్గొంటారు. రైతుబంధు పథకంలో భాగంగా చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ వివరాలతోపాటు.. రైతులకు జీవితబీమా పథకం అమలుపై కూడా ఈ సమీక్షలో చర్చిస్తారు. ఎల్‌ఐసీ ప్రతినిధులతో మాట్లాడి జూన్ 2 నుంచి అమలు చేయనున్న రైతులకు జీవిత బీమా పథకం రూపకల్పన చేయనున్నారు.
ఏజెన్సీలో చెక్కుల పంపిణీ రైతుబంధు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో పండుగ వాతావరణంలో చెక్కులు పంపిణీచేశారు. జిల్లాలోని ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో మంత్రి జోగురామన్న, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఐటీడీఏ చైర్మన్ లక్కేరావు, ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య తదితరులు గిరిజన రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. అటవీ యాజమాన్య హక్కులు పొందిన రైతులకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 24 వరకు చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. రైతుబంధు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 58.33 లక్షల మంది రైతులకు చెందిన 1.43 కోట్ల ఎకరాల సాగుభూమికి రూ.5,730 కోట్ల విలువైన 59.43 లక్షల చెక్కులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ యాజమాన్య హక్కు పత్రాలు పొందిన రైతులు సుమారు 99 వేల మంది ఉంటారని కూడా గుర్తించారు. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యంలో సోమవారంనాటికి సుమారు 44.05 లక్షల చెక్కులను పంపిణీచేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. చెక్కులు పొందిన రైతులు సోమవారం సాయంత్రం నాటికి సుమారు రూ.4,780 కోట్ల వరకు నగదును బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్నట్లు తెలిపాయి.

