రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో కీలక బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వద్ద ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖను మంత్రి కేటీఆర్‌కు అప్పగిస్తూ ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీచేశారు.
ప్రతిష్ఠాత్మక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ అన్నీ తానై పార్టీకి చరిత్ర ఎరుగని ఘనవిజయాన్ని సాధించిపెట్టిన విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల రథసారథిగా నగరంలోని గల్లీగల్లీ తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వారితో మమేకమైన కేటీఆర్‌కు నగర అభివృద్ధి బాధ్యత నిర్వహించేందుకు వీలుగా తన వద్ద ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కేటాయిస్తానని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానికి అనుగుణంగా ఆ శాఖను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. -పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కేటాయిస్తూ ఉత్తర్వులు -విశ్వనగర నిర్మాణంలో కీలకపాత్ర
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యతమిస్తున్న నేపథ్యంలో ఈ బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు అప్పగించడం ప్రాముఖ్యం సంతరించుకున్నది. ఐటీ శాఖ మంత్రి హోదాలో టీహబ్ వంటి వినూత్న ఆవిష్కరణతో పాటు పలు ప్రతిష్ఠాత్మక కంపెనీలను నగరానికి రప్పించిన కేటీఆర్, ముఖ్యమంత్రి లక్ష్యాన్ని పరిపూర్ణం చేయగలరనే విశ్వాసం సర్వత్రా వెల్లడవుతున్నది. మరోవైపు గ్రేటర్ వంటి మహానగరంలో సమస్యలను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల పరిధిలోని సమస్యలను కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించగలుగుతారని ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ప్రజలు ఆశిస్తున్నారు.

