Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నమ్మించి.. మోసగించే

-నమో అంటే అర్థం అదే..
-టీఆర్‌ఎస్‌.. తిరుగులేని రాజకీయ శక్తి
-బీజేపీ అంటే బక్వాస్‌ జ్యాదా పార్టీ
-మోదీ కా బాత్‌ కరోడోమే.. కామ్‌ పకోడీమే
-కేసీఆర్‌ను విమర్శిస్తే ఫిరంగులై గర్జించాలి
-కుంభమేళాకు 375 కోట్లు కేటాయించి..మేడారానికి 2 కోట్లతో సరిపెడతారా?
-‘వాట్‌ తెలంగాణ డజ్‌ టుడే, టుమారో ఇండియా డూ: మంత్రి కేటీఆర్‌
-తెలంగాణపై విషం కక్కుతున్న ప్రధాని
-ప్రజల జీవితాలను మార్చాలని కోరితే
-జీవిత బీమా సంస్థనే అమ్మేస్తున్నడు

‘బాత్‌ కరోడోమే.. కామ్‌ పకోడీమే’ అన్న చందంగా మోదీ పాలన నడుస్తున్నదని మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోదీ తెలంగాణపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఏదైనా బిల్లుపై ఓటింగ్‌ జరిగితే పార్లమెంట్‌లో దర్వాజలు బంద్‌ పెట్టి బిల్లు పాస్‌ చేస్తరన్న విషయం కూడా తెలవనోడు దేశ ప్రధాని కావడం దౌర్భాగ్యం అని విరుచుకుపడ్డారు. నమో (నరేంద్రమోదీ) అంటే నమ్మించి మోసం చేసేటోడని అభివర్ణించారు.

జీవితాలను మార్చాలంటూ అధికారం కట్టబెడితే జీవిత బీమా సంస్థనే అమ్మేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరై, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రధాని మోదీ సిగ్గులేకుండా కాపీ కొట్టి, హర్‌ ఘర్‌ జల్‌ అంటూ పేరు పెట్టుకున్నాడని కేటీఆర్‌ దుయ్యబట్టారు.

తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కొలువులడిగితే మిర్చి, పకోడి బండి కూడా ఉద్యోగాలే అంటూ మోసం చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీ అంటే బక్వాస్‌ జాదా పార్టీ అని, తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న ఆ పార్టీకి భవిష్యత్తులో పుట్టగతులుండవని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రాజకీయ శక్తి అని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నదని కేటీఆర్‌ అన్నారు. ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న మన నాయకుడు కేసీఆర్‌ను ఎవరు విమర్శించినా ఫిరంగులై గర్జించి తిరగబడాలని, బీజేపీ నాయకుల బట్టలు విప్పి బజారులో నగ్నంగా నిలబెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బండి సంజయ్‌కి దమ్ముంటే ఎములాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి రూ. వెయ్యి కోట్లు తీసుకురావాలని సవాల్‌ చేశారు.

మేడారానికి ముష్టి రెండున్నర కోట్లా..?
ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళాకు కేంద్రం రూ.375 కోట్లు కేటాయించిందని, మేడారం జాతరకు ముష్టి రెండున్నర కోట్లు ఇచ్చిందని కేటీఆర్‌ విమర్శించారు. పండుగలకు జాతీయ హోదాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాముడు అయోధ్యలోనే ఉన్నాడా? తెలంగాణలోని భద్రాచలంలో లేడా? ఆలయాల అభివృద్ధికి నిధులు ఎందుకు ఇవ్వరు? అంటూ నిలదీశారు. ‘కర్ణాటకలోని తుంగభద్రకు జాతీయ హోదా ఇస్తరు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకివ్వరు? తెలంగాణ ఈ దేశంలో లేదా?’ అని ప్రశ్నించారు. సాడేసాత్‌ సాల్‌ (ఏడున్నరేండ్ల) బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా 158 వైద్య కళాశాలలు వస్తే తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని దుయ్యబట్టారు. ఎనిమిది ఐఐఎంలు, 16 ఐఐఐటీలు వచ్చాయని వాటిలో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

‘బండి పోతే బండి, గుండు పోతే గుండు ఫ్రీ అంటూ గొప్ప మాటలు చెప్పిన బీజేపోళ్లవి బక్వాస్‌ మాటలని మండిపడ్డారు. ‘వాట్‌ తెలంగాణ డజ్‌ టుడే, టుమారో ఇండియా డూ (నేడు తెలంగాణ చేస్తున్నది రేపు భారతదేశం చేస్తుంది)’ అనే విధంగా మన రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయలేని పనులు చేసి చూపించిన తమ నాయకుడిని ఎవరైనా ఏమైనా అంటే సహించేది లేదని హెచ్చరించారు. విమర్శలను తిప్పి కొడుతూ నోళ్లు మూయించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. హద్దులు దాటి ప్రవర్తిస్తే తప్పకుండా బుద్ధిచెబుతామని బీజేపీ కార్యకర్తలను హెచ్చరించారు.

కేసీఆర్‌తోనే మీకు పదవులొచ్చినయ్‌
కేసీఆర్‌ వల్లనే మీకు పదవులొచ్చాయన్నది మరిచిపోవద్దని కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్‌ హితవు చెప్పారు. ‘కేసీఆర్‌ లేకుండా రేవంత్‌కు, బండి సంజయ్‌కు పదవులెక్కడివి?’ అని వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌మీద రాసిచ్చిన ఎంపీ అరవింద్‌ను నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అది చేయాలి ఇది చేయాలంటూ విమర్శించే బండి పీకిందేమిటని నిలదీశారు. తెలంగాణ పథకాలు 12 రాష్ర్టాలొచ్చి చూసి బాగున్నాయని ప్రశంసించడం కేసీఆర్‌ దక్షతకు, నాయకత్వ పటిమకు నిదర్శనమని కొనియాడారు. తెలంగాణ పథకాలు, నీటి సంరక్షణ విధానాలు యువ ఐఏఎస్‌లకు పాఠ్యాంశాలుగా ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,603 రైతు వేదికలను నిర్మించామని, సరైన పంటలపై వాటిల్లో అధ్యయనం చేయాలని చెప్పారు.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం ..
పల్లె నుంచి పట్నం దాకా పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని కార్యకర్తలకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసేవారిని కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పారు. ప్రభుత్వ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని గుర్తు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాలకు పురుషులు గులాబీ చొక్కా, మహిళలు గులాబీ చీరలు కట్టుకొని రావాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు బ్రిడ్జి వద్ద కార్యకర్తలు అట్టహాసంగా స్వాగతించారు. బ్రిడ్జి నుంచి సాయిమణికంఠ ఫంక్షన్‌ హాల్‌ దాకా భారీ బైక్‌ ర్యాలీ తీయగా, ప్రజలు నీరాజనం పలికారు.

నిరుపేదకు డబుల్‌ బెడ్‌రూం
భర్త చనిపోయి, ముగ్గురు ఆడపిల్లలతో.. ఉండటానికి ఇల్లులేక కష్టాలు పడుతున్న ఓ మహిళకు మంత్రి కేటీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం మంజూరుచేశారు. ఇందిరమ్మకాలనీకి చెందిన గండ్ర విజయ, తన ముగ్గురు కూతుళ్లతో వచ్చి ‘సార్‌.. నా భర్త చనిపోయిండు. ముగ్గురు ఆడపిల్లలు. ఉండటానికి ఇల్లు లేదు.. అద్దె ఇంట్లో ఉంటున్నాం. డబుల్‌ బెడ్‌ రూం ఇప్పించండి’ అని వేడుకున్నారు. స్పందించిన మంత్రి కేటీఆర్‌, వెంటనే డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతికి సూచించారు.

సమ్మక్కకు మంత్రి కేటీఆర్‌ పూజలు
మంత్రి కేటీఆర్‌ శుక్రవారం తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్‌లోని అమ్మవార్లను దర్శించుకున్నారు. నెత్తిన బంగారం ఎత్తుకొని వెళ్లి సమ్మక్క, సారలమ్మకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రికి జాతర కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. దర్శనం తర్వాత మంత్రిని సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.