Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పాలమూరును అగ్రగామిగా నిలపాలన్నదే కేసీఆర్ లక్ష్యం

-ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు -కిరణ్‌కుమార్ రాజకీయ జీవితమే అంధకారం -చరిత్రలో ఎన్నడూలేని విధంగా కరెంటు సరఫరా -టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీపీ, ఎంపీటీసీలు

KTR

రాష్ట్రం విడిపోతే తెలంగాణలో అంధకారం నెలకొంటుందని ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి, ఆఖరి కిరణం… కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నరు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఎండాకాలంలో కూడా కోతల్లేని కరెంటు సరఫరా జరుగుతున్నది. తెలంగాణ కాదుగానీ… కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయ జీవితం అంధకారంలోకి వెళ్లింది.. అని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఆత్మకూరు ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, మరో ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు తమ అనుచరులతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణభవన్‌లో సోమవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని పది జిల్లాలు అన్యాయానికి గురైతే, అందులో అత్యధికంగా పాలమూరు జిల్లాకు నష్టం జరిగిందన్నారు. వలసలు, కూలీల జిల్లాగా, మట్టి మనుషుల జిల్లాగా పేరొందిన పాలమూరును రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో సీఎం కే చంద్రశేఖర్‌రావు ఉన్నారని చెప్పారు. వెనుకబడిన పాలమూరు జిల్లాతో పాటు ఫ్లోరైడ్‌తో అలమటిస్తున్న నల్లగొండ జిల్లాకు తాగునీరిచ్చాకే ఇతర జిల్లాలకు నీళ్లు ఇవ్వాలని వాటర్‌గ్రిడ్‌పై సమీక్షలో సీఎం కరాకండిగా చెప్పారన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న ఈ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో అభివృద్ధి చెందుతుందన్నారు.

జిల్లాలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. చాలామంది తెలంగాణ వస్తే ఏం లాభమొస్తుందని అనేవారని… ఇప్పుడు పది నెలలుగా ఎంత లాభమొస్తున్నదో కళ్లముందు కనిపిస్తున్నదన్నారు. అన్నం ఉడికందని తెలుసుకునేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలని… రాష్ట్ర ప్రభుత్వం రానున్న నాలుగేండ్లలో రాష్ర్టాన్ని ఎంత అభివృద్ధి చేస్తుందనేందుకు ఈ పది నెలల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూస్తే అర్థమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

పేదవారి సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ఆయన, గతంలో 29 లక్షల పింఛన్లు వస్తే, ఆసరా కింద ప్రభుత్వం 37 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లను ఇస్తున్నదన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పునర్జీవనం కల్పిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికులు, కులవృత్తుల వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టిసారించారని, అందరం కలిసి ఆయనకు అండగా నిలవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జగదీశ్‌రెడ్డి, మక్తల్ పార్టీ ఇన్‌చార్జి దేవర మల్లప్ప పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.