మీరు నన్ను దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి, 15 సంవత్సారాల పాటు ప్రజా పోరాటాన్ని నడిపించి, తెలంగాణ డిమాండుకు మద్దతుగా రాష్ట్రం లోని, దేశం లోని పార్టీల మద్దతు కూడగట్టి, స్వరాష్ట్ర సాధన కోసం కేంద్ర మంత్రి పదవినీ, ఎం పీ పదవినీ తృణప్రాయంగా వదిలివేసి, చివరికి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఉద్యమాన్ని విజయ తీరం చేర్చిన నావంటి వాడిని మీరు ఆహ్వానించిన తీరు ఎంతో అవమానకరంగా ఉంది.
తెలంగాణ ప్రజా పోరాటానికి నాయకత్వ స్థానంలో నిలిచిన నాకు, వేదికపై స్థానం గానీ, రాష్ట్ర సాధనలో నాకున్న అనుభవాలు పంచుకోవడానికి ప్రసంగించే అవకాశం కాని కల్పించక పోవడం మీ అహంకార ఆధిపత్య ధోరణికి పరాకాష్ట. నన్ను ఆహ్వానించినట్టే ఆహ్వానించి, అవమాన పరచదలుచుకున్నమీ దురుద్దేశ్యాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. పోరాట వారసత్వాన్ని దెబ్బతీయడానికి మీరు చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉత్సవాలు జరగుతున్న తీరును ఉద్యమకారులు ఇప్పటికే నిరసిస్తున్నారు. రానున్న కష్టాలను తలచుకుని తెలంగాణ తల్లి తల్లడిల్లుతున్నది. ప్రతి క్షణం తెలంగాణ గుండె గాయపడుతున్నది.
ఒకవైపు పంటలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల ఆక్రోశం, పని కోల్పోయినందుకు ప్రాణాలు తీసుకుంటున్న చేనేత కార్మికుల దుఃఖం, ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల ఆవేదన, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ తల్లడిల్లుతున్న నిరుద్యోగుల్లో ఆవరించిన నిస్తేజం, తాగే నీళ్ళకోసం తండ్లాడుతున్న తల్లుల ఆయాసం, కరెంటు కోతలతో మసక బారుతున్న రాష్ట్ర ప్రతిష్ట, కుంటు పడుతున్న పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతి, ఒకటని కాదు, అన్ని రంగాలు అరునెలల్లోనే ఆగమైపోయిన విషాదం. తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజ కరమైన సందర్భమే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బిఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు, తెలంగాణ వాదుల అభిప్రాయంగా వుంది. అందువల్ల… పైన పేర్కొన్న కారణాల రీత్యా, ప్రజాజీవితాన్ని క్రమ క్రమంగా కల్లోలంలోకి నెట్టుతున్న మీ పాలననూ.. మిమ్మల్ని ప్రశ్నించేవాళ్లను అడుగడుగునా అవమానిస్తూ దాడులు చేస్తున్న మీ వైఖరినీ, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలనూ నిరసిస్తూ.. మీరు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో బి ఆర్ ఎస్ పార్టీ పాల్గొనబోవటం లేదని తెలియ జేయటానికి విచారిస్తున్నాను.
ఇక ముందైనా ఇటువంటి వైఖరి మానుకొని నిజమైన ప్రగతి కోసం సంక్షేమం కోసం మీరు ప్రయత్నిస్తారనీ, ఎన్నికల వాగ్దానాలన్నీ త్వరలోనే నెరవేరుస్తారనీ ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను.
జై తెలంగాణ! జై భారత్!!
ఇట్లు
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

