-ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆపలేరు -భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టి తీరుతాం.. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. మంగళవారం మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. రోజుకో మాట మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. రీడిజైనింగ్ ద్వారా ప్రాజెక్టులను నిర్మించడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంటే, జీర్ణించుకోలేని పార్టీలు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ విషయంలో రైతులకు ఇచ్చిన నష్టపరిహారం ఎంతో గుర్తు తెచ్చుకోవాలని కాంగ్రెస్, టీడీపీ నేతలకు సూచించారు. వారి హయాంలో పైరవీకారులు, దళారులదే రాజ్యం నడిచిందన్నారు. అప్పటి భూసేకరణకు పరిహారం అందక ఇప్పటికీ రైతులు కోర్టులచుట్టూ తిరుగుతున్నారని గుర్తుచేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 123 జీవో ద్వారా కేవలం 15 రోజుల్లోనే భూములు కోల్పోతున్న రైతాంగానికి ఒకే చెక్కులో పరిహారం మొత్తం ఇస్తున్నామని చెప్పా రు. పారదర్శకంగా ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోబోమన్నారు. రైతాంగాన్ని అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని పునరుద్ఘాటించారు.
నేడు మిషన్ కాకతీయపై వీడియో కాన్ఫరెన్స్ మిషన్ కాకతీయ పనులపై బుధవారం సాయంత్రం ఆరు గంటలకు సచివాలయంలో మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సహించేదిలేదని ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో టెండర్లలో ఎల్-1గా కాం ట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు ఐదు రోజుల్లో ఒప్పం దం చేసుకోనట్లయితే వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. ఈ దిశగా చర్యలు తీసుకున్న అధికారులు ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్ల పనులను రద్దు చేశా రు. ఈ క్రమంలో రెండో దశ పనుల్లో మరింత వేగా న్ని పెంచడం, విస్తారంగా వర్షాలు పడనున్న దరిమి లా చెరువులకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండటం, తగు జాగ్రత్తలు తీసుకోవడం, మూడో దశ టెండర్ల ప్రక్రియను డిసెంబర్ చివరికల్లా పూర్తి చేయడం తదితర అంశాలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించనున్నారు.

