-ఏ పార్టీకీ రాని ఫలితాలు తెలంగాణ రాష్ట్ర సమితికే సాధ్యం -ఏ విధంగా చూసిన టీఆర్‌ఎస్‌దే ఆధిపత్యం -ఇటీవలి ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఆవిష్కృతమైన గణాంకాలు ఇవీ
తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను ఆవిష్కరించాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీలకు, ద్వితీయ స్థానంలో నిలిచిన పార్టీలకు మధ్య ఓట్ల తేడా పరంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ కూటమికి వచ్చిన ఓట్ల కంటే అధికార టీఆర్‌ఎస్ పార్టీకి 14.1 శాతం ఎక్కువ ఓట్లు పోలవడం విశేషం. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ కంటే కాంగ్రెస్ 10 శాతానికిపైగా ఎక్కువ ఓట్లను సాధించింది.
అభ్యర్థుల మెజార్టీలోనూ తెలంగాణ టాప్ మిగిలిన నాలుగు రాష్ర్టాల్లో విజయం సాధించిన అభ్యర్థుల మెజార్టీ కంటే తెలంగాణలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీ సాధించడం తెలంగాణ రాష్ట్ర సమితి ఘనవిజయ స్వభావాన్ని చాటిచెప్తున్నది. మిగిలిన రాష్ర్టాల్లో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఒకరు లక్ష ఓట్ల పైచిలుకు భారీ మెజార్టీతో విజయభేరి మోగించగా.. మరో ఐదుగురు అభ్యర్థులు 75 వేల నుంచి లక్ష ఓట్ల మధ్య మెజార్టీతో విజయం సాధించారు. వీరంతా కూడా తెలంగాణకు చెందినవారే కావడం గమనార్హం. ఈ ఐదుగురిలో ముగ్గురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు, ఇద్దరు ఎంఐఎం అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణలో మరో 12 మంది అభ్యర్థులు 50 వేల నుంచి 75 వేల మధ్య మెజార్టీతో విజయం సాధించారు. ఇటువంటి మెజార్టీతో మరే రాష్ట్రంలోనూ ఇంత మంది అభ్యర్థులు గెలుపొందలేదు. వాస్తవానికి 30వేల కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థుల్లో తెలంగాణ అభ్యర్థులు, ప్రత్యేకించి టీఆర్‌ఎస్ అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు.
ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే ఘనవిజయం ఈ ఐదు రాష్ర్టాల్లో ఘనవిజయాల పరంగా చూస్తే కేవలం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోని విజయాలు మాత్రమే పోల్చదగినవి. అయితే ఇక్కడ కూడా టీఆర్‌ఎస్‌దే పైచేయి. తెలంగాణలో టీఆర్‌ఎస్ కంటే ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధిక శాతం సీట్లను గెలుచుకున్నప్పటికీ విజేతలైన అభ్యర్థుల మెజార్టీ విషయంలో టీఆర్‌ఎస్ ఎంతో ముందంజలో నిలిచింది. ఈ రెండు రాష్ర్టాల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు 50 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించగా.. వారిలో టీఆర్‌ఎస్ అభ్యర్థులే 15 మంది ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కేవలం ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే 50 వేలకుపైగా ఓట్ల తేడాతో గెలిచారు. అంతేకాకుండా 30 వేల నుంచి 50 వేల మెజార్టీతో టీఆర్‌ఎస్ మరో 30 సీట్లను కైవసం చేసుకోగా.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఇంత మెజార్టీతో కేవలం 16 సీట్లను మాత్రమే గెలుచుకున్నది.
మెజార్టీ సగటులోనూ టీఆర్‌ఎస్‌దే పైచేయి మరోవైపు ఈ ఐదు రాష్ర్టాల్లో ఏ పార్టీకీ సాధ్యంకాని రీతిలో టీఆర్‌ఎస్ 32 వేల పైచిలుకు సగటు మెజార్టీతో విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థుల సగటు మెజార్టీ తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థుల సగటు మెజార్టీ కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండటం విశేషం. ఛత్తీస్‌గఢ్‌లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులు సగటున 24 వేలకుపైగా మెజార్టీతో గెలువగా.. ఆ రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ సగటు మెజార్టీ కేవలం 11 వేలు మాత్రమే.
అభ్యర్థుల ఓట్ షేర్‌లోనూ టీఆర్‌ఎస్‌దే అగ్రస్థానం ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీల నుంచి దేశవ్యాప్తంగా కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే 70 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. వీరిద్దరూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే కావడం విశేషం. వాస్తవానికి ఈసారి టీఆర్‌ఎస్ తరఫున విజయం సాధించిన మొత్తం 88 మంది అభ్యర్థుల్లో 50 మంది (దాదాపు 57 శాతం మంది) 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో గెలిచిన మొత్తం 68 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో కేవలం 30 మందికి (44 శాతం మందికి) మాత్రమే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు లభించాయి.
– నేషనల్ డెస్క్

