-రూ.25 వేల కోట్లతో 46,531 చెరువుల పునరుద్ధరణ -కేంద్ర మంత్రితో వరంగల్‌లో స్తూపం ఆవిష్కరిస్తాం -మిషన్ కాకతీయ డాక్యుమెంటరీ చిత్రీకరణలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
రండి అందరం కలిసి నీటి గోసలేని నవ తెలంగాణ నిర్మాణానికి నడుం బిగిద్దాం. 11వ శతాబ్దంలో కాకతీయ రెడ్డిరాజులు ఆ రోజు తెలంగాణలో విస్తృతంగా చెరువులను తవ్వించారు. వారి స్ఫూర్తితోనే రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ పథకానికి మిషన్ కాకతీయ అని పేరు పెట్టాం. మిషన్ కాకతీయను సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలోని 46,531 చెరువుల పునరుద్ధరణకు దాదాపు రూ.25వేల కోట్లు వెచ్చించనున్నాం అని మిషన్ కాకతీయ డాక్యుమెంటరీ చిత్రీకరణలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా చిన్నకోడూరులో మిషన్ కాకతీయపై రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణలో మంత్రి హరీశ్‌రావు హాజరై మిషన్ కాకతీయ ప్రాధాన్యతను సవివరంగా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు ఏనాడూ చెరువుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు.
చెరువుల బాగు కోసం నాటి సీమాంధ్ర సీఎంల వద్దకు వెళితే పట్టించుకోలేదని, పైగా తెలంగాణలో చెరువులు అభివృద్ధి చెందితే తమకు నీళ్లు ఎలా వస్తాయని మాట్లాడారన్నారు. దీంతో చెరువులన్నీ జీర్ణావస్థకు చేరాయన్నారు. ఆ చెరువులన్నింటినీ మన సీఎం కేసీఆర్ పునరుద్ధరించాలనే ధృడసంకల్పంతో మిషన్ కాకతీయను చేపట్టారన్నారు. ఇందులో భాగంగా మిషన్ కాకతీయ స్తూపాన్ని వరంగల్‌లో కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని తెలిపారు. వర్షాకాలంలో చెరువులన్నీ నిండి బోరు బావుల్లో జలకళ ఉట్టిపడేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు. బావుల్లో నుంచి బిందెలు, చెంబులతో నీళ్లు ముంచుకునే రోజులు వచ్చేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మిషన్ కాకతీయ అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది రాష్ట్ర ప్రజల కార్యక్రమమన్నారు. దీనిని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిత్రీకరణలో కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, చిన్నకోడూరు మండల ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు.