Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

హరిత తెలంగాణే కేసీఆర్ లక్ష్యం

– ఇక లైట్‌రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఏర్పాటుపై దృష్టి – మురికివాడల్లో గ్రీన్‌కాన్సెప్ట్‌లోనే ఇండ్ల నిర్మాణాలు – గ్రీన్‌బిల్డింగ్ కాంగ్రెస్ సదస్సులో మంత్రి కేటీఆర్

KTR 02 తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలన్న లక్ష్యానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. మాదాపూర్ హెచ్‌ఐసీసీలో గురువారం సీఐఐ, ఐజీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రీన్‌బిల్డింగ్ కాంగ్రెస్-2014 సదస్సు, ఎగ్జిబిషన్‌కు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని రాష్ర్టాన్ని హరితవనంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.

హైదరాబాద్‌లోని 124 ఐటీ సంస్థల్లో రెట్రో ఫిట్టింగ్, ఇంధనపొదుపు కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేశామని తెలిపారు. తెలంగాణలో కరెంటు లోటును అధిగమించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం లో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ పార్క్ ఏర్పాటుకు టెండర్లు పిలిచామని, ఇది దేశంలోనే మొట్టమొదటి సోలార్‌పార్క్ అని తెలిపారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇందులో భాగంగా వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా హరితహారం పేరిట 230 కోట్ల మొక్కలను నాటాలనే దృఢసంకల్పంతో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఐఐ, ఐజీబీసీ వారు 100 గ్రీన్ స్కూల్‌లు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.

హైదరాబాద్ నగరాన్ని మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, నగరంలో స్లమ్ రిహాబిలిటేషన్ కార్యక్రమం ద్వారా మంజూరుచేసే కొత్త ఇండ్లను గ్రీన్‌కాన్సెప్ట్‌తోనే నిర్మిస్తామని తెలిపారు. దేశంలో ఐజీబీసీలో 2700 గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులు రిజిష్టర్ అయి ఉన్నాయని, ఈ ప్రాజెక్టుల వల్ల భారత్ గ్రీన్‌బిల్డింగ్ ఫుట్‌ప్రింట్‌లో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నదని, విశ్వనగరవాసులకు త్వరలోనే లైట్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గ్రీన్ స్కూల్స్ రేటింగ్ సిస్టమ్, ఐజీబీసీ ఆన్‌లైన్ సర్వీసెస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

గ్రీన్ ఐ కాంటెస్ట్, గ్రీన్ డిజైన్ కాంపిటీషన్‌లలో విజేతలకు ఆయన బహుమతి ప్రదానం చేశారు. అనంతరం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటుచేసిన పలు ఉత్పత్తులను మంత్రి కేటీఆర్ ఆసక్తిగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ మంగుసింగ్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్, క్రెడాయ్ జాతీయఅధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రేమ్ సీ జైన్, సీఐఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీనివాస్, రఘుపతి, సీఐఐ వైస్‌చైర్మన్ వనితా దాట్ల పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.