Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మూడు గంటల కరెంట్‌ చాలా? 24 గంటల కరెంట్‌ కావాల్నా?

-నాడు ట్రాన్స్‌ఫార్మర్‌ కాలితే మనిషికి రెండువేలు వసూలు చేసేటోళ్లు -రైతుకు రూపాయి ఇవ్వని కాంగ్రెసోళ్లు ఇవ్వాళ ఓట్లు అడుగుతున్నరు -పూడికలు తీసి, చెక్‌డ్యామ్‌లు కట్టాలని వారికి ఎన్నడూ అనిపించలేదు -వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమన్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలె? -పదేండ్లలో తెలంగాణలో ఒక్కనాడు ఒక్క కర్ఫ్యూ, లాఠీచార్జీ లేదు -ఎవరూ అడగకున్నా.. నేతన్నలకు, బీడీ కార్మికులకు పింఛన్‌ ఇచ్చినం -ఎన్నికల ప్రణాళికలో చెప్పింది పదైతే.. చెప్పనివి వంద చేసినం -బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను మరోసారి అఖండ మెజార్టీతో గెలిపించండి -ముథోల్‌, ఆర్మూర్‌, కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్‌ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకటి ఖాయమని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. హస్తం పార్టీని నమ్మితే తెలంగాణలో మళ్లీ దళారీ రాజ్యం వస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, పది చెప్పి.. వంద పనులు చేశామని చెప్పారు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌, జగిత్యాల జిల్లా కోరుట్లలో శుక్రవారం నిర్వహించిన ప్రజాశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని, ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిందని, కానీ ఇప్పటికీ ఎన్నికలు రాగానే ఆగమాగం, గత్తర బిత్తిర అవుతారని అన్నారు. పార్టీలు, నాయకులు ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెప్పడం, కాని మాటలు చెప్పడం, నిందలు వేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ‘ఎన్నికలు వస్తాయి.. పోతాయి. ఎవరో ఒకరు గెలుస్తరు. అయితే ఎన్నికల్లో నిలబడే వ్యక్తి గుణగణాలతోపాటు ఏం చేస్తడు? ఎట్ల ఉంటడు? ఆ వ్యక్తి వెనకాల పార్టీ ఉంటది. ప్రతి పార్టీకి కూడా చరిత్ర ఉంటది. ఏ పార్టీ చరిత్ర ఏంటి? అనేది కండ్ల ముందు ఉన్నది. ఏ పార్టీ ఉన్నప్పుడు ఏం ఆలోచించారు? ప్రజల గురించి, రైతుల గురించి వాళ్ల దృక్పథం ఎలా ఉన్నది? ఆలోచన ఎలా ఉన్నది?’ అనేది విచారణ చేయాలని కేసీఆర్‌ కోరారు.

దూరదృష్టితో వ్యవసాయ స్థిరీకరణ తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలని నిర్ణయించామని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టితో చేశామని చెప్పారు. ప్రాజెక్టులు కట్టి సాగునీళ్లు తీసుకొచ్చామని, ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తూ, పండించిన ధాన్యం అంతా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. అన్ని రాష్ర్టాల్లో నీళ్లకు పన్ను ఉంటుందని, చెరువు, ప్రాజెక్టుల నీళ్లు ఇస్తే పన్నులు వేస్తారని, కానీ తెలంగాణలో జీరో టాక్స్‌ అని పేర్కొన్నారు. పాత నీటి తీరువా బకాయిలు కూడా రద్దు చేశామని చెప్పారు. పెట్టుబడి కోసం రైతు బంధు ఇస్తున్నామని, రైతు దురదృష్టవశాత్తు చనిపోతే రైతుబీమా అమలు చేస్తున్నామని వివరించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎరువు బస్తాలు దొరికేవి కావని, చెప్పులు లైన్లో పెట్టి తీసుకోవాల్సిన దుస్థితి ఉండేదని, నేడు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చెరువుల మీద పూడికలు తీయాలని, చెక్‌డ్యామ్‌లు కట్టాలని కాంగ్రెస్‌కు ఎప్పుడూ అనిపించలేదని, ఈ రోజు పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. పుష్కలమైన ఎరువులు, కల్తీలేని విత్తనాలు లభిస్తున్నాయని చెప్పారు.

రైతుబంధు బిచ్చమా? రైతుబంధు కావాలని ఎవరూ ధర్నా చేయలేదని, కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ గుర్తుచేశారు. రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్‌ అని తెలిపారు. ప్రముఖ వ్యవసాయవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ ,యూఎన్‌వో ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. రైతులకు రైతుబంధు పేరుతో బిచ్చమేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, కాంగ్రెస్‌కు రైతులు బిచ్చగాళ్లలెక్క కనిపిస్తున్నారా? అని మండిపడ్డారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ చాలని రేవంత్‌ అంటున్నాడని, రైతుబంధు వృథా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తున్నాడని.. కాంగ్రెస్‌ వస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పడానికి వారి మాటలే నిదర్శనమని అన్నారు. ‘కేసీఆర్‌కు పనిలేదు. ప్రజల విలువైన ట్యాక్సులు తీసుకెళ్లి రైతుబంధు ఇచ్చి పైసలు దుబారా చేస్తున్నడని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నడు. రైతుబంధు దుబారానో? కాదో? ప్రజలే నిర్ణయించుకోవాలి.’ అని కేసీఆర్‌ అన్నారు. ‘దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందించే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్‌ లేదు. ఈరోజు ట్రాన్స్‌ఫార్మర్‌, మోటర్లు కాలుడు లేదు. లో వోల్టేజ్‌ లేదు. జనరేటర్లు లేవు. ఇన్వర్టర్లు లేవు. కన్వర్టర్లు లేవు. అన్నీ మాయమైపోయినయ్‌. మోటార్‌ వైండింగ్‌ చేసే దుకాణాలు దివాళా తీసినయ్‌’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 50 ఏండ్లు రాజ్యం చేసిందని, 11 సార్లు ప్రజలు అధికారం కట్టబెట్టారని.. అప్పుడు ప్రజల కోసం ఏం చేసిందని కేసీఆర్‌ ప్రశ్నించారు. రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని దద్దమ్మ కాంగ్రెస్‌ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నదని ఎద్దేవా చేశారు. తనను ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా దురుసుగా.. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీనికి రైతులే సమాధానం చెప్పాలని కోరారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చట్టాలంటే కూడా బేఖాతర్‌. చట్టంలో జిల్లాకు ఒక నవోదయ కాలేజీ రావాలె. మరి మన దగ్గర 33 జిల్లాలకు 33 రావాలి. కానీ అట్ల చేయలె. ఒక్క మెడికల్‌ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఓటేందుకెయ్యాలి?.. వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలె.

-సీఎం కేసీఆర్‌

మళ్లీ దళారీ రాజ్యం కావాల్నా? గతంలో ఒక పట్టా కావాలంటే ఆరు నెలలు, ఏడాదిపాటు ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, కానీ నేడు ఆ మండలంలో ఎమ్మార్వో వద్దనే 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌, పహాణీ వస్తున్నదని కేసీఆర్‌ వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం ఎంతో ఆలోచించి తీసుకొచ్చినది ధరణి అని, ఆ ధరణిని తీసేస్తామని కాంగ్రెస్‌ చెప్తున్నదని తెలిపారు. ‘కాంగ్రెస్‌ పాలనలో ధరణి రాకముందు పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పారు. ఇప్పడు ధరణి తీసేస్తే మళ్లీ పహాణీ నకళ్లు, ఎమ్మార్వో ఆఫీసులు, వీఆర్వోలు, దళారీలు, పైరవీకారులు.. కమీషన్‌ కోసం బేరసారాలు మొదలవుతాయని అన్నారు. ఇవన్నీ మళ్లీ రావాల్నా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని, ఆ తర్వాత రెండుసార్లు ప్రజలు అవకాశం ఇచ్చారని, మరి.. ఈ పదేండ్లలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజల ముందే ఉన్నదని కేసీఆర్‌ చెప్పారు. తొమ్మిదిన్నరేండ్లుగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం పెరిగే కొద్దీ.. సమాజ సంక్షేమాన్ని కాంక్షించి అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నామని తెలిపారు. వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు చేశామని చెప్పారు.. కాంగ్రెస్‌ పాలన ఎట్లుండేది? బీఆర్‌ఎస్‌ పాలన ఎట్లుంది? అనేది ఆలోచించి అందరూ ఓటెయ్యాలని కోరారు.

భైంసా, ముథోల్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో అంతటా హిందువులు, ముస్లింలు ఎన్నో వందల ఏండ్ల నుంచి కలిసి బతుకుతున్నారు. నచ్చిన పని చేసుకుంటున్నారు. కొందరు తంపులాటలు పెట్టి.. తాకులాటలు పెట్టి.. మతపిచ్చి లేపి, భైంసా అంటేనే అదేదో యుద్ధం అన్నట్టు చిత్రీకరించి, ఇక్కడ రోజూ తన్నుక చస్తరు? కొట్టుకు చస్తరు అని అబద్ధాలు చెప్పి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చూస్తున్నారు.

-సీఎం కేసీఆర్‌

బీడీలు చుట్టే అమ్మ చేత్తో అన్నం తిన్నా దేశంలో తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలో బీడీ కార్మికులకు పింఛన్‌ ఇవ్వడం లేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘చిన్నప్పుడు హైస్కూల్‌లో చదువుకునేటప్పుడు దుబ్బాకలో బీడీ కార్మికుల ఇంట్లోనే చదువుకున్నా. అప్పుడు ఒకేసారి రెండు అనుభవాలు దొరికాయి. ఇంటి పెద్దాయనేమో బట్టలు నేసేది. నాకు అన్నం పెట్టిన ఆ అమ్మేమో బీడీలు చుట్టేది. వాళ్ల బాధలు కండ్లారా నేను చూశా. వాళ్లు తినే తిండికూడా చూశా. వాళ్ల అవస్థలు చూశా. వాళ్లకొచ్చే బీమార్‌ ఏందో కూడా నాకు తెలుసు. అవన్నీ నాకు తెలుసు కాబట్టే… నన్ను ఎవరూ అడగలేదు. దరఖాస్తు పెట్టలేదు. నా అంతట నేనే ఆలోచించి బీడీ కార్మికులకు పింఛన్‌ ఇచ్చిన’ అని పేర్కొన్నారు. బీడీ కార్మిపింఛన్‌ రూ.5 వేలకు పెంచుతామని తెలిపారు. ప్యాకర్స్‌, టేకేదార్లకు కూడా పింఛన్‌ పెంచనున్నామని, అందులో కొత్తవారికి కూడా మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

మహారాష్ట్రలో కరెంటు ఎందుకు లేదు? దేశవ్యాప్తంగా 24 గంటలు కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కేసీఆర్‌ ఉద్ఘాటించారు. మహారాష్ట్ర రైతులు తెలంగాణలో భూమి కొనుక్కొని బోర్లు వేసి, అక్కడ పంటలు పండించుకుంటున్నారని వివరించారు. ‘70 ఏండ్ల కింది నుంచి రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర మనకంటే మంచిగ ఉండాలెకదా? మరేం కారణం?’ అని నిలదీశారు. మహారాష్ట్ర నుంచి వస్తుంటే ఎక్కడైతే రోడ్డు నున్నగ ఉంటదో అక్కడి నుంచి తెలంగాణ స్టార్ట్‌ అయితదని, మహారాష్ట్రలో లైట్‌ ఉండదని, ఇవతల 24 గంటలు లైట్లు ఉంటాయని తెలిపారు. పరిపాలన బాగుంటే ఎట్లా ఉంటది అనేదానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

24 గంటల కరెంట్‌ ఇవ్వడం వృథా అని, 3 గంటల కరెంట్‌ ఇస్తే చాలు పొలమంతా పారుతదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్తున్నడు. మరి 3 గంటల కరెంట్‌ చాలా? 24 గంటల కరెంట్‌ కావాలా? అనేది ప్రజలే తేల్చాలి. ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని తెలపాలి.

-సీఎం కేసీఆర్‌

ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్‌ పిచ్చి ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్‌ పిచ్చి పట్టుకున్నదని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. విమానాలు, ఓడరేవులు, రైళ్లు, చివరాఖరికి కరెంటును కూడా ప్రైవేట్‌కు ఇచ్చారని మండిపడ్డారు. రైతుల బోర్‌ మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేశారని, లేదంటే ఏడాదికి రూ.5 వేల కోట్లు కట్‌ చేస్తామని బెదిరించారని గుర్తుచేశారు. తలతెగి పడినా మీటర్లు పెట్టేది లేదని తేల్చిచెప్పామని, దీంతో తెలంగాణకు 5 ఏండ్లలో మొత్తంగా 25వేల కోట్ల మేర నష్టం చేశారని మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టుమన్నోళ్లకు ఎందుకు ఓటెయ్యాలని, ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నారని బీజేపీ పార్టీ అభ్యర్థులను నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 150 మెడికల్‌ కాలేజీలను మంజూరు చేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు మంజూరు చేయలేదని, ఎందుకివ్వలేదని 50 ఉత్తరాలు రాశానని వివరించారు. అయినా మోదీ సర్కారు కనికరించలేదని మండిపడ్డారు.

నేతన్న ఆత్మహత్యలు కండ్లలోనే మెదులుతున్నయ్‌ ‘తెలంగాణ వచ్చే నాటికి నేతన్నల పరిస్థితి దారుణంగా ఉండేది. సిరిసిల్ల, భూదాన్‌ పోచంపల్లి, దుబ్బాకలో ఒక్కోరోజు ఆరుగురు, ఏడుగురు బలవన్మరణాలకు పాల్పడిన సంఘనటలు ఉన్నాయి. ఆ శవాలను పట్టుకుని ఏడ్చిన రోజులు నాకింక కండ్లలోనే మెదులుతున్నయ్‌’ అని కేసీఆర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘భూదాన్‌ పోచంపల్లిలో ఏడుగురు నేతన్నలు చనిపోతే.. ఆ శవాలను పట్టుకుని అప్పుడున్న సీఎంకు దండం పెట్టి బతిమిలాడా. పోయినోళ్లు పోయినరు.. బతికినోైళ్లెన బతుకుతరు రూ.50వేలో, రూ.లక్షో ఇవ్వాలని కోరిన. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’ అని గుర్తుచేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. నేత కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పారు.

ముస్లింల సంక్షేమానికి రూ.12వేల కోట్లు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముస్లింల సంక్షేమానికి కూడా బీఆర్‌ఎస్‌ విశేష కృషి చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ వివరించారు. తాను బతికున్నంత వరకూ తెలంగాణ రాష్ట్రం లౌకిక రాజ్యంగానే ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ పదేండ్ల పాలనలో ముస్లింల సంక్షేమానికి రూ.900 కోట్లు ఖర్చు చేస్తే, తొమ్మిదిన్నరేండ్ల తమ పాలనలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. ముస్లింల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ చేస్తున్న కృషిని అసెంబ్లీ వేదికగా మజ్లిస్‌ ఎమ్మెల్యేలు కూడా కొనియాడారని గుర్తుచేశారు. మైనార్టీల కోసం గురుకుల కాలేజీలను నెలకొల్పామని, రాబోయే రోజుల్లో వాటిని డిగ్రీ కాలేజీలుగా మార్చనున్నామని, తద్వారా ముస్లింలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారని తెలిపారు.

బాసర ఆలయానికి మరిన్ని నిధులు చదువులను సరస్వతీ నమస్తుభ్యం అని మొదలుపెడ్తామని, అలాంటి చదువుల తల్లి బాసర సరస్వతీదేవీ కొలువైన పవిత్ర పుణ్యభూమికి ప్రణామాలు అని కేసీఆర్‌ తెలిపారు. గతంలో ఎన్నడూ కూడా ఇక్కడ గోదావరి పుష్కరాలు జరగలేదని, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బాసరలో పుష్కరాలను జరుపుకుంటున్నామని వెల్లడించారు. బాసర ఆలయం అభివృద్ధి కోసం రూ.50 కోట్లను మంజూరు చేశామని, ఆ పనులు కొనసాగుతున్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని అవసరమైన మేరకు నిధులను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

జీవన్‌రెడ్డి నా ఇంటి మనిషి ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఎమ్మెల్యే కాకముందే తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారని కేసీఆర్‌ గుర్తు చేశారు. అప్పట్లో ఎర్రజొన్న రైతుల కోసం ఉద్యమం చేశారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీసు కాల్పులకు తెగబడిందని, కరీంనగర్‌ జిల్లా పర్యటనలో ఉన్న తాను హుటాహుటిన పరిగెత్తుకుని వచ్చానని, ఆ తర్వాత జీవన్‌రెడ్డి తనకెంతో సన్నిహితుడు అయిపోయాడని, తన కుటుంబంలో సభ్యుడిగా మారిపోయారని తెలిపారు. జీవన్‌రెడ్డి ఏదైనా కావాలని కోరితే ఇక వదిలి పెట్టడని, అలిగో గులిగో దాన్ని సాధిస్తాడని చెప్పారు. అట్లా పట్టుదలతో, పంతంతో తనని నమ్ముకున్న ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను గెలిపించుకోవాలని, అప్పు డే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కేసీఆర్‌ అన్నారు. జీవన్‌రెడ్డి తలలో నాలుకలా మీ మధ్యన ఉండే వ్యక్తి అని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్‌ ప్రజలను కోరారు.

సంజయ్‌ నా ప్రాణాలు కాపాడిండు ‘కోరుట్ల అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌ ప్రముఖ వైద్యుడు. నేను ఢిల్లీలో, ఇక్కడ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టినప్పుడు నిమిష నిమిషం నా దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకునేటోడు. నా ప్రాణాలు కాపాడిన నా బిడ్డలాంటి వ్యక్తి’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. విద్యావంతుడు, యువ నాయకుడు అని, ఆయన కావాలంటే వైద్య వృత్తిలోనే ఉంటూ కోట్లు సంపాదించుకోవచ్చని, కానీ తన గడ్డకు తాను సేవచేయాలని వచ్చాడని చెప్పారు. ఆయనను పెద్ద మనసుతో దీవించి, భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ప్రజా సేవలో విఠల్‌రెడ్డి కుటుంబం గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఉందని, ముథోల్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డి తండ్రి గడ్డెన్న ఎంతో ప్రజా సేవ చేశారని కేసీఆర్‌ కొనియాడారు. ఆయన పేరుమీద కట్టిన గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 14వేల ఎకరాలు పారాల్సి ఉన్నదని, వాస్తవంగా 4 ఎకరాలు కూడా పారని దుస్థితి నెలకొని ఉండేదని వివరించారు. కానీ విఠల్‌రెడ్డి పట్టుబట్టి నిధులు మంజూరు చేయించుకుని, కాలువలను బాగుచేయించాడని, ప్రస్తుతం 12 వేల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయని వివరించారు. మరిన్ని నిధులు మంజూరు చేసి మిగతా పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎస్సారెస్పీ నుంచి లిఫ్ట్‌ పెట్టుకున్నామని, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల ఆ పనులు ఆలస్యమయ్యాయని, త్వరలోనే పూర్తవుతాయని, ఫలితంగా ముథోల్‌, తానూర్‌, లోకేశ్వరం మండలాల్లో 50వేల ఎకరాలకు నీళ్లు కూడా వస్తాయని భరోసా ఇచ్చారు. పేదసాదలకోసం ముందుకుపోతున్న పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీ అని, విఠల్‌రెడ్డిని భారీ మెజార్టీతో మరోసారి గెలిపించాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.