Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

భగీరథ నీళ్లు తథ్యం

-డిసెంబర్‌లో ఇంటింటికీ సురక్షిత మంచినీరు
-మే చివరికి ప్రతి గ్రామానికి బల్క్‌గా సరఫరా
-95 శాతం పూర్తయిన మెయిన్ గ్రిడ్ పనులు
-75% ప్రాజెక్టు పనులు పూర్తి
-దసరానాటికి అంతర్గత పనులు పూర్తికావాలి
-సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసిఆర్
లక్ష్యం డిసెంబర్.. ఈ ఏడాది చివరితేదీ నాటికి మిషన్ భగీరథ పూర్తిచేసి.. రాష్ట్రంలోని అన్ని ఇండ్లకూ నల్లాల ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. మే చివరి నాటికి ప్రతి గ్రామానికి బల్క్‌గా నీటి సరఫరా చేయాలని.. ఈ సరఫరాలో వచ్చే ఇబ్బందులను జూన్ 10 నాటికి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 95 శాతం మెయిన్ గ్రిడ్ పనులు పూర్తయ్యాయని.. మొత్తంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చేపట్టి నల్లాలు బిగించే పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడుగబోమని తమకు తాముగా స్వీకరించిన సవాల్‌కు కట్టుబడి మిషన్ భగీరథ పనులను అనుకొన్న విధంగా పూర్తిచేస్తున్నామని ప్రకటించారు. మిషన్ భగీరథ పనులపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా, సెగ్మెంట్లవారీగా పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలున్న జిల్లాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలుచేయాలని ఆదేశించారు.
 
మే చివరికి ప్రతి గ్రామానికి బల్క్‌లో నీటి సరఫరా
మిషన్ భగీరథలో ప్రధానమైన పనులు పూర్తయ్యాయి. ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పైపులైన్లు, పంపుసెట్లతోకూడిన మెయిన్‌గ్రిడ్ పనులు 95 శాతం అయిపోయాయి. గ్రామాల్లో అంతర్గత పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తంగా ప్రాజెక్టు పనిలో 75 శాతం పూర్తయింది. ఇప్పటికే చాలా గ్రామాలకు నీరు అందుతున్నది. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా కూడా నీరందిస్తున్నారు. వచ్చే నెల చివరినాటికి ప్రతి గ్రామానికి నీరు (బల్క్ సప్లయి) అందాలి. బల్క్ సప్లయిచేసే సందర్భంలో తలెత్తే సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలి. గ్రామాల్లో అంతర్గత పనులను కూడా దసరానాటికి పూర్తిచేయాలనే గడువు విధించుకుని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి. గ్రామాల్లో వేయడానికి కావాల్సిన పైపులైన్లు, నల్లా పైపులు, నల్లాలు, ఇతర పరికరాలను ముందే సేకరించి పెట్టుకోవాలి. దసరానాటికి పనులు పూర్తిచేసి, సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించుకుంటూ పోవాలి. మొత్తంగా డిసెంబర్ నెలాఖరు నాటికి వందకు వందశాతం మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తయి, అన్ని గ్రామాల్లోని అన్ని ఇండ్లకు స్వచ్ఛమైన మంచినీరు చేరాలి. దీనిద్వారా వచ్చే ఎన్నికల లోపు ప్రతీ ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందివ్వకుంటే ఓట్లు అడగం అని తీసుకున్న సవాల్‌ను విజయవంతంగా అమలుచేసినవారమవుతాం. అంతకుమించి ప్రతీరోజు ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందించి ప్రజల ఆరోగ్యాలు కాపాడినవారమవుతాం అని ముఖ్యమంత్రి వివరించారు.
 
మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు ముందుగా నీరివ్వాలి
నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉన్నది. ఆ ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఆ నియోజకవర్గాలకు ముందు నీరివ్వడం ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. వీలైనంత త్వరగా గ్రామాల్లో అంతర్గత పనులు పూర్తికావాలి. ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల పల్లెలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్‌లాంటి జిల్లాలకు ప్రత్యేక వ్యూహం రూపొందించుకోవాలి. అక్కడ పనులు చేయడానికి కూలీలు దొరకరు. మెటీరియల్ సరఫరా చేయడం కూడా కష్టం. కాబట్టి అక్కడ పనులుచేసేవారికి అదనపు ప్రోత్సాహకాలు కూడ అందించే అవకాశం పరిశీలించాలి. చెంచుగూడేలు ఎక్కువగా ఉండే అచ్చంపేటలాంటి నియోజకవర్గాలతోపాటు, పది పదిహేను నివాస ప్రాంతాలుండే అటవీ ఆవాస ప్రాంతాలకు కూడా మంచినీరు అందివ్వాలి. స్థానిక వనరులను గుర్తించి, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసి సురక్షిత మంచినీరు అందించే బాధ్యతను స్వీకరించాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.
MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.