-ప్రజలకు నేరుగా నాణ్యమైన సరుకులు -ప్రత్యేక బ్రాండ్‌పేరుతో పంపిణీకి పౌరసరఫరాలసంస్థ కసరత్తు -బియ్యంసహా అన్నిరకాల ఉత్పత్తుల మార్కెటింగ్ -ముఖ్యపట్టణాల్లో విక్రయకేంద్రాల ఏర్పాటు -దేశ, విదేశాలకూ ఎగుమతిచేసే యోచన -అన్ని జిల్లాకేంద్రాల్లో పెట్రోల్ బంకులు
పౌరులకు నాణ్యమైన సరుకులను అందించడంతోపాటు, కల్తీ, మోసాలను అరికట్టడంపై పౌరసరఫరాలసంస్థ దృష్టి సారించింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పంటలను సేకరించి, ప్రాసెసింగ్ చేయడంతోపాటు.. నేరుగా మార్కెటింగ్ చేయాలని యోచిస్తున్నది. తద్వారా రైతులకు తాము పండించిన పంటలపై భ రోసా కల్పిస్తూనే.. సంస్థనూ ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. బియ్యంసహా అన్నిరకాల ఉత్పత్తులను సరికొత్త బ్రాండ్‌పేరుతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. తెలంగాణ ఉత్పత్తులతో ముందుగా ఓస్టోర్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించి.. అనంతరం రైతుబజార్లు, ఇతర ముఖ్యప్రాంతాల్లో విక్రయకేంద్రాలను ఏర్పాటుచేయనున్నది. ఫలితాలనుబట్టి జిల్లాకొక ప్రత్యేకస్టోర్‌ను ఏర్పాటుచేయనున్నది. బ్రాండ్‌పై ప్రజల్లో విశ్వాసం ఏర్పడ్డాక ఉత్పత్తులను ఇతరదేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చని పౌరసరఫరాలశాఖ యోచిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమచర్యలతో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగి.. ధాన్యం దిగుబడి రెట్టింపయింది.
దీంతో ప్రజల అవసరాలకుమించి అదనంగా ఉత్పత్తి అవుతున్న ధాన్యంసహా ఇతర పంటలను ఏమి చేయాలి? ఇతర రాష్ర్టాలు, దేశాలకు ఎగుమతిచేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి? పండిన పంటను ప్రాసెసింగ్ చేసి ఒక బ్రాండ్‌గా ఎగుమతి చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? అనేవాటిపై పౌరసరఫరాలశాఖ ఇప్పటికే కసరత్తు చేసింది. అవసరాలకు మించి అధికంగా ఉన్న బియ్యాన్ని సరికొత్త బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని, క్రమంగా అన్ని సరుకులనూ నేరుగా ప్రజలకు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏ జిల్లాల్లో ఏ పంటలు అధికంగా పండుతాయి, వాటిని సేకరించి విక్రయిస్తే ఎలా ఉంటుంది అనేదానిపై ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో చర్చలు కూడా జరిపింది.
చిరుధాన్యాలపై పెరిగిన ఆసక్తి ఇటీవల రాష్ట్రంలో చిరుధాన్యాల వాడకం బాగా పెరిగింది. సేంద్రియ పద్ధతుల్లో పండించిన, నాణ్యతతో కూడిన చిరుధాన్యాలకు మంచి ఆదరణ లభిస్తుందని ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులు సూచించారు. సన్నబియ్యంతోపాటు వీటిని కూడా విక్రయిస్తే.. చిరుధాన్యాల వినియోగం పెరిగి ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించి, ఉత్పత్తులను నేరుగా సేకరించి ప్రజలకు చేరవేయాలని సూచించారు. గ్రామీణ, పట్టణప్రాంతాల ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా ఉత్పత్తులపై దృష్టిసారించాలనే నిర్ణయానికి కూడా వచ్చారు.
జిల్లా కేంద్రాల్లో పెట్రోల్ బంకులు రాష్ర్టంలో పౌరసరఫరాలసంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్‌లకు మంచి ఆదరణ లభిస్తున్నది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పౌరసరఫరాలసంస్థ మూడుపెట్రోల్ బంకులను ఏర్పాటుచేసింది. ఇకమీదట జిల్లాకు ఒకటిచొప్పున రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే లేఖలు సైతం రాశారు. ఫిల్లింగ్‌స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
త్వరలో బ్రాండ్ పేరు ఎంపిక రాష్ట్రంలో ఉత్పత్తయ్యే అన్ని వస్తువులనూ ఒకే బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేయాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం బ్రాండ్ పేరు పెట్టడంలో అధికారులు నిమగ్నమయ్యారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే లా పేరును ఎంపిక చేయనున్నారు. ఈ పేరును ఎవరైనా సూచించవచ్చని అధికారులు కోరుతున్నారు. మరోవైపు నిపుణుల సలహాలు కూడా స్వీకరిస్తున్నారు.
జిల్లాలవారీగా పంటల ఉత్పత్తులపై దృష్టి ఏయే జిల్లాల్లో ఏయే పంటలు పండుతున్నాయనే వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఖమ్మం జిల్లాలో మిర్చి, వికారాబాద్ జిల్లాలో కందులను రైతులు అధికంగా పండిస్తారు. ఆయాపంటలను పౌరసరఫరాలసంస్థ కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్ర సరికొత్త బ్రాండ్‌పేరుతో ప్రజలకు అందించాలని భావిస్తున్నది. దీనివల్ల రైతులు లాభపడటంతో పాటు, వినియోగదారులకూ లబ్ధిచేకూరుతుంది.

