-రెండోరోజు నిర్విఘ్నంగా కొనసాగిన యాగ, పారాయణాలు -మహారుద్రం, రాజశ్యామల, బగళాముఖి హవనాలు -మూడు లక్షల నవార్ణ జపం పూర్తి -పూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు -హాజరైన ప్రజాప్రతినిధులు
నిరంతర వేదఘోషతో ఎర్రవల్లి చండీయాగ వేదిక అమరధామంలా శోభిల్లుతున్నది. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో సమాజ క్షేమం కోసం, తెలంగాణ ప్రజల సుఖశాంతుల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంకల్పించిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం పంచాహ్నిక దీక్షలో రెండోరోజు క్రతువు దిగ్విజయంగా సాగింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి వంద మంది రుత్విక్కులు మొత్తం 200 చండీ పారాయణాలు పూర్తిచేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు మంత్రపుష్ప సహిత మాధ్యాహ్నిక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మహా హారతినిచ్చారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రుత్విక్కులు మూడు లక్షల నవార్ణ జపంచేశారు. రాత్రి 7.30 గంటలకు మహా హారతి మంత్ర పుష్పము, చతుర్వేద సేవలు, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు పూర్తిచేశారు.
మహారుద్రయాగం ఉదయం తొమ్మిది గంటలకు శాంతిపాఠముతో మహారుద్రయాగం ప్రారంభమైంది. 44 మంది రుత్విక్కులు ఏకకాలంలో ఏకాదశ రుద్రాభిషేకాలను నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటలనుంచి 22 మంది రుత్విక్కులు ఒక్కొక్కరు రెండు చొప్పున ఏకాదశ రుద్రహోమాలను నిర్వహించారు. ఆ తర్వాత క్రమార్చన హారతి, మంత్రపుష్ప సమర్పణ, తీర్థప్రసాద వితరణతో రెండోరోజు రుద్రయాగం పూర్తయింది.
రాజశ్యామల యాగం మొదటిరోజులాగే రెండోరోజు కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. అనుష్ఠానం అనంతరం రాజశ్యామల మహావిద్య పారాయణం జరిగింది. ఆ తర్వాత హోమం పూర్తిచేసి.. అమ్మవారికి సహస్రనామార్చనచేశారు.
బగళాముఖి హవనం మహారుద్ర సహిత చండీయాగానికి సమాంతరంగా దశమహావిద్యల్లో ప్రముఖమైన బగళాముఖి హవనం కూడా ఎర్రవల్లిలో జరిగింది. ఉదయం 9 గంటలకు 10 మంది రుత్విక్కులు పదివేల జపం చేశారు. సాయంకాలం 10 మంది రుత్విక్కులు 10 వేల జపము, హరిద్రాన్నముతో మూల మంత్ర హవనము పూర్తిచేశారు. అనంతరం బగళాముఖి అమ్మవారికి అర్చన చేశారు. ఎర్రవల్లి చండీయాగ వేదిక ప్రాంగణంలో ప్రతిరోజు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద పారాయణాలు జరుగుతున్నాయి. మహేతిహాసాలైన రామాయణ భారతాల్లోని సుందరకాండ, విరాట పర్వం పారాయణాలు కూడా సమాంతరంగా చేస్తున్నారు. వీటితోపాటు మహాసౌర పారాయణం జరుగుతున్నది. శృంగేరీ శారదాపీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామివారి ఆశీస్సులతో, శ్రీశారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మార్గదర్శనంలో, బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజుల పర్యవేక్షణలో యాగ, పారాయణాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి.
పూజాకార్యక్రమాలను వేద పండితులు పురాణం మహేశ్వరశర్మ, మంగళంపల్లి వేణుగోపాలశర్మ, శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ, ఫణి శశాంకశర్మ, గంగవరం నారాయణశర్మ, జీ కామేశ్వరశర్మ, కాసుల చంద్రశేఖరశర్మ, ఓరుగంటి గోపాలశర్మ నిర్వహిస్తున్నారు. ఈ యాగ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్‌అలీ, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్, ఎంపీ కవిత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, ఆకుల లలిత, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, గడ్డం అరవింద్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

