-తెలంగాణభవన్‌లో ఉదయం 11.56 గంటలకు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు
-భారీస్థాయిలో ఏర్పాట్లుచేసిన పార్టీ శ్రేణులు
-10 గంటలకు బసవతారకం క్యాన్సర్ దవాఖాన నుంచి ర్యాలీ
-ఈ నెల 20 నుంచి జిల్లాల పర్యటనలు
-వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరంగల్‌లో తొలి పర్యటన
-వరంగల్ బాలసముద్రంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన

టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారకరామారావు బాధ్యతల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణభవన్‌లో సోమవారం ఉదయం 11.56 గంటలకు కేటీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లుచేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న కేటీఆర్‌ను అభినందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నాయకులు, పార్టీ శ్రేణులు హాజరయ్యే అవకాశమున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లుచేశారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ, కళాకారుల ప్రదర్శన నిర్వహించనున్నారు. తెలంగాణభవన్ పరిసరాలను గులాబీమయంగా మార్చారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా తెలంగాణభవన్ ఆవరణలో ఎల్‌ఈడీలు, మైకులు ఏర్పాటుచేశారు. కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, పార్టీ సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.
ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ
కేటీఆర్ పదవీబాధ్యతల స్వీకార కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించేందుకు మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ ముమ్మర ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10.15 గంటలకు బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ దవాఖాన నుంచి తెలంగాణభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కేటీఆర్ తొలుత తెలంగాణతల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తారు. అనంతరం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వర్తమాన రాజకీయాల్లో యువ నాయకుడు కేటీఆర్ అని, ఆయన కారణంగానే ఇటీవలి ఎన్నికల్లో కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపుకొని కొత్త ఊపుతో పనిచేశారని తెలంగాణభవన్ వద్ద బాధ్యతల స్వీకార కార్యక్రమం ఏర్పాట్లును పరిశీలించేందుకు వచ్చిన మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఎన్నికవడం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజాన్ని నింపిందన్నారు. బంగారు తెలంగాణ చేయడానికి వెసులుబాటు ఇచ్చేలా సీఎం కే చంద్రశేఖర్‌రావుకు వెన్నుదన్నుగా ఉండేవిధంగా కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారన్నారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటీఆర్ ముఖ్యభూమిక పోషిస్తారని పేర్కొన్నారు. తలసాని, బొంతు రామ్మోహన్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించినవారిలో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కే వాసుదేవరెడ్డి ఉన్నారు.
ఈ నెల 20 నుంచి జిల్లాల పర్యటనలు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడుతున్న కల్వకుంట్ల తారకరామారావు జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. ఈ నెల 20 నుంచి జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ సిద్ధంచేసుకొంటున్నారు. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయాల సొంత భవనాల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కడియం శ్రీహరి, ఎంపీలు సీతారాంనాయక్, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి తదితరులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలి పర్యటన వరంగల్ జిల్లా నుంచే ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా కేటీఆర్ తొలుత జనగామలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతారు.
అనంతరం బాలసముద్రంలో వరంగల్ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమై పార్టీ అభివృద్ధికి కార్యాచరణ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన సమస్యలపై చర్చించనున్నారు. త్వరలో జరుగనున్న గ్రామపంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు సభ్యత్వ నమోదు, రానున్న ఆరునెలలకు కార్యాచరణను పార్టీ క్యాడర్‌కు కేటీఆర్ వివరించనున్నారు. ప్రతీ గ్రామపంచాయతీలో పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వీలైనంతవరకు ఎక్కువ పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రభుత్వం నుంచి రూ.పది లక్షల బహుమతి పొంది గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించనున్నారు. అదేవిధంగా త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయనున్నారు.

