Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కాంగ్రెస్‌, బీజేపీకి ఓటేస్తే మోరీల వేసినట్టే

ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో మంచినీళ్లు, సాగునీళ్లకు ఎంతో గోసపడ్డామని గుర్తుచేశారు. చేనేత కార్మికులు, రైతుల ఆకలి చావులు, వలసలతో తల్లడిపోయామని తెలిపారు. ‘రైతుబంధు దుబారా అని, 24 గంటల కరెంటు వృథా అని కాంగ్రెస్‌ అంటున్నది. రైతుల భూముల రక్షణకు, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చిన ధరణిని కూడా తీసేస్తామంటున్నది. అదే జరిగితే మళ్లీ దళారులు, పైరవీకారుల రాజ్యమొస్తది. భూములు గోల్‌మాల్‌ అవుతాయి. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కాలేజీని, నవోదయ పాఠశాలను కూడా ఇవ్వలేదు. ఆ పార్టీకి ఓటెందుకు వేయాలి? కాంగ్రెస్‌, బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే. పదేండ్లు కష్టపడి అనేక రంగాలను అభివృద్ధి చేస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నాం. బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. ఎవడు యుద్ధం చేస్తే వాడికే కత్తి ఇవ్వాలి. బీఆర్‌ఎస్‌నే మరోసారి గెలిపించాలి’ అని కోరారు.

విదేశాలకు కూడా సింగరేణి విస్తరణ..
తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణిని కాపాడుకొంటామని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు. విదేశాలకు కూడా సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సింగరేణి కార్మికులకు 15 వేల డిపెండెంట్‌ ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కట్టమంటే కేంద్రం పట్టించుకోవటంలేదని విమర్శించారు. సింగరేణిలో ఎంతో గొప్ప నైపుణ్యం ఉన్న కార్మికులున్నారని, బయ్యారంలో ఇనుప ఖనిజాన్ని వెలికితీసే బాధ్యత వారికే అప్పగిస్తామని చెప్పినా కేంద్రం స్పందించలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిని ధ్వంసం చేసిందని ఆరోపించారు. సింగరేణిని, తెలంగాణను ముంచిందే కాంగ్రెస్‌ పార్టీ అని నిప్పులు చెరిగారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. రాబోయే రోజుల్లో గిరిజనేతరులకు పోడు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల, రామగుండం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఓటును సద్వినియోగం చేసుకుంటేనే ఐదేండ్లు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. అభ్యర్థుల గుణగణాలతోపాటు, వారి వెనుక ఉన్న పార్టీల చరిత్రను, ప్రజలపట్ల వారి దృక్పథాన్ని చూడాలని కోరారు. కాంగ్రెస్‌ గెలిచేది లేదు.. సచ్చేది లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు తాను 80 నియోజకవర్గాల్లో తిరిగానని, ఎక్కడా ఏం గాలి లేదని, అంతా తుస్సుమన్నదని తెలిపారు.

సింగరేణికి బయ్యారం ఉక్కు మైనింగ్‌
తెలంగాణ ఆస్తి అయిన సింగరేణిని సరిగా నిర్వహించటం చేతకాక కాంగ్రెస్‌ దద్దమ్మలు సగం కంపెనీని కేంద్రానికి ఇచ్చేశారని సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌, సీపీఐ యూనియన్‌ నేతలు కూడబలుక్కొని సింగరేణి డిపెండెంట్‌ ఉద్యోగాలను ఊడగొట్టారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాతనే వాటిని పునరుద్ధరించామని, 15 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. రైటర్‌ అయినవాళ్లు ఉద్యోగం తీసుకోకుంటే రూ.25 లక్షలు ఇస్తున్నామని, సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకుంటే వడ్డీ లేకుండా రూ.10 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మాఫీ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఎప్పుడో కేంద్రానికి పంపించామని, ఇప్పటికీ బీజేపీ సర్కారు స్పందించలేదని ధ్వజమెత్తారు. అదీగాక సింగరేణిని బంద్‌ చేసి ఆస్ట్రేలియా నుంచి అదానీ తీసుకొచ్చే బొగ్గును కొనుగోలు చేయాలని మోదీ సర్కారు ఒత్తిడి చేస్తున్నదని మండిపడ్డారు. సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా గతంలో 18 శాతం మాత్రమే ఉంటే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 32 శాతం వాటా ఇస్తున్నదని, దీపావళి బోనస్‌గా రూ.వెయ్యికోట్లు పంపిణీ చేశామని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడేనాటికి నష్టాల్లో ఉన్న సింగరేణిని నేడు రూ.2,200 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చామని వివరించారు. ‘రాష్ట్రంలోని ఇతర గనుల్లో కూడా సింగరేణివాళ్లు ఎందుకు పనిచేయకూడదు? ఆ పనులను కూడా అప్పగించేందుకు ఆలోచన చేస్తున్నం. అంతేకాదు ఆస్ట్రేలియా, ఇండోనేషియాకు సీఎండీని పంపించా. గనులను పట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నాం. సింగరేణి తెలంగాణ కొంగుబంగారం. అన్నం పెట్టే తల్లి. సింగరేణిని ఇంకా విస్తరించుకుంటం తప్ప రాజీపడం. ఇంకా ముందుకు తీసుకుపోతాం’ అని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

మమ్మల్ని గెలిపిస్తే బీఆర్‌ఎస్‌లోనే చేరుతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొత్త ైస్టెల్‌ ప్రచారం మొదలు పెట్టారు. అదంతా ఝూటా ముచ్చటే. లంగతనం చేసి గెలవాలనే బద్మాష్‌తనం తప్ప వాస్తవం కాదు.

గిరిజనేతరులకూ పోడుపట్టాలు
ములుగు నియోజకవర్గంలో గిరిజనులకు 48,161 ఎకరాల పోడు భూములు పంపిణీ చేశామని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. గిరిజనులపై పోడు భూముల విషయంలో నమోదైన కేసులను కూడా ఎత్తివేశామని చెప్పారు. పంపిణీ చేసిన భూములకు రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని బోరుబావులకు త్రీఫేజ్‌ కరెంటు లేనిచోట కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందని వెల్లడించారు. ‘కొంత మంది గిరిజనులు కానివారి చేతిలో కొన్ని పోడు భూములున్నాయి. వారు సమస్య పరిష్కరించాలని అడుగుతున్నారు. ఇది కేంద్రం చేతిలో ఉన్నది. గిరిజనులు కానివారికి పోడు భూములకు పట్టాలిస్తామని నేను మాట ఇస్తున్నా’ అని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

సమ్మక్క సారక్క తల్లి ఉండే నేలకు వందనం
‘సమ్మక్క సారక్క తల్లి ఉండే ఈ నేలకు వందనం. అనేకసార్లు సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన. అమ్మా సమ్మక్క తల్లి.. సారక్క తల్లి.. మా తెలంగాణ మాకు వచ్చేటట్టు చెయ్యి అని ఎన్నోసార్లు మొక్కుకున్నా. తల్లికి బంగారాన్ని సమర్పించిన. గతంలో మన జాతరకు ఆదరణ లేకుండె. జాతరకొచ్చే రోడ్లు బాగా లేకుండె. ఒకసారి నేను వస్తే ట్రాఫిక్‌జాంలో రాత్రంతా ఇరుక్కున్నా. ఇప్పుడు ఏటా రూ.80 -100 కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్రస్థాయి పండుగగా గుర్తించి బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాం. ఇంకా జాతరను అభివృద్ధి చేయాల్సిన అవసరమున్నది. ఈ దిశలో ప్రయత్నం చేద్దాం’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం పెట్టాలన్న ఆలోచనకు ములుగులోనే పుట్టిందని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు.

సీతక్క రాదు.. ఏం అడగదు
ములుగు ఎమ్మెల్యే సీతక్కపై సీఎం కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు. ‘ఇకడ కొన్ని పనులు కావాల్సి ఉన్నది. ఎమ్మెల్యేగా నువ్వు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు గాక.. తప్పకుండా ముఖ్యమంత్రిని కలవాలి. గవర్నమెంట్‌లో ఉన్నవాళ్లను కలవాలి. మాట్లాడాలి. మీ ఎమ్మెల్యే ఎన్నడూ రాదు. ఏం అడగదు. మాకు తోచినవి, తెలిసినవి.. మా పార్టీవాళ్లు చెప్పిన పనులు చేసుడే తప్ప ఆమె వచ్చి ఎన్నడూ అడుగదు. ఏం చేసిర్రు మీరు అంటే.. ఏం చేయలేదు ? మీ కాంగ్రెస్‌ పాలనలో మంచినీళ్లు ఇచ్చారా? మీ కాంగ్రెస్‌ పాలనలో కరెంటు ఇచ్చారా? మీరు రైతుబంధు ఇచ్చారా? మరి ఇవాళ ఇవన్నీ మేం ఇచ్చాం కదా? మీ కాంగ్రెస్‌ కాలంలో పోడు భూములు పంచారా? ఇవాళ మేం పంచినం కదా? మరి ఏం చేశారంటే? ఈ వాదులాటలు కాదు. జరగాల్సింది ప్రజల క్షేమం’ అని పేర్కొన్నారు.

వెంకటరమణారెడ్డిని గెలిపించండి
భూపాలపల్లిలోని కొత్త మండలాలను అభివృద్ధి చేస్తామని, ఇంజినీరింగ్‌ కాలేజీని వందశాతం ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. గతంలో మధుసూదనాచారి ఎమ్మెల్యేలా ఉన్నప్పుడు రెండుమూడుసార్లు ఇక్కడికి వచ్చానని, భూపాలపల్లిని జిల్లా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గండ్ర వెంటకరమణారెడ్డి ఎప్పుడొచ్చినా భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం గురించే అడుగుతారని, వ్యక్తిగత పనులను ఏరోజూ అడగలేదని పేర్కొన్నారు. భూపాలపల్లికి మరింత మేలు జరగాలంటే అనుభవమున్న వెంకటరమణారెడ్డి గెలవాలని తెలిపారు. లేదంటే భూపాలపల్లి కిందమీద అయితదని, ఆగమాగమయ్యే ఆస్కారముంటదని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ గెలిచేది లేదు.. సచ్చేది లేదు. ఇప్పటి వరకు 80 నియోజకవర్గాల్లో తిరిగిన. ఎక్కడా ఏ గాలీ లేదు. అంతా తుస్సుమన్నది.

దివాకర్‌రావును దీవించండి
మంచిర్యాలకు గూడెం లిఫ్ట్‌ ద్వారా నీళ్లు అందిస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దివాకర్‌రావు చాలా సౌమ్యుడని, హరాకిరి పనులు చేసేవాడు కాదని అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే వాడకట్టుకో పేకాట క్లబ్‌ వస్తుందని ఎద్దేవా చేశారు. తమను గెలిపిస్తే బీఆర్‌ఎస్‌లోనే చేరుతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొత్త ైస్టెల్‌ ప్రచారం మొదలు పెట్టారని, అదంతా జూటా ముచ్చటేనని, లంగతనం చేసి గెలవాలనే బద్మాష్‌తనం తప్ప వాస్తవం కాదని సీఎం స్పష్టంచేశారు. దివాకర్‌రావును గెలిపిస్తేనే లాభం జరుగుతుందని వెల్లడించారు. దివాకర్‌రావుకు మద్దతుగా నిలుస్తున్న అరవింద్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నాగజ్యోతి ములుగుకే జ్యోతి
ములుగు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి చరిత్ర అందరికీ తెలుసని సీఎం అన్నారు. ‘దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాలకు పోయి అమరుడైండు. ప్రజల కోసం తన ప్రాణాలు ఇచ్చిండు. ఆయన స్వార్థం కోసం అమరుడు కాలేదు. ప్రజల పక్షాన కొట్లాడేందుకు వెళ్లి బలయ్యారు. అలాంటి వ్యక్తి బిడ్డ నాగజ్యోతి. నాకు తల్లిలేదు తండ్రి లేదు.. ములుగు ప్రజలు నా తల్లిదండ్రులని చెప్పింది. నేను మీ అందరినీ కోరుతున్నా.. ఆమె కష్టపడి చదువుకున్నది. ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగింది. సర్పంచ్‌గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హోదాకు వచ్చింది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడగొట్టినా మాట తప్పకుండ ఇచ్చిన హామీ మేరకు ములుగు జిల్లాను ఏర్పాటు చేశాం. మీ దగ్గరికి ఇవాళ ఆఫీసులు వచ్చాయి. మెడికల్‌ కాలేజీ వచ్చింది. 400 పడకల దవాఖాన వస్తుంది. దాంతోపాటే నర్సింగ్‌ కాలేజీ వస్తది. పారామెడికల్‌ కాలేజీ కోర్సులు వస్తయ్‌. ఏటూరునాగారంలో డయాలసిస్‌ కేంద్రం పెట్టించాం. బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుంది’ అని సీఎం అన్నారు.

రైతుబంధు దుబారా.. 24 గంటల కరెంటు వృథా అని కాంగ్రెస్‌ అంటున్నది. ధరణిని కూడా తీసేస్తామంటున్నది. అదే జరిగితే మళ్లీ దళారులు, పైరవీకారుల రాజ్యమొస్తది. భూములు గోల్‌మాల్‌ అవుతాయి.

ఉద్యమకారుడు చందర్‌ గెలిస్తేనే లాభం..
గుర్జికమ్మికి చెందిన వెయ్యి ఎకరాల భూములకు కాస్తుదారులకే పట్టాలు ఇప్పించామని సీఎం కేసీఆర్‌ వివరించారు. బీఆర్‌ఎస్‌ రామగుండం అభ్యర్థి కోరుకంటి చందర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ఉద్యమకారుడని, 74రోజులు జైళ్లో ఉన్నాడని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి గెలిస్తే ప్రజలకు లాభం జరుగుతుందని తెలిపారు. చందర్‌ కూడా సింగరేణి కార్మికుడి కొడుకేనని, ఆయనకు సింగరేణి గురించి మంచి అవగాహన ఉన్నదని, మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రామగుండం అభివృద్ధి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. రామగుండం ఏరియాలో బొగ్గు, నీళ్లు, రవాణా వసతులు ఉన్నా పరిశ్రమలే లేవని, రాబోయే రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని, మంచి పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.