-పార్లమెంటరీ స్థానాల్లో పార్టీ క్యాడర్‌కు -దిశానిర్దేశం చేయనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -6 నుంచి 9వ తేదీ వరకు మొదటి విడత.. -13 నుంచి 17 వరకు రెండో విడత సమావేశాలు -రెండు విడుతల్లో పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలు -క్యాడర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం -ఒక్కో సమావేశానికి 15 వేల మంది హాజరు -లోక్‌సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సమాయత్తం
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు ఈ నెల ఆరోతేదీనుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి ఆరు నుంచి తొమ్మిది వరకు తొలి విడుతలో, మార్చి 13 నుంచి 17 వరకు మలివిడుతలో సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత మార్చి ఒకటి నుంచి సమావేశాలు నిర్వహించాలని భావించినా.. దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదావేశారు. మహాశివరాత్రి అనంతరం సమావేశాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ సమావేశాలన్నింటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హాజరుకానున్నట్టు పల్లా పేర్కొన్నారు. మొదటి సమావేశం కరీంనగర్ నియోజకవర్గంలో నిర్వహించనున్నారు. నాగర్‌కర్నూలు నియోజకవర్గ సమావేశం వనపర్తిలో, పెద్దపల్లి సమావేశం రామగుండంలో, జహీరాబాద్ నియోజకవర్గ సభ నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద జరుగుతాయి. మిగిలిన నియోజకవర్గాల సమావేశాలు ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో ఏర్పాటుచేస్తున్నారు. కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గ సమావేశాలు మినహా మిగిలిన రోజుల్లో ప్రతి రోజు రెండు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మొదటి సమావేశం, మధ్యాహ్నం 2.30 గంటలకు రెండో సమావేశం ఉంటుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాడర్‌ను లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తంచేయడంతోపాటు, దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వ్యూహరచన చేశారు.
15 వేలమందితో సమావేశం ఈ సమావేశాలకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు రెండు వేలమంది చొప్పున.. మొత్తం సుమారు 15 వేలమందితో ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ సమావేశం జరుగనున్నది. కేటీఆర్ కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి బస చేసే అవకాశమున్నదని సమాచారం. అక్కడి ముఖ్య నాయకులను కూర్చోబెట్టి సమన్వయం చేయనున్నారని తెలిసింది. పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినదాని కంటే ఎక్కువ మెజార్టీ వచ్చేలా ప్రణాళిక సిద్ధంచేశారు.
ఆహ్వానితులు వీరే ఈ సమావేశాలకు జిల్లా మంత్రి, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జి కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు, గ్రామస్థాయి పార్టీ అధ్యక్షులు, గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, నియోజకవర్గస్థాయి నాయకులు హాజరుకానున్నారు.

