-24 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ
-ఆరు లక్షల మంది బాలికలకు ప్రయోజనం
-ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్ల పంపిణీ
-డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్ణయం
రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన అన్ని రకాల ఉన్నత పాఠశాలల తోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినులకు బాలిక ఆరోగ్య రక్ష పథకం ద్వారా హెల్త్ అండ్ హైజీన్ కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 24 నుంచి 31 వరకు నిర్వహించాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడి యం శ్రీహరి నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12 నుంచి 18 సంవత్సరాల వయసున్న బాలికలందరికీ ఈ కిట్లను ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 24న వరంగల్ జిల్లాలో అధికారికంగా డిప్యూటీ సీఎం కడియం ప్రారంభించనున్నారు. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కిట్లను పంపిణీ చేస్తారు. కిట్ల పంపిణీ అంశంపై కడియం శ్రీహరి మంగళవారం తన కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 31 జిల్లాల్లో విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఉన్నతవిద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, ఇంటర్‌బోర్డు సెక్రటరీ అశోక్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ టీ విజయ్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ మల్లేశం పాల్గొన్నారు.
ఒక్కో కిట్ ఖరీదు రూ.1600 7వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థినికి మూడు నెలలకు ఒకసారి చొప్పున మొత్తంగా నాలుగుసార్లు ఈ కిట్లు అందిస్తారు. ఈ నాలుగు కిట్ల ఖరీదు రూ.1600గా నిర్ణయించారు. దీనిలో బాలికల ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఉంటాయని కడియం తెలిపారు. రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది బాలికలకు ఆరోగ్య కిట్ల పంపిణీకి ప్రభుత్వం రూ.100 కోట్లను వెచ్చించింది. ఒక్కో కిట్‌లో 13 రకాలైన మొత్తం 21 వస్తువులను అందించనున్నారు.
25 నుంచి హరిత పాఠశాల-హరిత తెలంగాణ -రాష్ట్రంలోని 40 లక్షల మంది విద్యార్థులతో కోటి పండ్లు, పూల మొక్కలు నాటే లక్ష్యం -హరితహారంపై సమీక్షలో ఉపముఖ్యమంత్రి కడియం ఆదేశాలు
హరిత పాఠశాల-హరిత తెలంగాణ నినాదంతో రాష్ట్రంలోని అన్నివిద్యాసంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి భారీఎత్తున చేపట్టాలని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 40 లక్షల మంది విద్యార్థులతో కోటి పండ్లు, పూల మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో హరితహారంపై సంబంధిత అధికారులతో మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. విద్యాసంస్థల్లో హరిత పాఠశాల-హరిత తెలంగాణ ప్రత్యేక కార్యక్రమంపై 31 జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ, అటవీశాఖ అధికారులు, ఇతర సిబ్బందితో వెంటనే వీడియోకాన్ఫెరెన్స్ నిర్వహించాలని కడియం సూచించారు. విద్యాశాఖలో హరితహారం నిర్వహణకు విద్యార్థులతో గ్రీన్‌బ్రిగేడ్లను ప్రతిపాఠశాలలో ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు కడియం తెలిపారు.

