Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దేశం దారి మారాలి

-భావి భారత్‌కు సరికొత్త మార్గం చూపాలి
-ఆ దిశగానే మేమంతా అడుగులేస్తున్నాం
-అది ఒక మహాకార్యం.. ఒక్కరితో కాదు
-అన్ని పార్టీలు, సంఘాల నేతలను కలుస్తాం
-మా ప్రయత్నాలకు ఇప్పుడే పేర్లు పెట్టొద్దు
-రాంచీలో మీడియాతో సీఎం కేసీఆర్‌
-జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ ఇంట్లో చర్చలు
-శిబుసొరేన్‌ ఆశీర్వాదం తీసుకున్న సీఎం

కేసీఆర్‌ చేతులకు శతకోటి దండాలు..
కర్నల్‌ సంతోష్‌బాబుకు అంగరక్షకుడిగా ఉన్న నా కుమారుడు కుందన్‌ కుమార్‌ ఓఝా గల్వాన్‌ లోయ ఘర్షణలో వీరమరణం పొందాడు. తెలంగాణ వాసి అయిన సంతోష్‌బాబుకు నా కుమారుడు
రక్షణగా ఉంటే.. మా కుటుంబానికి తెలంగాణ సర్కార్‌ రక్షణగా నిలబడింది.
-రవిశంకర్‌ ఓఝాఅమర జవాన్‌ కుందన్‌కుమార్‌ తండ్రి

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా సరైన అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు ఆ దిశగా దేశ గమనాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మెరుగైన భారత్‌ నిర్మాణం దిశగా ప్రయత్నిస్తున్నామని, ఆ క్రమంలో అడుగులు పడుతున్నాయని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలు ఆశించినంతగా దేశం అభివృద్ధి చెందలేదని, ఇటువంటి తరుణంలో కొత్త మార్గాన్వేషణ మొదలైందని చెప్పారు. ఏ మార్గంలో వెళ్లాలి? అందుకు ఏం చేయాలనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం రాంచీకి వెళ్లిన సీఎం కేసీఆర్‌.. జార్ఖండ్‌ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సొరేన్‌, ఆయన కుమారుడు హేమంత్‌ సొరేన్‌తో వారి నివాసంలో చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శిబు సొరేన్‌, హేమంత్‌ సొరేన్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయని తెలిపారు. ప్రధానంగా దేశ రాజకీయాలపై చర్చించామన్నారు. ‘ప్రపంచంతో పోలిస్తే చాలా విషయాల్లో మనం వెనుకబడ్డాం. పొరుగున ఉన్న చైనాతోపాటు అనేక ఆసియా దేశాలు అభివృద్ధి చెందాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దేశాన్ని సరైన దిశలో నడిపించడంలేదు. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. దీనిపైనా చర్చించాం. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మేమంతా ఒకచోట కలుస్తాం. దేశ నూతన వికాసం కోసం ఏ మార్గంలో పయనిస్తే మంచిది? అనే విషయాలను అందరం కలిసి చర్చిస్తాం. అనంతరం అన్ని విషయాలూ వెల్లడిస్తాం’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

దేశ వికాసమే ఎజెండా
దేశాన్ని సరైన దిశలో తీసుకుపోయే గట్టి ప్రయత్నం ప్రారంభమైందని కేసీఆర్‌ అన్నారు. ‘మా ప్రయత్నాలకు ఎవరికి తోచిన విధంగా వారు పేర్లు పెడుతున్నారు. నిజానికి వీటికేం పేర్లు లేవు.. పెట్టకండి. యాంటి బీజేపీ ఫ్రంట్‌, యాంటి కాంగ్రెస్‌ ఫ్రంట్‌ లాంటివి లేవు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్న. థర్డ్‌ ఫ్రంట్‌, ఫోర్త్‌ ఫ్రంట్‌.. ఏ ఫ్రంట్‌ ఇప్పటికీ ఖరారు కాలేదు. భవిష్యత్తులో స్పష్టత వస్తుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా ప్రజలకు ఆశించిన ఫలాలు దక్కలేదు. దేశ వికాసం కోసం కొత్త మార్గంలో సాగాలి. ఆ మార్గం ఏంటి? ఎలా చేయాలి? ఏం చేయాలి? అనే విషయాలపై భవిష్యత్తులో స్పష్టత వస్తుంది’ అని వివరించారు.

మెరుగైన భారత్‌ నిర్మాణం కావాలి
పురోగామి భారత్‌ నిర్మాణంలో జర్నలిస్టులు కూడా భాగస్వాములు కావాలని కేసీఆర్‌ కోరారు. ‘నేను చెప్పదల్చుకున్న విషయాలను స్వచ్ఛమైన మంచి మనసుతో, అర్థవంతంగా చెప్తున్నా. ప్రస్తుతమున్న భారత్‌ కంటే ఎన్నోరెట్లు మెరుగైన భారత్‌ను నిర్మించి, వాటి ఫలాలను ప్రజలకు అందించాలన్నదే మా ఆకాంక్ష. ఆ దిశగానే మా ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశంలో ఎన్నో పార్టీలున్నాయి. ఎంతోమంది నేతలున్నారు. పలు సంఘాల నేతలను, రైతు నాయకులను కలుస్తున్నాం. ఏ విషయంలో ఎలా ముందుకు పోవాలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయించలేం. ఇది ఒకరిద్దరితో అయ్యేది కాదు. అందరం కలిసి కూర్చున్నప్పుడు దారి దొరుకుతుంది’ అని తెలిపారు.

శిబు సొరేన్‌ మద్దతు మరువలేనిది
తాను 2001లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మొదట మద్దతు ఇచ్చింది శిబు సొరేన్‌ అని కేసీఆర్‌ గుర్తుచేశారు. తాము నిర్వహించిన తొలి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా వచ్చారని తెలిపారు. అప్పటి నుంచి తెలంగాణ ఏర్పాటయ్యేదాకా తెలంగాణ ప్రజల వెన్నంటే ఉన్నారని, తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారని చెప్పారు. అందుకు శిబు సొరేన్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. శిబు సొరేన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకొన్నామని, వారిని కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు.

అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచాం
గల్వాన్‌ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది మన సైనికులతో పాటు వారికి నాయకత్వం వహించిన తెలంగాణ వాసి కర్నల్‌ సంతోష్‌బాబు కూడా వీర మరణం పొందితే, సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. ఆయనతోపాటు ప్రాణాలు కోల్పోయిన ఇతర రాష్ట్రాల సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని అప్పుడే ప్రకటించామని తెలిపారు. జార్ఖండ్‌, పంజాబ్‌ సహా ఆరేడు రాష్ర్టాలకు చెందిన సైనికులు ఆ ఘటనలో మరణించారని, జార్ఖండ్‌ సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసే విషయాన్ని సీఎం హేమంత్‌ సొరేన్‌ వద్ద ప్రస్తావిస్తే ఆయన సమ్మతించి రాష్ట్రానికి ఆహ్వానించారని చెప్పారు. జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర సైనికుల కుటుంబాలకు తాము చేయగలిగిన సహాయం చేశామని, దేశం కోసం అసువులుబాసిన సైనిక కుటుంబాలకు సహాయం చేయడం తమ బాధ్యతగా భావించామని పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.