-చెప్పింది చేయలేదు..హామీలను నెరవేర్చలేదు
-చట్టం ప్రకారమే సాయం చేశారు పైసా ఎక్కువ ఇచ్చింది లేదు
-గత నాలుగేండ్లలో అందిన మొత్తం రూ.81,362 కోట్లు మాత్రమే
-కేంద్ర సాయంపై వివరాలు విడుదలచేసిన సీఎం కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేయలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. తెలంగాణకు బాజాప్తాగా రావాల్సిన వాటానే ఇచ్చింది అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన వాటాలో భాగంగానే నిధులను విడుదలచేసిందని, అంతకుమించి పైసా ఎక్కువ ఇచ్చింది లేదని పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని చెప్పారు. పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసుకు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 ప్రకారం అన్ని రాష్ర్టాలకు మాదిరిగానే నిధులను విడుదల చేసింది తప్ప తెలంగాణకు ప్రత్యేకంగా చేసిందేమీలేదన్నారు. గత నాలుగేండ్లలో రూ.81,362కోట్లను మాత్రమే ఇచ్చిందని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదలైన నిధుల వివరాలను సీఎం కేసీఆర్ విలేకరులకు అందించారు.

