-అన్ని సర్వేలూ టీఆర్‌ఎస్‌కే అనుకూలం -నెలాఖరున వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో బహిరంగసభలు -అంతటా సద్దుమణిగిన అసమ్మతి -ఉప ముఖ్యమంత్రి కడియం వెల్లడి
రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మహాకూటమి అసలు పోటీయే కాదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సర్వే ఫలితాలన్నీ అధికారపార్టీకి అనుకూలంగా ఉన్నాయని, స్థానిక ప్రైవేటుసంస్థలతోపాటు, కేంద్ర సంస్థలు జరిపిన సర్వేలూ టీఆర్‌ఎస్‌కే బ్రహ్మరథం పడుతున్నాయని వివరించారు. ఆదివారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశ వివరాలను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్‌తో కలిసి కడియం మీడియాకు వెల్లడించారు. డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను సమాయత్తం చేయడం, ఎన్నికల ప్రచారంలో అవలంబించాల్సిన విషయాలపై కేసీఆర్ పలు సూచనలు చేశారని తెలిపారు. నోటిఫికేషన్ దగ్గర నుంచి పోలింగ్ వరకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారని అన్నారు. పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఒక్కో నియోజకవర్గంలో రైతుబంధు పథకం లబ్ధిదారులే కాకుండా సగటున 60 వేల మంది ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్నారని, వీరందరినీ కలుపుకోవాలని అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తామని కేసీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారని, ప్రతి అభ్యర్థి బ్యాక్ ఆఫీస్ ఏర్పాటుచేసుకోవాలని దిశానిర్దేశం చేశారని అన్నారు. అసెంబ్లీని రద్దుచేసిన సెప్టెంబర్ 6 నుంచి ఇప్పటివరకు చేసిన సర్వేల వివరాలను కేసీఆర్ అభ్యర్థులతో పంచుకున్నారని వివరించారు.
నియోజకవర్గాలవారీగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను అభ్యర్థులకు అందించారని, వారందరికీ ప్రభుత్వంపై కృతజ్ఞత ఉంటుందని, పార్టీ అభ్యర్థులు, నాయకులు ప్రతిఒక్క లబ్ధిదారుడిని కలిసి టీఆర్‌ఎస్‌కు ఓటేసేలా విజ్ఞప్తిచేయాలని కడియం సూచించారు. శాంపిల్ సర్వేలోనూ అన్ని నియోజకవర్గాల్లో స్పష్టమైన మెజారిటీ కనిపించిందని, దీనిని కాపాడుకోవడమే కాకుండా 5 నుంచి 10శాతం పెంచుకొనేలా కృషిచేయాలని సూచిం చారని అన్నారు. ఇంకా 45 రోజుల సమయం ఉన్నదని, ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరును కలిసి టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించాలని చెప్పారన్నారు.
ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసుకోవడానికి, ప్రచార సామగ్రి ప్రతి గ్రామానికి చేరడానికిగాను నియోజకవర్గానికో బ్యాక్ ఆఫీస్ వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారని చెప్పారు. ఈ నెలాఖరులోగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో బహిరంగసభలు ఏర్పాటు చేయడానికి సమయం కేటాయించాలని కేసీఆర్‌ను కోరామని, అందుకు ఆయన అంగీకరించారని కడియం చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ అసమ్మతి సద్దుమణిగిందని, రెండుమూడు నియోజకవర్గాల్లో అసమ్మతి ఉన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌కు దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.

