-19న లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం శ్రీ కేసీఆర్ -దేశానికే ఆదర్శం తెలంగాణ వ్యవసాయం -1.42 కోట్ల ఎకరాలకు పంట పెట్టుబడి కింద రూ.5,680 కోట్ల మొత్తం పంపిణీ -చెక్కుల రూపంలోనే సాయం -నగదు కొరత రాకుండా బ్యాంకులతో సంప్రదింపులు -శాసనమండలిలో మంత్రి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పంట పెట్టుబడి సాయం పథకం ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభంకానున్నది. ఆ మరుసటిరోజు నుంచి మే 31 వరకు ఆయా గ్రామాల్లో రైతులకు పంట సాయం కింద ఎకరానికి రూ.4వేల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 1.42 కోట్ల ఎకరాలకు పంట పెట్టుబడి కింద రూ.5,680 కోట్ల మొత్తాన్ని చెక్కులరూపంలో పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం శాసనమండలిలో ప్రకటించారు. దేశానికే తెలంగాణ వ్యవసాయం ఆదర్శంగా నిలువనున్నదని, తెలంగాణ రైతులు అప్పులపాలు కాకుండా, వారి ఆత్మగౌరవం కాపాడేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ఫలిస్తున్నదని చెప్పారు. అందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చెక్కుల రూపంలోనే పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని చెప్పారు.
ప్రశ్నోత్తరాల సమయంలో మండలిలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ఈ పథకం దేశాన్నే కదిలించిందని పేర్కొన్నారు. ఇలాంటి బ్రహ్మాండమైన పథకం దేశంలో, బహుశా ప్రపంచంలోనే ఎక్కడా ఉండకపోవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. దీనివల్ల 72 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగేలా భారీ ప్రణాళిక రూపొందించామన్నారు. బ్యాంకులలో నగదు కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో ఇప్పటికే చర్చించగా.. అందుకు వారు సానుకూలత వ్యక్తం చేశారని వివరించారు. చెక్కుల పంపిణీ క్రమంలో రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని కోణాలలో ఆలోచించామని మంత్రి తెలిపారు.
పట్టాదారులకే చెక్కుల పంపిణీ 1.42 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి పట్టాదారులకు మాత్రమే చెక్కుల రూపంలో పెట్టుబడి సాయం చెల్లిస్తామని, కౌలుదారుల పేరిట చెక్కుల పంపిణీ ఉండబోదని మంత్రి పోచారం వివరణ ఇచ్చారు. హార్టికల్చర్ కోసం కూడా ఎకరానికి రూ.4,000 పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. ఏ పంటలు వేయాలనే నిర్ణయాలు ఇకనుంచి స్థానికంగా ఏఈవోల ఆధ్వర్యంలో రైతులే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు రైతులకు పంటలపై స్పష్టత వస్తున్నదని అన్నారు. విత్తనాలు, ఎరువులను కూడా రైతులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వమే శ్రీకారం చుడుతుందని చెప్పారు. రైతు పెట్టుబడి సాయంతోపాటు వ్యవసాయ పనిముట్లను కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, మండలి సభ్యులు టీ భానుప్రసాదరావు, వీ భూపాల్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

