-కేంద్రం ఇచ్చే నరేగా నిధులకు సమానంగా రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తాం -నిధులను సంపూర్ణంగా వినియోగించుకోవాలి -హరితహారం, వైకుంఠధామాలకు ప్రాధాన్యం -20 బృందాలతో అభివృద్ధి పనుల ఆకస్మిక తనిఖీలు -ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కే చంద్రశేఖర్‌రావు
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకొని గ్రామా ల్లో హరితహారం, వైకుంఠధామాల (శ్మశానవాటికలు) నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నరేగా నిధులతోపాటు రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఉపయోగించుకొని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. నరేగా పథకం కింద కేంద్రం రాష్ట్రానికి ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తుందో అంతే మొత్తం లో రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందని తెలిపారు. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలోనే నరేగా పనులు జరుగాలని, హరితహారం పనులకు మొదటి ప్రాధా న్యం, శ్మశానవాటికల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించడానికి నిధులను ఉపయోగించాలని సూచించారు.అన్ని గ్రామపంచాయతీలకు కచ్చితంగా బీటీరోడ్లు ఉండేలా రహదారుల వ్యవస్థను నిర్మించాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న పనులను అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. నిధులు దుర్వినియోగం కావద్దని, ప్రతి పైసా సద్వినియోగం కావాలని చెప్పారు.
నరేగా నిధులతో హరితహారం తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటుచేయాలి. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి, రక్షించాలి. గుంతలు తవ్వడానికి, నీళ్లు పోయడానికి, ఇతరత్రా పనులకు ఈ నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి. అటవీశాఖ అధికారుల సలహాలు, సాంకేతిక సహకారంతో గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటుచేయాలి. మొక్కలు పెట్టడం, వాటిని రక్షించడం లాంటి బాధ్యతలు గ్రామ పంచాయతీలు చేపట్టాలి అని సీఎం చెప్పారు.
ఆరు నెలల్లో వైకుంఠధామాల నిర్మాణం అన్ని గ్రామాల్లో ఆరునెలల్లో వైకుంఠధామాలు (శ్మశానవాటికలు) నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వభూమి లేకుంటే గ్రామ పంచాయతీలు తమ నిధులతో స్థలాలు సమకూర్చాలి. దాతల నుంచి స్వీకరించాలి. వైకుంఠధామం నరేగా నిధులతో నిర్మించాలి. మూ డు వేలలోపు జనాభా కలిగిన 11,412 గ్రా మాల్లో ఒకటి చొప్పున, మూడువేలకు పైగా జనాభా కలిగిన 1300 గ్రామాల్లో రెండు చొప్పున మొత్తం 14,012 వైకుంఠధామాలు నిర్మించాలి అని సీఎం తెలిపారు.
అన్ని పంచాయతీలకు బీటీ రోడ్లు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్లు ఉండాలని ప్రభు త్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. కొత్తగా 859 గ్రామాలకు రహదారులు నిర్మించాలి. వీటికోసం వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి, పనులు ప్రారంభించాలి అని ఆదేశించారు.సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి, ఎంపీలు బీ వినోద్‌కుమార్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, డీఎస్ రెడ్యానాయక్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

