-ఏప్రిల్ 20న పంట పెట్టుబడికి శ్రీకారం..
-వానాకాలం పంటకు సాయంతో నాంది
-నవంబర్ 18 నుంచి యాసంగి సాయం పంపిణీ
-రెండు విడుతలుగా ఆర్థిక సాయం
-వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ డ్రాప్ట్‌ను రూపొందించాలి
-సబ్సిడీపై వరినాట్ల యంత్రాలను అందించేందుకు చర్యలు
-రైతు పెట్టుబడి పథకం, వ్యవసాయ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. అధికారులకు ఆదేశాలు
-25న హైదరాబాద్‌లో, 26న కరీంనగర్‌లో మండల రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సమావేశాలు.. హాజరుకానున్న సీఎం
-42 మందితో రాష్ట్ర రైతు సమన్వయ సమితి
దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తదేకదీక్షతో ముందుకు సాగుతున్నారు. రైతన్నకు అండదండలను అందించే వ్యవసాయ పెట్టుబడి పథకానికి ఏప్రిల్ 20న వానకాలం పంటకు సాయంతో శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. యాసంగి సాయం పంపిణీ నవంబర్ 18 నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పంట పెట్టుబడి సాయం మొత్తం చెక్కుల రూపంలో రైతన్నలకు అందించాలని స్పష్టం చేశారు. వ్యవసాయానికే పెద్దపీట వేయాలన్న సర్కారు నిశ్చయానికి అనుగుణంగా ప్రత్యేక బడ్జెట్ ముసాయిదాను తీర్చిదిద్దాలని తీర్మానించారు. వ్యవసాయ యాంత్రీకరణలో ముందంజ వేస్తూ సబ్సిడీపై వరినాట్ల యంత్రాలను పంపిణీ చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ రంగ విధివిధానాల్లో రైతు సమితుల పాత్రపై వెలుగును ప్రసరించేందుకు ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సులకు స్వయంగా హాజరై రైతుల మనసులోని మాటను వింటానని హామీ ఇచ్చారు. 42 మంది సభ్యులతో త్వరలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రగతిభవన్‌లో ఆదివారం వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
పంట పెట్టుబడి మద్దతు పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయాన్ని చెక్కులరూపంలో ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. వానకాలం పంట వేసుకోవడానికి ఎకరానికి రూ.4000 చొప్పున అందించే కార్యక్రమాన్ని ఏప్రిల్ 20న ప్రారంభించాలని ఆదేశించారు. యాసంగి పంట కోసం ఇచ్చే పెట్టుబడి పంపిణీ కార్యక్రమాన్ని నవంబర్ 18నుంచి నిర్వహించాలని చెప్పారు. దీనికి సంబంధించిన నిధులను బడ్జెట్‌లోనే కేటాయించనున్నట్టు సీఎం ప్రకటించారు. భవిష్యత్‌లో రైతులు కూలీల కొరతను ఎదుర్కొంటారని, దీనిని దృష్టిలో ఉంచు కుని వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. వరినాట్లు వేసే యంత్రాలను సబ్సిడీపై అందించాలని సీఎం నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. దేశంలో మరేరాష్ట్రంలో అమలు చేయనన్ని కార్యక్రమాలు వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం చేపట్టిందని కేసీఆర్ చెప్పారు. ఈ ఏడాది నుంచి మరిన్ని కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నందున.. ఎక్కడా నిధుల సమస్య రాకుండా ఉండేందుకు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు వివరించారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనుగుణంగా ముసాయిదా తయారుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
రైతు సదస్సుల తేదీలు ఖరారు ఈ నెల 25, 26 తేదీల్లో మండల రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రైతులకు చేరవేసే విషయంలో రైతు సమన్వయ సమితులు నిర్వహించాల్సిన పాత్రను సదస్సుల్లో సభ్యులకు వివరించనున్నట్టు వెల్లడించారు. 25న హైదరాబాద్‌లోని వ్యవసాయవర్సిటీలో, 26న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. పంట పెట్టుబడి మద్దతు పథకానికి సంబంధించిన ఆర్థికసాయాన్ని చెక్కులరూపంలో రెండు విడుతలుగా అందించనున్నట్టు చెప్పారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ, వ్యవసాయరంగ అభివృద్ధి కోసం కృషిచేస్తున్న నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితిని త్వరలోనే నియమిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
రైతులతో సీఎం కేసీఆర్ ముచ్చట ఈనెల 25న హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే ప్రాంతీయ సదస్సుకు జనగామ, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగుళాంబ-గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి-షాద్‌నగర్ జిల్లాలకు చెందిన మండల రైతు సమన్వయ సమితి సభ్యులను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదేవిధంగా ఈనెల 26న కరీంనగర్‌లో జరిగే ప్రాంతీయ సదస్సుకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీమ్-ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాలకు చెందిన సభ్యులను ఆహ్వానించాలని చెప్పారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సదస్సులో ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖమంత్రి సందేశాలతోపాటు రైతులతో ముఖ్యమంత్రి నేరుగా సంభాషించే కార్యక్రమాలుంటాయి.
రైతు సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, ఈ కార్యక్రమాల్లో రైతు సమన్వయసమితుల సభ్యులు ఎలాంటి పాత్ర పోషించాలనే విషయమై సదస్సుల్లో కూలంకషంగా చర్చిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌శాఖల అధికారులు కూడా ఈ సదస్సుల్లో పాల్గొంటారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సదస్సులకు హాజరయ్యే మండల రైతు సమన్వయ సమితుల సభ్యుల ప్రయాణ, భోజన సదుపాయాలన్నీ వ్యవసాయశాఖ సమకూర్చాలని సీఎం చెప్పారు. రైతులను సంఘటితం చేయ డం, రైతు వేదికల నిర్మాణం-నిర్వహణ, రైతులకు నిరంతర శిక్షణ, పంట పెట్టుబడి మద్దతు పథకం, పంటలకు కనీస మద్దతుధర అందేలా చూడడం, మార్కెట్లకు ఉత్పత్తులు తీసుకువచ్చే విషయంలో నియంత్రణలు పాటించడం, మేలైన సాగుపద్ధతులు, శాస్త్రీయ వ్యవసాయ విధానం, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, కోల్డ్‌స్టోరేజ్ చైన్, క్రాప్‌కాలనీలు తదితర అంశాల్లో రైతు సమన్వయ సమితులు నిర్వహించాల్సిన పాత్రపై కరదీపిక అందించడంతో పాటు, సదస్సుల్లో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.
త్వరలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి 42 మంది సభ్యులతో త్వరలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. 30 జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతోపాటు వ్యవసాయ శాఖాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులను కూడా కమిటీలో సభ్యులుగా నియమించనున్నట్టు సీఎం చెప్పారు. వ్యవసాయ రంగాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నవారిని సభ్యులుగా నియమించాలని, దీనికోసం పేర్లు సూచించాలని సీఎం అధికారులను కోరారు. ఈ సమీక్షలో ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ , ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి, ఎంపీలు గు త్తా సుఖేందర్ రెడ్డి, బాల్క సుమన్, మండలిలో ప్రభుత్వవిప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు ఎస్ నర్సింగరావు, రామకృష్ణారావు, పార్థసారథి, వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ ఎం జగన్మోహన్, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

