Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నాలుగేండ్లలో ఇంటింటికీ నల్లా

– 25వేల కోట్లతో తెలంగాణ వాటర్ గ్రిడ్ – చానళ్ల నిలిపివేతతో ప్రభుత్వానికి సంబంధం లేదు – పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు

KTR 01 రాబోయే నాలుగేండ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు చెప్పారు. గురువారం రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో గ్రామీణ తాగునీటి సరఫరా-పారిశుధ్య నిర్వహణ అంశంపై ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సు, సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వాటర్ గ్రిడ్‌ను రూ.25వేల కోట్లతో నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. గ్రిడ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపకల్పన, అవసరమైన స్థలం గుర్తింపుపై క్షేత్రస్థాయి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సందర్భంగా వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారని చెప్పారు. వాటర్ గ్రిడ్ సర్వే పనులపై గురువారం గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులతో మరోసారి సమావేశం కావాలని సీఎం భావిస్తున్నట్లు వెల్లడించారు. గ్రిడ్ సర్వే పనులు బడ్జెట్ సమావేశాల్లోపు పూర్తి చేస్తే, ఈ బడ్జెట్‌లోనే దీనికి నిధులు కేటాయిస్తామని కేటీఆర్ తెలిపారు. ఏఈ స్థాయి నుంచి వివిధ స్థాయిల్లోని అధికారులందరికీ ల్యాప్‌టాప్‌లను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ప్రాథమిక అవసరాలను తీర్చడంద్వారా బంగారు తెలంగాణను నిర్మించవచ్చని సీఎం భావిస్తున్నారని, అందులో భాగంగానే ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్రం చేపట్టిన స్వఛ్చ భారత్-స్వస్థ్ భారత్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. రాబోయే నాలుగేండ్లలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని కేటీఆర్ అన్నారు. వచ్చే ఏడాది అగస్టు 15నాటికి రాష్ట్రంలోని 2119 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు చెప్పారు.

చానళ్ల నిలిపివేతతో ప్రభుత్వానికి సంబంధం లేదు చానళ్ల ప్రసారాల నిలిపివేతతో ప్రభుత్వానికి సంబంధం లేదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. సీఎం కేసీఆర్ మీడియాను, జర్నలిస్టులను ఎల్లప్పుడూ ఎంతో గౌరవిస్తారని చెప్పారు. మీడియానే పరిధిని దాటి వ్యవహరించిందని అన్నారు. చానళ్ల ప్రసారాల పునరుద్ధరణ అనేది వాటి యాజమాన్యాలు, ఎంఎస్‌వోలు తేల్చుకోవాల్సిన అంశమన్నారు. అయినప్పటికీ చానళ్ల యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టులను రెచ్చగొట్టి, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు.

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులు నిర్వహించిన పాత్రను సీఎంతోపాటు ప్రభుత్వం, టీఆర్‌ఎస్ గౌరవిస్తుందని, వారిపట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్లు తెలంగాణ సమాజాన్ని, ఉద్యమాన్ని, ప్రజా ప్రతినిధులను, తెలంగాణ చట్టసభలను మీడియా అవమానించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ సమాజాన్ని గౌరవించాలని సీఎం అంటే.. అది పత్రిక స్వేచ్ఛను అడ్డుకోవడమే అంటూ ఎందుకు విమర్శిస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న వాళ్లు వాస్తవాన్ని గుర్తించి, ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.