-వ్యవసాయం,నీటిపారుదల, సంక్షేమం.. -విద్యా, పోలీసుశాఖలకు పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వంలోని 25 శాఖలకు కేంద్రం నుంచి గ్రాంట్లుగా రూ.23,475.34 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని ప్రభుత్వం కోరింది. శుక్రవారం గ్రాండ్ కాకతీయ హోటల్‌లో జరిగిన 14వ ఆర్థిక సంఘం సమావేశంలో ప్రభుత్వం వివిధశాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించింది. ఇందులో భాగంగా పన్నుల వాటాను పెంచాలని కోరడమే కాకుండా, గ్రాంట్లుగా శాఖల వారీగా నిధులను కోరారు. నీటిపారుదల, విద్యా, వ్యవసాయం, పోలీసుశాఖల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం నివేదికను సమర్పించింది. 13వ ఆర్థిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,14,000 కోట్లను ఐదు సంవత్సరాలకు అందించింది.
ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా లెక్కిస్తే సుమారు రూ.1, 50,000 కోట్ల వరకు నిధులు ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు 42ః58 నిష్పతిగా విభజిస్తే తెలంగాణ రాష్ర్టానికి 14వ ఆర్థిక సంఘం నిధులు ఐదు సంవత్సరాలకు సుమారు రూ.60వేల కోట్ల వరకు రావచ్చని అంచనా. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.83,000 ఉంది. 14వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సందర్భంగా ఆర్థిక, వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, హైదరాబాద్ పోలీసింగ్, సంక్షేమరంగాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
-నీటి నిర్వహణ, నీటి వనరుల అభివృద్ధి కోసం రూ.7,700 కోట్లు. -విత్తన కేంద్రాల అభివృద్ధికి రూ.500 కోట్లు. -ఆరోగ్య శాఖకు రూ.500 కోట్లు. -అడవుల పరిరక్షణ, హరితహారం కోసం రూ.1,046.50 కోట్లు. -ప్రాథమిక విద్య, సర్వశిక్షా అభియాన్ కింద రూ.1327.38 కోట్లు. -ఉన్నతవిద్య, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి రూ.900 కోట్లు. -బీసీ సంక్షేమం, విద్యా మౌలికసదుపాయాల కోసం రూ.273.30 కోట్లు. -షెడ్యూల్డు కులాల అభివృద్ధి కోసం రూ.133.60 కోట్లు. -రోడ్లు, వంతెనల అభివృద్ధి, నిర్వహణ కోసం రూ.1000 కోట్లు. -విద్యుత్, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాకు రూ.1316 కోట్లు. -గిడ్డంగుల నిర్మాణానికి రూ.106.36 కోట్లు. -మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 23 కోట్లు. -పాడి పరిశ్రమాభివృద్ధికి రూ.241 కోట్లు. -న్యాయవ్యవస్థ అభివృద్ధికి రూ.977.64 కోట్లు. -పోలీసు శాఖ అభివృద్ధి కోసం రూ.4216.22 కోట్లు. -జైళ్ల అభివృద్ధికి రూ.135.82 కోట్లు. -పర్యావరణశాఖకు రూ.100 కోట్లు. -ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధికి రూ.1091.25 కోట్లు -పారిశ్రామికవాడల నిర్వహణకు రూ.313.36 కోట్లు. -పురావస్తు, పర్యాటక, సాంస్కృతికశాఖలకు రూ.203.05 కోట్లు. -రాష్ట్ర విపత్తుల నిర్వహణ, అగ్నిమాపకశాఖకు రూ.614.62 కోట్లు. -డీపీపీల వికేంద్రీకరణ, ప్రణాళిక కోసం రూ.250 కోట్లు. -పథకాల పర్యవేక్షణ, అమలు కోసం రూ.106.36 కోట్లు. -సమగ్ర ఆర్థిక నిర్వహణ కోసం రూ.100 కోట్లు. -గిరిజన సంక్షేమానికి రూ.355.84 కోట్లు.