-61.49 లక్షల మందికి రూ 7,515 కోట్లు -నేరుగా రైతు ఖాతాల్లోకి యాసంగి సాయం -ప్రతిరైతుకూ పంట సాయమందించాలి -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశం -స్థానిక పరిస్థితుల మేరకు పంటల సాగు -రైతుకు సకాలంలో ఎరువులు, విత్తనాలు -కొత్త వంగడాలపై పరిశోధనలు జరగాలి -అర్హులైన అందరికీ రైతుబీమా వర్తింపు -వ్యవసాయశాఖ సమీక్షలో అభిప్రాయాలు

ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నం పెట్టే రైతన్నకు ఆసరాగా నిలిచే రైతుబంధు చెల్లింపులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులకు యాసంగి పంట సీజన్ నిమిత్తం ఎకరాకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.7,515 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ కానున్నాయి.
రైతుబీమా కార్యక్రమం ప్రారంభించిననాడు రూ.630 కోట్ల కిస్తీ మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. కానీ, కుటుంబసభ్యులందరికీ బీమా వర్తించేలా అందరి పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో రైతుల సంఖ్య పెరిగి.. చెల్లించాల్సిన ప్రీమియం దాదాపు రెట్టింపు అయింది. అయినప్పటికీ ఈ పథకాన్ని కొనసాగించాల్సిందే. – సమీక్షాసమావేశంలో ఏకాభిప్రాయం
1.52 కోట్ల ఎకరాలకు సోమవారం నుంచి డబ్బులు జమ చేయనున్నాం. ఇందుకు రూ.7,515 కోట్లు కేటాయించాం. రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ప్రతి గుంట భూమికీ సాయమందాలి. -కేసీఆర్
యాసంగి సీజన్ ‘రైతుబంధు’ పెట్టుబడి సాయం సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి అందిస్తామని వెల్లడించారు. ఎకరానికి ఐదువేల చొప్పున 1.52 కోట్ల ఎకరాల సాగుభూమికి సోమవారం నుంచి 10 రోజులపాటు జమ చేయనున్నామని, ఇందుకోసం రూ.7,515 కోట్ల బడ్జెట్ కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ప్రతి గుంట భూమికీ సాయమందాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో యాసంగి రైతుబంధు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రైతుబీమా, పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగువిధానం, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు వద్దు ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసిందని, ప్రతిసారీ అలా చేయడం సాధ్యంకాదని సమావేశం అభిప్రాయపడింది. రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని దేశంలో కొత్త చట్టాలు కూడా చెప్తున్నాయని, ఇక మీదట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. వ్యవసాయ మార్కెట్లలో మాత్రం ప్రభుత్వం అమ్మకాలు, కొనుగోళ్లను సక్రమ పద్ధతిలో నిర్వహించాలని, రైతులంతా ఒకేసారి పంటను మార్కెట్‌కు తీసుకురాకుండా టోకెన్ సిస్టమ్‌ను కొనసాగించాలని సమావేశం సూచించింది.
రైతుబీమా కొనసాగించాల్సిందే రాష్ట్రంలో వ్యవసాయం విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యవసాయాధికారుల బాధ్యతలు మరింత పెరిగాయని సమావేశం అభిప్రాయపడింది. ఏటా రెండుసార్లు రైతుబంధు పంపిణీ, రైతుబీమాను అమలుచేయడంలో తీరికలేకుండా పనిచేస్తున్నారని తెలిపింది. ‘రైతుబీమా కార్యక్రమం ప్రారంభించిననాడు రూ.630 కోట్ల కిస్తీ మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. కానీ, కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తించేలా అందరి పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో రైతుల సంఖ్య పెరిగి.. చెల్లించాల్సిన ప్రీమియం దాదాపు రెట్టింపు అయింది. అయినప్పటికీ ఈ పథకాన్ని కొనసాగించాల్సిందే’ అని సమావేశం నిర్ణయించింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాను యథాతథంగా కొనసాగించాలని, సకాలంలో నాణ్యమైన, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందేటట్లు చూడాలని సూచించింది. వ్యవసాయవర్సిటీ ద్వారా మరిన్ని పరిశోధనలు జరగాలని, వ్యవసాయదారులకు ఆధునిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలని, వ్యవసాయశాఖ ఈ పనులన్నింటినీ చిత్తశుద్ధితో పర్యవేక్షించాలని సూచించింది.
పంట కొనుగోళ్లతో 7,500 కోట్లు నష్టం రాష్ర్టం ఏర్పడిన నాటినుంచి చేపట్టిన వివిధ రకాల పంటల కొనుగోళ్లతో ప్రభుత్వానికి తీవ్రనష్టం వాటిల్లిందని సమావేశంలో పాల్గొన్న అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ధాన్యం, మక్కజొన్న, జొన్న, కంది, శనగ తదితర పంటల కొనుగోళ్ల వల్ల ఇప్పటివరకు రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చిందని తెలిపారు. రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిన ఈ పంటలను ప్రభుత్వం తర్వాత తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుండటంతో నష్టం వస్తున్నదని వివరించారు. ప్రతిసారి ఇదే పరిస్థితి తలెత్తుతున్నదని అభిప్రాయపడ్డారు. కేవలం ధాన్యం కొనుగోళ్ల వల్లనే రూ.3,935 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు.
మక్కల కొనుగోళ్లతో రూ.1547.59 కోట్లు, జొన్నలు- రూ.52.78 కోట్లు, కందులు- రూ.413.48 కోట్లు, ఎర్రజొన్న- రూ.52.47 కోట్లు, మినుములు -రూ.9.23 కోట్లు, శనగలు- రూ.108.07 కోట్లు, పొద్దుతిరుగుడు కొనుగోళ్లతో రూ.14.25 కోట్లు నష్టపోయినట్టు వివరించారు. హమాలీ, ఇతర నిర్వహణ ఖర్చులన్నింటినీ కలుపుకొంటే రూ.7,500 కోట్ల వరకు నష్టం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కే తారకరామారావు, ఎస్ నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సీఎంవో అధికారి రాజశేఖర్‌రెడ్డి, వ్యవసాయవర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఏడీఏ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రైతు వేదికల్లోనే పంటల నిర్ణయం ‘రాష్ర్టవ్యాప్తంగా రైతువేదికల నిర్మాణం జరుగుతున్నది. ఈ వేదికల్లో రైతులు, వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై స్థానిక పరిస్థితులు, మార్కెట్‌కు అనుగుణంగా ఏ పంటలు వేయాలనేదానిపై నిర్ణయించుకోవాలి. మద్దతు ధర వచ్చేలా అనువైన వ్యూహం రూపొందించుకోవాలి. రాష్ర్టవ్యాప్తంగా ఏ రైతు.. ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదు. ఏ పంట సాగుచేయాలి అనే విషయంపై రైతే నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ ఎక్కువ ధర వస్తుందో అక్కడ పంటను అమ్ముకోవడమే ఉత్తమం’ అని సమావేశంలో విస్తృత అభిప్రాయం వ్యక్తమైంది.
రైతుబాంధవ ప్రభుత్వానికి నిదర్శనం -రైతుబంధు విడుదలపై మంత్రి కేటీఆర్ ట్వీట్
ప్రతిష్ఠాత్మక రైతుబంధు పథకానికి రూ.7,515 కోట్లు విడుదల చేయడం రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులకు యాసంగి పెట్టుబడి సాయం అందుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 1.55 కోట్ల ఎకరాలకు రైతుబంధు వర్తిస్తుందని ట్వీట్ చేశారు.