హైదరాబాద్ నగరంలో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నగర రోడ్ల విస్తరణ, అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌డీపీ కింద రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ రోడ్లు, వాటి బాగోగులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మున్సిపల్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లతో కలిసి పని చేస్తేనే పనుల్లో పురోగతి సాధ్యమవుతుందన్నారు. ఈ క్రమంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు.
మియాపూర్ – బాచుపల్లి రోడ్డు విషయంలో ఆర్ అండ్ బీ మంత్రి, అధికారులతో చర్చించి పరిష్కారిస్తామన్నారు. ప్రగతి నగర్ రోడ్డు విషయంలో ఇబ్బంది ఉంది. ఒక వైపు చెరువు ఉంది. మరోవైపు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఇబ్బందులున్న కారణంగా అక్కడ ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఫతేనగర్ అండర్‌పాస్ విషయంలో రైల్వే, ఆర్ అండ్ బీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉషా ముళ్లపూడి రోడ్డు విస్తరణకు భూసేకరణ పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్యారడైస్ నుంచి కొంపల్లి, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు రోడ్డు పనుల విషయంలో కేంద్ర రక్షణ శాఖతో మాట్లాడుతున్నామని తెలిపారు. రక్షణ శాఖ ఇబ్బందుల వల్ల రహదారుల పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. వంద ఎకరాల స్థలానికి 600 ఎకరాల స్థలం ఇస్తామని కూడా చెప్పినట్లు మంత్రి తెలిపారు. హెచ్‌ఎండీఏ వద్ద రహదారుల కోసం రూ. 2500 కోట్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు. రోడ్ల విషయంలో నాణ్యత పాటిస్తున్నామని చెప్పారు. రోడ్ల అభివృద్ధికి సంబంధించి క్యాలెండర్ విడుదల చేశామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

