-చెప్పినదానికంటే వెయ్యి ఎక్కువే ఇస్తాం: సీఎం కేసీఆర్ -టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పనితీరు భేష్ -ప్రతిపక్షాల నిర్మాణాత్మక సలహాలు స్వీకరిస్తాం -అడ్డగోలుగా మాట్లాడితే గౌరవం ఉండదు -అంబేద్కర్ ఓవర్సీస్పథకానికి పరిమితి లేదు -అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ముఖ్యమంత్రి వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న లక్షా 12 వేల ఉద్యోగాలు వంద శాతం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. చెప్పినదానికంటే ఓ వెయ్యి ఎక్కువే ఇస్తామని అన్నారు. శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, గ్రూప్-2 అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి ఎలాంటి పరిమితి లేదన్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు. బలహీనవర్గాలకోసం అనేక పథకాలు తీసుకొచ్చామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ఉంటుందన్నారు.
ఘంటా చక్రపాణిపై ప్రశంసలు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశంసలు కురిపించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిబంధనలను పాటించకపోవడంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదన్నారు. దీనిపై సీఎం స్పందించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ దళిత సోదరుడు. ఓపెన్ యూనివర్సిటీలో పనిచేసిన వ్యక్తి. ఇండియాలో యంగెస్ట్ స్టేట్ అయినప్పటికీ.. టీఎస్‌పీఎస్సీలో చేసిన సంస్కరణలను, ప్రతిభను గుర్తించి చక్రపాణిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభినందించి, యూపీఎస్సీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించింది అని చెప్పారు. గత చరిత్రలో ఏపీకి ఎప్పుడూ ఇలాంటి అభినందన రాలేదన్నారు. చక్రపాణిని అభినందించాల్సిది పోయి.. నిందించడం తగదని హితవుపలికారు. ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరూ పద్ధతి ప్రకారం వ్యవహరించాలి. ప్రభుత్వంలో చిన్నచిన్న పొరపాట్లు సహజం. వాటిని గుర్తించి మార్పులు.. చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కావాలని ప్రభుత్వం తప్పులు చేయదు అని సీఎం చెప్పారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పంథాలో సలహాలిస్తే స్వీకరిస్తామని స్పష్టంచేశారు. కానీ.. అడ్డగోలుగా మాట్లాడితే గౌరవం ఉండదని హెచ్చరించారు. అసెంబ్లీలో అర్థవంతంగా, ఆదర్శంగా మాట్లాడితే ప్రతిష్ఠ పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రభుత్వంలో అవకాశం ఉన్నంతవరకు ఉద్యోగాలు భర్తీచేస్తాం. చెప్పిన దానికంటే వెయ్యి ఉద్యోగాలు ఎక్కువగానే ఇస్తాం అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బలహీనవర్గాల విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని సీఎం వివరించారు. గురుకుల పాఠశాలల ఏర్పాటుతో ప్రతి విద్యార్థి మీద 1.20 లక్షలు ఖర్చుచేసే విధానం తీసుకొచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ బిల్లు తెచ్చిన తర్వాత సభలోని సభ్యులందరికీ లక్ష పేజీలతో కూడిన వివరాలను పెన్‌డ్రైవ్‌లో అందజేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు

