ప్రధాని నరేంద్రమోదీకి ప్రైవేటీకరణ పిచ్చిలేసింది. కరెంటు ప్రైవేటీకరణ పేరుతో ప్రతి మోటర్ దగ్గర మీటరు పెట్టి ముక్కుపిండి బిల్లులు వసూలు చేయాలని ఒత్తిడి చేసిండు. మీటర్లు పెట్టాలి.. లేకుంటే మీ పైసలు కట్ చేస్తమని బెదిరిచ్చిండు. అయినాసరే నా తల తెగిపడినా మీటర్లు పెట్టనని స్పష్టంగా చెప్పిన. దీంతో రాష్ట్రానికి ఏటా ఐదువేల కోట్ల చొప్పున ఐదేండ్లలో 25వేల కోట్లు కట్ చేసిండ్రు. అయినా మోటర్లకు మీటర్లు పెట్టలె.
-సీఎం కేసీఆర్
చలే తో సాత్ లేకే చలో.. హయాత్ లేకే చలో.. హయానాత్ లేకే చలో.. సారే జమానాకో సాత్‌లేకే చలో అనేది బీఆర్‌ఎస్ విధానం.
బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ హక్కుల రక్షణకోసమని, పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి, అన్ని వర్గాలను కలుపుకుంటూ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్‌ఎస్ పార్టీతోనే రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధి సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రాబందులు తప్ప రైతుబంధులు లేవని, 50 ఏండ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన ఆ పార్టీ ఎక్కడైనా రైతుబంధు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. పొరపాటున ఆ పార్టీ గెలిస్తే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టే అవుతుందని హెచ్చరించారు. కరెంటు, నీళ్లు ఏవీ ఉండవని, పైరవీకార్ల రాజ్యమొస్తుందని అన్నారు., పార్టీల చరిత్రను చూసి, ఆలోచించి, చర్చించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. నిర్మల్, బాల్కొండ, ధర్మపురి నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను విశదీకరించారు. బీఆర్‌ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. మరోసారి బీఆర్‌ఎస్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్య పరిణతి చూపించాలి 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్య పరిణతి ఇప్పటికీ రావాల్సిన స్థాయిలో రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్య పరిణతి సాధించిన దేశాలే అన్ని రంగాల్లో మనకన్నా ముందున్నాయని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు, వారి వెనక ఉన్న పార్టీల చరిత్రను కూడా తెలుసుకోవాలని, ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే లాభం జరుగుతుందో పట్టణాలు, గ్రామాల్లో చర్చించాలని సూచించారు. ఎన్నికలు రాగానే ఆగమాగమై పార్టీల చరిత్రను మరువొద్దని హితవు పలికారు. పరిణతి చెందిన దేశాల్లో భారీ సభలు కాకుండా టీవీల్లోనే ప్రజలు చర్చలు వింటారని, మన దగ్గర ఇంకా ఉల్టా నడుస్తున్నదని అన్నారు. ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు. అది వచ్చే ఐదేండ్ల తలరాతను రాస్తుంది. భవిష్యత్తును కిందమీద చేస్తుంది. కిస్మత్‌ను బదలాయిస్తది. అందుకే ఓటును సరిగా వినియోగించుకోవాలి. ఓటును అలవోకగా వేయకుండా చర్చించుకోవాలి. అప్పుడే నాయకులు కాకుండా ప్రజలు గెలుస్తారు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం. అటువంటి పరిణతి రావాలి’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
‘ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు. అది వచ్చే ఐదేండ్ల తలరాతను రాస్తుంది. భవిష్యత్తును కిందమీద చేస్తుంది.
తెలంగాణ హక్కుల కోసమే బీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర అంతా ప్రజలకు తెలుసుని సీఎం అన్నారు. పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, వారి హక్కులను కాపాడేందు కోసం, నీళ్లు, నిధులు, నియామకాలను కాపాడటం కోసమని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం రాకుండా చూసే కాపాలదారే బీఆర్‌ఎస్ పార్టీ అని అభివర్ణించారు. రాష్ట్రం ఏర్పడిననాడు తలసరి ఆదాయంలో 15, 16 స్థానాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం, నేడు వ్యవసాయం, పారిశ్రామికరంగం, ఐటీ ఎగుమతుల వృద్ధితో దేశంలోనే నంబర్-1 స్థానానికి చేరుకున్నదని చెప్పారు. తలసరి విద్యుత్తు వినియోగంలో కూడా తెలంగాణ రాష్ట్రమే నంబర్-1 అని పేర్కొన్నారు. ‘పక్కనే ఉన్న మహారాష్ట్రలో పానీపట్టీ పేరుతో నీటి తీరువా వసూలు చేస్తారు. ఇక్కడ మాత్రం నీటి తీరువా లేదు. నీళ్లు, కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. సాగుకు పెట్టుబడి ఇస్తున్నాం. రైతుల ధాన్యం కొంటున్నాం. ధాన్యం డబ్బులు పది రోజుల్లోనే నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో వేస్తున్నాం. మధ్యవర్తులు, బ్రోకర్లు ఎవరూ లేరు. రైతు చనిపోతే అతడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఇస్తున్నాం. రైతుబంధు పథకాన్ని ఎవరూ కోరలేదు. అయినా అమల్లోకి తెచ్చాం. రెండు సార్లు రైతుల రుణమాఫీ చేశాం. ఫలితంగా రైతుల మొఖాలు తెల్లగవుతున్నాయి. రైతుల భూములకు భద్రత కల్పించేందుకు ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చాం’ అని వివరించారు.
అందరి ముఖాల్లో నవ్వులు చూడాలి గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చాలని గిరిజనులు ఎన్నో ఏండ్లు పోరాడినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు 4 వేల తండాలను, గూడేలను పంచాయతీలుగా చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో గిరిజనులు స్వయంపాలన సాగిస్తున్నారని చెప్పారు. 4 లక్షల ఎకరాల భూమికి పోడు పట్టాలు పంపిణీ చేయడంతోపాటు త్రీఫేజ్ కరెంటు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణను లౌకిక రాష్ట్రంగా నిలుపుతున్నామని, కులం, మతం లేకుండా అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు పోతున్నామని వివరించారు. ‘చలేతో సాత్ లేకే చలో.. హయాత్ లేకే చలో.. కాయెనాత్ లేకే చలో.. సారే జమానాకో సాత్‌లేకే చలో’ అనేది బీఆర్‌ఎస్ విధానమని పేర్కొన్నారు. అందరి ముఖాల్లో నవ్వులు చూడాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ముస్లింల సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నామని, మైనార్టీ విద్యార్థుల కోసం 204 గురుకులాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. తాను బతికున్నంత వరకు తెలంగాణ లౌకిక రాష్ట్రంగానే ఉంటుందని భరోసా ఇచ్చారు.
దళితులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు కాంగ్రెస్ ఏం చేసిందో యావత్ తెలంగాణ దళిత సమాజాం ఆలోచించాలని సీఎం కేసీఆర్ కోరారు. తరతరాలుగా అణచివేతకు గురై, అంటరానితనం పేరిట వివక్షతకు గురైన దళిత సమాజం కోసం 75 ఏండ్ల క్రితం నెహ్రూ కాలంలోనే దళితబంధును మొదలు పెడితే ఈ రోజు వారి పరిస్థితి ఈ విధంగా ఉండేదా? అని ప్రశ్నించారు. ‘ఎంతసేపూ మిమ్మల్ని ఓటు బ్యాంకు కిందనే వాడుకున్నరు. ఈ అమ్మ బొమ్మ.. ఆ అమ్మ బొమ్మ అని మాట్లాడి లేట్ చేశారు తప్ప మీకేం చేయలే. అందుకే దేశంలోనే మొట్టమొదటిసారి దళితబంధు అనే స్కీమ్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పుట్టించింది. దఫదపాఫాలుగా దళిత సమాజాన్ని ఉద్దరించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని గమనించాలని సీఎం కేసీఆర్ కోరారు.
గతంలో ఎంతసేపూ మిమ్మల్ని ఓటు బ్యాంకుకింద వాడుకున్నరు. ఈ అమ్మ బొమ్మ.. ఆ అమ్మ బొమ్మ అని మాట్లాడి లేట్ చేశారు తప్ప మీకేం చేయలే. అందుకే దేశంలో మొట్టమొదటిసారి దళితబంధు అనే పథకాన్ని బీఆర్‌ఎస్ పార్టీ పుట్టించింది.
– సీఎం కేసీఆర్
ధర్మపురికి పూర్తిస్థాయిలో దళితబంధు ధర్మపురి ఎమ్మెల్యేగా అక్కడి ప్రజలు కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించుకుంటే.. నియోజకవర్గం మొత్తానికి పూర్తిస్థాయిలో ఒకేసారి దళితబంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయమని, 70 వేల మెజార్టీతో గెలుస్తాడని తెలిపారు. దళితుల తలరాతలను మార్చేందుకు తానే స్వయంగా ఆలోచించి దళితబంధును ప్రవేశపెట్టినట్టు చెప్పారు. సమాజంలోని ప్రతీవర్గాన్ని పైకి తీసుకురావాలనే సదుద్దేశంతో అన్ని పథకాల ఆర్థిక పరిమితులు పెంచుకుంటున్నామని వివరించారు. నిత్య శ్రామికుడిలా పనిచేసే ఈశ్వర్ గెలిస్తే ధర్మపురి మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
25 వేల కోట్ల నష్టం వచ్చినా మోటర్లకు మీటర్లు పెట్టలె.. 60-65 ఏండ్ల కింద ఏర్పడిన పెద్దపెద్ద రాష్ర్టాలు కూడా నేడు ప్రజలకు 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నాయని, ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంటు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందని, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు ప్రైవేటు, చివరికి కరెంటు కూడా ప్రైవేటుపరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరెంటు ప్రైవేటీకరణ పేరుతో ప్రతి మోటర్ దగ్గర మీటరు పెట్టి ముక్కుపిండి బిల్లులు వసూలు చేయాలని ఒత్తిడి పెట్టినా వెనక్కు తగ్గలేదని తెలిపారు. తల తెగిపడినా మీటర్లు పెట్టబోనని స్పష్టం చేసినట్టు చెప్పారు. దీంతో రాష్ట్రానికి ఏటా ఐదువేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.25 వేల కోట్లు కట్‌చేశారని వివరించారు.
కాంగ్రెస్ పాలనలో రాబందులే, రైతుబంధు లేదు కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. ‘ఇవాళ కాంగ్రెస్ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నరు. ఆ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏకబిగిన 50 ఏండ్లు పాలించింది. వాళ్లు ఏమి చేశారో మనం చూడలేదా? ఒక్క చాన్స్ ఇవ్వాలని ఇప్పుడు కోరుతున్నరు. ఇప్పటికే 11 చాన్స్‌లు ఇచ్చినం. ఇంకో చాన్స్ ఇస్తే ఏం చేస్తారు? పంటికంటకుండ మింగుతరా?’ అని ప్రశ్నించారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదని, చాలా శాంతియుతంగా పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇలాంటి పార్టీపై, నాయకులపై కాంగ్రెస్ నేతలు కత్తులతో దాడులు చేస్తున్నారని, దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిపై అలాగే దాడి చేశారని, భగవంతుడి దయవల్ల ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ‘రైతులకు కేసీఆర్ భిక్షం వేస్తున్నాడని పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. రైతులు భిక్షగాళ్లలా కనబడుతున్నారా? రైతు పండించే పంట ఎంత? అందులో తినేదెంత? మిగిలిందంతా దేశానికే కదా ఇచ్చేది. ప్రజలకే కదా. ఈ విధంగా తిరస్కరించి మాట్లాడుతరా?’ అని నిప్పులు చెరిగారు. తలకుమాసిన సన్నాసి రాసిచ్చే స్క్రిప్టు చదివే రాహుల్‌గాంధీ సైతం ధరణిని తీసి బంగాళాఖాతంలో కలుపుతామని అంటున్నారని, ఆయనకు ఎద్దు ఎరుకనా? ఎవుసం ఎరుకనా? అని మండిపడ్డారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ పైరవీకారులు పుట్టుకొస్తారని హెచ్చరించారు.
ఎవడో తలకుమాసిన సన్నాసి రాసిచ్చే స్క్రిప్టు చదువుతూ.. రాహుల్‌గాంధీ సైతం ధరణిని తీసి బంగాళాఖాతంలో కలుపుతామని అంటున్నాడు. ఆయనకు ఎద్దు ఎరుకా? ఎవుసం ఎరుకా? మన రైతులు ఎన్ని బాధలు పడ్డారు. ధరణితో ఆ బాధలన్నీ తీరినయ్.
– సీఎం కేసీఆర్
ఇంద్రకరణ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి నిర్మల్ జిల్లాను చేసింది నేనే అయినా, ఎక్కువ తపన పడింది మాత్రం ఇంద్రకరణ్ రెడ్డి అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో మొదట ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలను చేద్దామని నిర్ణయించామని, అయితే ఇంద్రకరణ్‌రెడ్డి పట్టుబట్టి నిర్మల్‌తోపాటు ఆసిఫాబాద్, మంచిర్యాలను కలుపుకొని ఆదిలాబాద్‌సహా నాలుగు జిల్లాలను చేయించారని వివరించారు. ఇప్పుడు జిల్లాకు ఒకటి చొప్పున నాలుగు మెడికల్‌కాలుజీలు వచ్చాయని, త్వరలోనే ఇంద్రకరణ్‌రెడ్డి కోరిక మేరకు జేఎన్టీయూ నుంచి ఇంజినీరింగ్ కాలేజీని కూడా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇంద్రకరణ్‌రెడ్డిని 80 వేల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘బాల్కొండకు ఎప్పుడొచ్చినా ఇక్కడి మోతె గ్రామం గుర్తుకొస్తుంది. అక్కడి మట్టిలో అంత బలం ఉన్నది. తెలంగాణ కావాలని తీర్మానం చేసిన మొదటి గ్రామం మోతె. మోతె గ్రామంలోని మట్టిని ముడుపుగట్టి హైదరాబాద్ తీసుకుపోయాను. తెలంగాణ వచ్చాక ఆ మట్టిని తెచ్చి మళ్లీ అదే ఊరు మట్టిలో కలిపినాం’ అన్నారు సీఎం కేసీఆర్.
ప్రతి కుటుంబానికీ బీమా.. ప్రభుత్వం అన్ని వర్గాలను కాపాడుకుంటున్నదని, రాబోయే రోజుల్లోనూ అదే పద్ధతిని కొనసాగిస్తుందని సీఎం కేసీఆర్ వివరించారు. వచ్చే మార్చి తరువాత రాష్ట్రంలోని 93 లక్షల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. ఆసరా పెన్షన్లను దశలవారీగా రూ. 5000 చేస్తామని భరోసా ఇచ్చారు. 17 రాష్ర్టాల్లో బీడీ కార్మికులున్నా, తెలంగాణలో మాత్రమే వారికి పెన్షన్ ఇస్తున్నదని చెప్పారు. బీడీ కార్మికులకు రూ.5 వేల పెన్షన్ రాబోతున్నదని, ఒక్క ఓటు కూడా ఇతర పార్టీలకు పోకుండా చూడాలని విజ్ఞప్తిచేశారు. రైతుబంధును ఐదేళ్లలో రూ.16 వేలు చేస్తామని వివరించారు. రేషన్‌కార్డులందరికీ రైతుబీమా మాదిరిగా రూ.5 లక్షల బీమా చేయిస్తామని, మహిళలకు నెలకు రూ.3 వేల ఆర్థికసాయం చేయనున్నామని భరోసా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం లిమిట్‌ను రూ.15 లక్షలకు పెంచినట్లు, ఇదికూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని భరోసా ఇచ్చారు. ఈ విషయాలపై చర్చించి వాస్తవాలు తేల్చి ధర్మంవైపు, న్యాయం వైపు నడవాలని, అప్పుడే లాభం జరుగుతుందని వివరించారు. ‘యూపీ సీఎం వచ్చి ఇష్టమొచ్చినట్టు మాట్లాడి పోతాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సైతం ఇట్లాగే మాట్లాడుతున్నారు. ఉత్తరప్రదేశ్ వాళ్లు ఇక్కడికి నాట్లు వేయడానికి వస్తున్నారు. వాళ్లు కూడా వచ్చి మనకి నీతులు చెబితే ఏం చేయాలి. కాంగ్రెస్, బీజేపీ గనక వస్తే రైతుబంధుకు రాం రాం, కరెంటు కాట్ల కలుస్తది. మొదలు తెలంగాణ వచ్చేవరకు, ఇప్పుడు వచ్చిన తరువాత పదేండ్లు నేను కొట్లాడిన. ఇప్పుడు కొట్లాడాల్సింది మీరే’ అని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
ప్రశాంత్‌రెడ్డి నా కొడుకులాంటివాడు ప్రశాంత్‌రెడ్డికంటే ముందు బాల్గొండలో అనేకమంది గెలిచారని, వాళ్లు ఏం చేశారో.. ప్రశాంత్‌రెడ్డి హయాంలో ఏం జరిగిందో మీ కళ్లముందే ఉన్నదని కేసీఆర్ అన్నారు. ఇప్పటికే 18 సబ్‌స్టేషన్లు కట్టిండు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు 40-45 తెచ్చిండు, మల్ల 3 కావాలని కోరుతున్నాడు అని తెలిపారు. ప్రశాంత్‌రెడ్డి తనకు కొడుకులాండివాడని, క్యాబినెట్‌లో సైతం మంచి బాధ్యతగల పదవిలో ఉన్నారని, రేపు కూడా అలాగే పెద్దమనిషిగా ఉంటాడని హామీ ఇచ్చారు. ప్రశాంత్‌రెడ్డిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారని, అందులో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఏర్పడిననాడు తలసరి ఆదాయంలో 15, 16 స్థానాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం, నేడు వ్యవసాయం, పారిశ్రామికరంగం, ఐటీ ఎగుమతుల వృద్ధితో దేశంలోనే నంబర్-1 స్థానానికి చేరుకున్నది. తలసరి విద్యుత్తు వినియోగంలో కూడా తెలంగాణ రాష్ట్రమే నంబర్-1.
– సీఎం కేసీఆర్

