-టీఆర్‌ఎస్ సభ్యత్వాలకు క్యూ కడుతున్న జనం -ముందుకువస్తున్న అన్నివర్గాలు -వాడవాడలా పండుగ వాతావరణం -రికార్డు స్థాయిలో సభ్యత్వాల నమోదు

టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వాల నమోదుకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా జనం వెల్లువలా తరలివస్తుండటంతో పండుగ వాతావరణం నెలకొంటున్నది. సభ్యత్వాల స్వీకరణకు రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. ముఖ్యంగా సీమాంధ్రకు చెందిన వారు ఎక్కువ మక్కువచూపుతున్నారు. దీంతో పార్టీ నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువగా రికార్డుస్థాయిలో సభ్యత్వాలు నమోదవుతున్నాయి.
సభ్యత్వం స్వీకరించిన ఆంధ్రా మేస్త్రీలు: బతుకుదెరువు కోసం కరీంనగర్ జిల్లాకు వచ్చి మేస్త్రీలుగా కొనసాగుతున్న 500 మంది ఆదివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పార్టీ జిల్లా కన్వీనర్ ఈద శంకర్‌రెడ్డి సమక్షంలో కార్పొరేటర్లు వై సునీల్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ సభ్యత్వం స్వీకరించారు. ఆంధ్రా గృహనిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రా మేస్త్రీలు సభ్యత్వాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రూప్‌సింగ్ పాల్గొన్నారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో పార్టీ జిల్లా కన్వీనర్ ఈద శంకర్‌రెడ్డి, ధర్మారం మండలంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో అక్బర్‌హుస్సేన్ ఆధ్వర్యంలో బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. మల్యాలలో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభకు పార్టీ నాయకులు 5వేల సభ్యత్వాలను అందించారు. జిల్లాలో సభ్యత్వాలు 3 లక్షలు దాటాయి.
గ్రేటర్‌లో ఒకే రోజు లక్షా 94వేల సభ్యత్వం: గ్రేటర్ హైదరాబాద్‌లో రికార్డుస్థాయి దిశగా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే సుమారుగా 2 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వం కోసం శ్రేణుల నుంచి భారీ డిమాండ్ ఉండటంతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదును కొనసాగించారు. ఆదివారం కావడం.. శిబిరాలు ఏర్పాటు చేయడంతో నగరవాసులు సభ్యత్వం తీసుకోవడానికి క్యూ కట్టారు.
సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష: మంత్రి జోగు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని అటవీశాఖ మంత్రి జోగు రామన్న స్పష్టంచేశారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో తిరుపల్లి, జైనథ్ మండలంలోని లేకూరివాడ, బేల మండలంలోని తాప్సీలో సభ్యత్వ నమోదులో మంత్రి పాల్గొన్నారు. బాసరలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రామగ్రామాన ఉత్సాహం: మహబూబ్‌నగర్ జిల్లాలో ఉత్సాహంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కొనసాగుతున్నది. ఆదివారం నాటికి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 7 సెగ్మెంట్లలో 90శాతం టార్గెట్‌కు చేరుకోగా, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, జడ్చర్ల నియోజకవర్గాల్లో టార్గెట్ పూర్తికావడంతో అదనంగా సభ్యత్వ నమోదు జరుగుతున్నది. సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి జల్లా మార్కండేయ ఆధ్వర్యంలో జడ్చర్లలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చురుగ్గా సభ్యత్వ నమోదులో పాల్గొంటున్నారు. కొల్లాపూర్ పట్టణంలో సత్యసాయి టాకీస్ రోడ్డులో శానిటరీ టైల్స్ వ్యాపారం చేస్తున్న ఏపీలోని కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన రాజవరపు సుబ్బారావు స్వచ్ఛందంగా ముందుకువచ్చి టీఆర్‌ఎస్ క్రియాశీల సభ్యత్వాన్ని ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు చేతుల మీదుగా అందుకున్నారు. కొల్లాపూర్ పరిధి వరిదేలలోని 19వ వార్డులో ఉంటున్న పడమటి రామలక్ష్మమ్మ (105) సభ్యత్వం అందుకున్నది.
లక్ష్యానికి మించిన నిజామాబాద్: టీఆర్‌ఎస్ సభ్యత్వం ఇందూరు జిల్లాలో జోరుగా సాగుతున్నది. జిల్లాకు ఇచ్చిన 2.70 లక్షల సభ్యత్వం చేయాలని పార్టీ అధిష్ఠానం టార్గెట్ పెట్టింది. మూడ్రోజుల క్రితమే జిల్లాలో ఈ లక్ష్యాన్ని చేరుకొని తమ సత్తా చాటారు నాయకులు. ఆదివారం నిజాంసాగర్ మండలం మహ్మద్‌నగర్‌లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్యే హన్మంత్‌సింధే పాల్గొన్నారు.
నేతల సుడిగాలి పర్యటనలు: రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఆదివారం అత్యంత ఉత్సాహంగా కొనసాగింది. పార్టీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహించి కార్యకర్తలకు సభ్యత్వం అందజేశారు. నవాబుపేట మండలంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు పర్యటించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పర్యటించారు. రవాణామంత్రి మహేందర్‌రెడ్డి ఎల్‌బీనగర్, ఉప్పల్, కుషాయిగూడ, మౌలాలి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో సభ్యత్వాలు అందజేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి పెద్దేముల్ మండలం ముంబాపూర్‌లో పాల్గొన్నారు.
మెదక్‌లో లక్ష్యం దాటిన సభ్యత్వాలు: మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని దాటింది. జిల్లాలో నియోజకవర్గానికి 30 వేల చొప్పున 3 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకోగా ఆదివారం మధ్యాహ్నానికి 3 లక్షల 65 వేల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన వాటిలో 2,79,600 సాధారణ, 68,811 క్రియాశీల సభ్యత్వాలున్నాయి. ఆదివారం పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 20 నాటికి జిల్లాలో 5 లక్షల సభ్యత్వాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి హరీష్‌రావు నమోదు ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి సామేల్, జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణలు జిల్లాలో పర్యటిస్తున్నారు.
నాలుగున్నర లక్షలకు చేరిన వరంగల్ సభ్యత్వం: సభ్యత్వ నమోదుకు వరంగల్ జిల్లాల్లో అనూహ్య స్పందన లభిస్తున్నది. ఆదివారం సాయంత్రం వరకు జిల్లాలో నాలుగున్నర లక్షల మంది టీఆర్‌ఎస్‌లో సభ్యులుగా చేరారు. జిల్లాకు 3 లక్షల 60 వేల సభ్యత్వం నమోదు టార్గెట్ ఇవ్వగా ఈనెల 20 వరకు 6లక్షల వరకు చేరుకుంటుందని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు పేర్కొన్నారు. ఇంటికొకరు గులాబీ దళంలోకి..: ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లాలో గులాబీ దళంలో చేరేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో జరిగిన సభ్యత్వ నమోదులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పాల్గొన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలోని కంబాలపల్లి, తేల్దార్‌పల్లి గ్రామాల్లో జెడ్పీ చైర్మన్ బాలునాయక్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభించారు. నల్లగొండ పట్టణంలోని 5,12, 39 వార్డుల్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్‌రెడ్డి, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బోయపల్లి కృష్ణారెడ్డి, మాలే శరణ్యారెడ్డి, అలుగుబెల్లి రాంరెడ్డి తదితరులు పాల్గొని సభ్యత్వాలు అందజేశారు. సూర్యాపేట పట్టణంలో 7, 23, 28, 29, 32 వార్డుల్లో జిల్లా ఇన్‌చార్జి శ్రవణ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళ్లికాప్రకాశ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఖమ్మంలో 90శాతం పూర్తి: ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ మహోద్యమంలా ముందుకు సాగుతున్నది. ఆదివారం ఖమ్మం, మధిర, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ్యత్వ నమోదును పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అద్యక్షుడు దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు.