-అక్టోబర్ 3 నుంచి జిల్లాల్లో టీఆర్‌ఎస్ బహిరంగ సభలు -ఐదు ఉమ్మడి జిల్లాల్లో 8 వరకు ప్రచారం
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ పార్టీ భారీఎత్తున ప్రచారానికి తెరలేపింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ శ్రేణులకు మరింత ఊపు తెచ్చేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రచార బరిలో దిగనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ హుస్నాబాద్‌లో నియోజకవర్గ స్థాయి ఎన్నికల బహిరంగ సభను నిర్వహించి ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలవారీగా భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఐదు జిల్లాల్లో సభలు జరుగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రాథమికంగా ఖరారుచేశారు. టీఆర్‌ఎస్ పార్టీ 105 అసెంబ్లీస్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతోపాటు వారికి పార్టీ ప్రచార సామగ్రిని కూడా అందించింది.
దీంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఖరారు కాకముందే టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులంతా ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ఒక దఫా ప్రచారాన్ని పూర్తిచేశారు. గ్రామగ్రామాన ప్రచారం చేస్తూ పభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, వాటి ఫలాలను ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభలతో ఈ ప్రచారానికి మరింత ఊపు రానున్నది.

