-ఈబీసీ బిల్లుకు సవరణలు కోరండి -ముస్లింలకు 12%, గిరిజనులకు 10% రిజర్వేషన్ పెంపును చేర్చేలా పట్టుబట్టాలి -రాష్ట్ర డిమాండ్‌పై పార్లమెంట్‌లో పోరాడాలి -ఎంపీలను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -రాష్ట్రంలో ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలి: సీఎం కేసీఆర్ -తెలంగాణ తీర్మానాలను బిల్లులో చేర్చాలి -రిజర్వేషన్ల కల్పన అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి -ఢిల్లీలో ఎంపీ బీ వినోద్‌కుమార్ డిమాండ్
అగ్రవర్ణాల్లోని పేదలకు(ఈబీసీలకు) పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు సవరణలు కోరాలని టీఆర్‌ఎస్ ఎంపీలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో ముస్లింలలో వెనుకబడిన వారికి 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సి ఉన్నదని చెప్పారు. ఇప్పుడు కేంద్రం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేపట్టినందున, ఈ బిల్లులోనే తెలంగాణలో రిజర్వేషన్ల పెంపుపై చేసిన తీర్మానాన్ని చేర్చాలని కోరాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బిల్లులో సవరణలు తెచ్చి, తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను చేర్చేలా పట్టుబట్టాలని ఎంపీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 2017లో ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ పెంచాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. అప్పటి నుంచి ఈ అంశం కేంద్రం పరిధిలోనే ఉన్నది. సీఎం కేసీఆర్ అనేకసార్లు రిజర్వేషన్ల పెంపుపై కేంద్రాన్ని కోరినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు.
కేంద్రం స్పందించాలి: ఎంపీ బీ వినోద్ ఈబీసీ బిల్లులో సవరణలు చేయాలని, తెలంగాణలో ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని బిల్లులో చేర్చాలని కేంద్రాన్ని ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఎంపీ వినోద్ మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సవరణలకు పట్టుబడుతామని తెలిపారు. రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగ సవరణ అవసరమంటూ ఇన్నాళ్లు కేంద్రం నాన్చుతూ వచ్చిందని, ఇప్పుడు ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాం గ సవరణ కోసం ముందుకొచ్చినందున తెలంగాణ తీర్మానాలను బిల్లులో చేర్చాలని డిమాండ్‌చేశారు. నెలరోజుల నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా, ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించే అతి ముఖ్యమైన బిల్లును చివరిరోజుల్లో పార్లమెంట్‌లో పెట్టి బీజేపీ గందరగోళ పరిస్థితి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యమైన ఈ బిల్లుపై మాట్లాడేందుకు తక్కువ సమయం ఉన్నదని, బిల్లుపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు పార్టీలకు, ఎంపీలకు సమ యం లేకుండా పోయిందన్నారు. ఉత్తరాదిన ఓసీలు ఎక్కువని, ఛత్తీస్‌గఢ్‌లో ఎస్టీలు, దక్షిణాది రాష్ర్టాల్లో వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు ఎక్కు వ ఉంటారని.. ఇలా ఒక్కో రాష్ర్టానికి ఒక్కో సామాజిక పొందిక ఉంటుందని వివరించారు. ఈ అంశాలన్నింటినీ కేంద్రం విస్మరించిందని విమర్శించారు. ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన తెలంగాణ అసెంబ్లీ తీర్మానంపై కేంద్రప్రభుత్వం స్పం దించడం లేదని మండిపడ్డారు. ఇంద్రసహాని కేసును చూపుతూ మైనార్టీ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపును మోదీ ప్రభుత్వం నాలుగున్నరేండ్లుగా అడ్డుకుంటున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్లను కేంద్రం ఇప్పటికైనా పరిగణనలోకి తీసుకోవాలని, శాసనసభ చేసిన చట్టాన్ని కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. సామాజిక పొందిక ఆధారంగా రిజర్వేషన్లను కల్పించుకొనే అవకాశం రాష్ట్రాలకే ఇవ్వాలని ఎంపీ వినోద్‌కుమార్ కోరారు.

