– ప్రాంతీయపార్టీల ఐక్యతే ఫ్రంట్ లక్ష్యం
– సీఎం కేసీఆర్ ప్రయత్నాలకు మంచి స్పందన
– ఓర్వలేనితనంతోనే కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీడీపీ నేతల ఆరోపణలు
– ప్రజాస్వామ్యంలో రెండు పార్టీలే ఉండవు
– కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తున్నదని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో ఫెడరల్ ఫ్రంట్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడం ఖాయమని చెప్పారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకే సీఎం కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారంటూ కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు, సురవరం సుధాకర్‌రెడ్డి, నారాయణ తలాతోకలేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటంలో, ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్, బీజీపీ విఫలమవడంవల్లే తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రజలు ప్రాంతీయపార్టీలకు పట్టం కడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో రెండు పార్టీలు మాత్రమే ఉండవన్న వినోద్.. ఎన్నిపార్టీలు ఉంటే ప్రజాస్వామ్యానికి అంత మంచిదని చెప్పారు. ప్రాంతీయపార్టీల మద్దతుతోనే కేంద్రంలో జాతీయపార్టీలు అధికారం చెలాయిస్తున్నప్పటికీ.. ప్రాంతీయపార్టీల్లో ఐక్యత లేకపోవడంతో రాష్ర్టాలపై పెత్తనం పెరిగి సమస్యలు పరిష్కారం కావడం లేదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను స్థాపించినప్పుడు అందరూ న వ్వారని, కానీ చివరకు లక్ష్యం సాధించారని చెప్పారు.
ఎంపీలను చులకనగా చూస్తున్నారు అభివృద్ధి పనుల కోసం కేంద్ర కార్యాలయాలకు వెళ్తే ఎంపీలను చులకనగా చూస్తున్నారని, సిల్లీగా సమాధానాలు ఇస్తున్నారని ఎంపీ వినోద్ ఆవేదన వ్యక్తంచేశారు. డైరెక్టర్లు, సెక్రటరీలతో సహా కిందిస్థాయి ఉద్యోగులు కూడా పట్టించుకోవcం లేదన్నారు. ప్రాంతీయపార్టీలతో కూడిన ఫెడరల్‌ఫ్రంట్ ఢిల్లీలో ఉంటే.. రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
2006లోనే కేసీఆర్‌కు ఫ్రంట్ ఆలోచన కేసీఆర్‌కు ఫ్రంట్ ఆలోచన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక వచ్చింది కాదని, 2006లోనే ఆయన దీనిపై ఆలోచన చేశారని ఎంపీ వినోద్ తెలిపారు. యూపీఏ-1 హయాంలో తెలంగాణ బిల్లు గురించి అడిగితే సోనియాగాంధీ మిగతా భాగస్వామ్యపక్షాల పేరు చెప్పి తప్పించుకున్నారన్నారు. 32కుగాను 28 రాజకీయపార్టీలు నాడు తెలంగాణకు సానుకూలంగా ఉన్నాయని, అయినా సోనియా ముందుకు రాలేదని తెలిపారు. ఇదే విషయమై సీపీఎం నేత సీతారాం ఏచూరిని అడిగితే.. తమ భుజాలపై తుపాకీ పెట్టి మిమ్మల్ని కాలుస్తున్నారని, పార్లమెంట్‌లో బిల్లు పెడితే అడ్డుకోబోమని చెప్పారని ఎంపీ వివరించారు. జాతీయపార్టీలకు తక్కువ సంఖ్యాబలం ఉన్నా ప్రాంతీయపార్టీల సహకారంతో అధికారం చేజిక్కించుకొని రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయని, ప్రాంతీయపార్టీలు కేంద్రంలో నిర్ణయాత్మక పాత్రలో ఉంటే రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకోవచ్చని సీఎం కేసీఆర్ ఆ సమయంలోనే నిర్ణయించారని వెల్లడించారు. అలా అప్పుడేఫ్రంట్ ఆలోచన మొదలైందన్నారు.

