Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు

-నిస్సహాయ మంత్రిగా మిగిలిన కిషన్‌రెడ్డి
-నాణ్యమైన ఖనిజం లేదని ఎలా అంటారు?
-ఆ ప్రకటన వ్యక్తిగతమా? కేంద్ర విధానమా?
-పరిశ్రమ ఏర్పాటు చేయొచ్చని జీఎస్‌ఐ చెప్పలేదా?
-మంత్రి పువ్వాడ, ఎంపీలు నామా, కవిత ఫైర్‌
-నేడు బయ్యారంలో ఒక్కరోజు నిరసన దీక్ష

బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహాయమంత్రి నుంచి క్యాబినెట్‌ మంత్రిగా ఎదిగినా ఇంకా నిస్సహాయ మంత్రిగానే ఉన్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఎద్దేవా చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కిషన్‌రెడ్డి చెప్పింది సొంత అభిప్రాయమా? కేంద్ర ప్రభుత్వ విధానమా? అని నిలదీశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని, దీని కోసం బుధవారం బయ్యారంలో నిరసన దీక్ష చేపడుతామని మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత ప్రకటించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మంత్రి పువ్వాడ, ఎంపీలు నామా, కవిత మీడియాతో మాట్లాడారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధ్యంకాదన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఉక్కు పరిశ్రమ వస్తే ఉద్యోగాలు లభిస్తాయని స్థానిక గిరిజనులు, ఇతరులు ఆశగా ఎదురుచూశారని, వారి ఆశలపై కిషన్‌రెడ్డి నీల్లు చల్లారని మండిపడ్డారు. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లభిస్తుందని జీఎస్‌ఐ సర్వేచేసి తేలిస్తే, కిషన్‌రెడ్డి అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. నాణ్యమైన ఐరన్‌ ఓర్‌ లేనప్పుడు కనీసం పెల్లెట్ల యూనిట్‌ అయినా ఏర్పాటు చేస్తామని గతంలో కేంద్ర మంత్రి బీరేందర్‌ సింగ్‌ తెలిపారని, అదీ అమలు కాలేదని విమర్శించారు.

పార్లమెంట్‌లో పోరాడుతాం: నామా
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేసి, ఆ క్రెడిట్‌ను బీజేపీయే తీసుకోవచ్చని కిషన్‌రెడ్డికి నామా నాగేశ్వర్‌రావు సూచించారు. ఉక్కు పరిశ్రమను మంజూరు చేస్తే కిషన్‌రెడ్డిని సన్మానిస్తామని తెలిపారు. ఉక్కు పరిశ్రమ కోసం పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. ఈ పరిశ్రమ కోసం గతంలో అనేకసార్లు సీఎం కేసీఆర్‌ ప్రధానికి వినతి పత్రం ఇచ్చారని, మంత్రి కేటీఆర్‌ స్వయంగా అధికారులను, కేంద్ర మంత్రులను కలిశారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బయ్యారానికి సంబంధించిన 56 వేల హెక్టార్ల భూమిని ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చారని, 4 లక్షల టన్నుల ఖనిజాన్ని అక్కడి నుంచి తరలించారని తెలిపారు. కిషన్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని సూచించారు. కేంద్రానికి తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దేశంలో అన్ని రోడ్డు నిర్మాణ ప్రాజెక్టుల భూ సేకరణకు కేంద్రమే నిధులు భరిస్తుండగా, తెలంగాణలోని ఆర్‌ఆర్‌ఆర్‌ భూ సేకరణలో సగం నిధులు రాష్ట్రప్రభుత్వం భరించాలనడం వివక్షే అవుతుందని అన్నారు.

బీజేపీ నేతలను ప్రజలు తరిమికొడతారు: కవిత
బయ్యారం ఉక్కు పరిశ్రమపై కిషన్‌రెడ్డి ప్రకటనను నిరసిస్తూ బుధవారం బయ్యారంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు నిరసన దీక్ష చేపడతామని ఎంపీ మాలోత్‌ కవిత తెలిపారు. బీజేపీ నేతలు బయ్యారం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో పర్యటిస్తే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని, దీని కోసం ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.