-2100 మందికి ఉపాధి -మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.26 కోట్లు -చేనేతశాఖ మంత్రి కేటీఆర్ KTR
చేనేత చీరెలకు ప్రసిద్ధిగాంచిన గద్వాలకు ప్రత్యేకంగా క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం గద్వాల జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో చేనేత కార్మికుల బృందం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఇప్పటికే క్లస్టర్‌కు సంబంధించిన అంశాలను వివరిస్తూ ఐఎల్‌ఎన్‌ఎఫ్‌ఎస్ కన్సల్టెంట్ సంస్థ నివేదిక ఇచ్చిందని దీని ఆధారంగా క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ వివరించారు. క్లస్టర్ ద్వారా చేనేత కార్మికులకు మార్కెటింగ్, ఉత్పత్తికి సంబంధించిన మెళకువలపై శిక్షణ ఇస్తామన్నారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ప్రోత్సాహకాలపై మంత్రులు వారి అభిప్రాయం తెలుసుకున్నారు. క్లస్టర్ ద్వారా సుమారు 2100 మంది చేనేతమగ్గాల కార్మికులకు ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 26 కోట్ల నిధులను విడుదల చేయనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు. రుణాలు మాఫీ చేయాలని నేత కార్మికులు మంత్రికి విన్నవించారు.

